భలే.. భలే.. బ్రెడ్‌ఫ్రూట్‌!

చిన్నారులమైన మనకు బ్రెడ్‌ అంటే భలే ఇష్టం కదూ! పండ్లన్నా అంతే ఇష్టంగా తింటాం!! మరి పండే బ్రెడ్‌, బ్రెడ్డే పండైతే.. ఎలా ఉంటుంది?! ‘ఇది అసాధ్యం. కేవలం ఊహల్లోనే సాధ్యం అంటారు కదూ!’

Updated : 23 Feb 2024 04:34 IST

చిన్నారులమైన మనకు బ్రెడ్‌ అంటే భలే ఇష్టం కదూ! పండ్లన్నా అంతే ఇష్టంగా తింటాం!! మరి పండే బ్రెడ్‌, బ్రెడ్డే పండైతే.. ఎలా ఉంటుంది?! ‘ఇది అసాధ్యం. కేవలం ఊహల్లోనే సాధ్యం అంటారు కదూ!’ అయితే మీరు తప్పులో కాలేసినట్లే నేస్తాలూ! ఎందుకంటే అలాంటి ఓ పండుంది!! మరి ఇప్పుడు మనం ఎంచక్కా దాని గురించి తెలుసుకుందామా!

చూడ్డానికి కాస్త పనసలా కనిపిస్తున్న ఈ పండు పేరు బ్రెడ్‌ఫ్రూట్‌. నిజానికి బ్రెడ్‌ఫ్రూట్‌ చెట్టు మలబరీ జాతికి చెందింది. పేరుకే ఇది పండు కానీ... దీన్ని ఎంచక్కా కాల్చుకుని, వండుకుని తింటారు. దీని రుచి కాల్చిన బ్రెడ్‌, కాస్త బంగాళదుంపలా ఉంటుంది. అందుకే దీనికి బ్రెడ్‌ఫ్రూట్‌ అనే పేరు వచ్చింది. న్యూగినియా, మలుకు దీవులు, ఫిలిప్పీన్స్‌ దీని స్వస్థలంగా భావిస్తారు. బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ నావికుల వల్ల ఈ జాతి మొక్కలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ప్రస్తుతం అమెరికా, కరేబియన్‌ దీవుల్లో, ఆగ్నేయాసియాలో దాదాపు 90 దేశాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయి.

‘కలప’ వృక్షం!

ఈ బ్రెడ్‌ ఫ్రూట్‌ చెట్టు దాదాపు 26 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఒత్తైన పెద్దవైన పత్రాలుంటాయి. మరో విషయం ఏంటంటే ఈ చెట్టు నుంచి రబ్బరు తయారీలో ఉపయోగించే పాల వంటి లాటెక్స్‌ అనే పదార్థం వస్తుంది. దీన్ని పడవల నిర్మాణంలో వాడతారు. బ్రెడ్‌ఫ్రూట్‌ చెట్టు కలపతోనూ చక్కని ఉపయోగాలున్నాయి. ఇళ్ల నిర్మాణం, గృహోపకరణాల తయారీలో కూడా వాడతారు.

ఫలమ్ము నిశ్చయమ్ము!

ఒక్కో చెట్టుకు ప్రతి సీజన్‌లోనూ 200లకు పైగానే కాయలు కాస్తాయి. ఒక్కో కాయ బరువు 25 గ్రాముల నుంచి 6 కిలోగ్రాముల వరకూ ఉంటుంది. ఒక్క ఎకరాకే 6 నుంచి 13 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మన దేశంలోనూ చాలా తక్కువ పరిమాణంలో కేరళ, నైరుతి కొంకణ్‌ తీరంలో వీటిని సాగు చేస్తున్నారు.

పోషకాల నిధి!

బ్రెడ్‌ఫ్రూట్‌లో విటమిన్‌- సి, ఎ ఎక్కువగా ఉంటాయి. ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం కూడా పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఈ చెట్టుకు ఔషధ గుణాలూ ఉన్నాయి. పత్రాలు, వేర్లను మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఉబ్బసం, నడుం నొప్పి, చెవి ఇన్‌ఫెక్షన్లు, గాయాలు మాన్పించడంలో చక్కగా పనిచేస్తాయని పరిశోధనలో తేలిందట. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ బ్రెడ్‌ఫ్రూట్‌ విశేషాలు. నిజంగా భలేగా ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని