అరుదైన చెట్టు.. అదిరేట్టు!

నేస్తాలూ.. ఈ ప్రపంచం మొత్తం ఎన్నో వింతలతో కూడుకుంది. అలాంటి జాబితాలోకే వస్తుంది ఈ చెట్టు. భూగోళం మొత్తంలో కేవలం ఒక్క దీవిలోనే ఈ వృక్షాలు కనిపిస్తాయి.

Updated : 26 Feb 2024 05:01 IST

నేస్తాలూ.. ఈ ప్రపంచం మొత్తం ఎన్నో వింతలతో కూడుకుంది. అలాంటి జాబితాలోకే వస్తుంది ఈ చెట్టు. భూగోళం మొత్తంలో కేవలం ఒక్క దీవిలోనే ఈ వృక్షాలు కనిపిస్తాయి. ఆ చెట్ల విశేషాలేంటో తెలుసుకుందామా మరి!

గొడుగులా పెరిగిన ఈ చెట్టు పేరు డ్రాగన్‌ బ్లడ్‌ ట్రీ. ఇవి యెమన్‌లోని సోకోత్రా ద్వీపసముదాయంలో మాత్రమే కనిపిస్తాయి. ఇక ప్రపంచంలో ఇంకెక్కడా ఇవి పెరగవు! డ్రాగన్‌ బ్లడ్‌ చెట్లు దాదాపు 650 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇవి ఎక్కువగా వేడి, తేమ ఉన్న వాతావరణంలోనే బతుకుతాయి.

బెరడులో రక్తం!

ఈ చెట్టు బెరడును నరికితే అచ్చం రక్తంలాంటి ద్రవం కనిపిస్తుంది. దీన్ని స్థానికులు డ్రాగన్‌ బ్లడ్‌ అని పిలుస్తారు. అందుకే దీన్ని డ్రాగన్‌ బ్లడ్‌ ట్రీ అని పిలుస్తుంటారు. వృక్షంలో ఇలాంటి ద్రవం అధికంగా ఉండటం వల్లే కరవు పరిస్థితుల్లోనూ ఎంచక్కా జీవించే ఉంటుంది.

ఔషధాల నిలయం!

స్థానికులు ఈ ద్రవంలో ఎన్నో ఔషధ విలువలున్నాయని నమ్ముతారు. అందుకే దీన్ని జ్వరం, అల్సర్లు, నొప్పుల నివారణకు వాడుతుంటారట. ఈ వింతచెట్లు పెరిగే ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగానూ గుర్తించింది. మరో విషయం ఏంటంటే ఈ ప్రదేశంలో నీటి కొరత ఏర్పడకపోవడానికి ఈ డ్రాగన్‌ బ్లడ్‌ వృక్షాలే కారణమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

మార్చిలో పువ్వులే పువ్వులు!

డ్రాగన్‌ బ్లడ్‌ వృక్షాలు మార్చిలో పువ్వులు పూస్తాయి. ఇవి కొమ్మల చివర పెరుగుతాయి. పండ్లుగా మారడానికి దాదాపు అయిదు నెలలు పడుతుంది. ఈ పండ్లు ముందు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తర్వాత నలుపు వర్ణంలోకి మారతాయి. ఇవి విషపూరితం కాదు. ఎంచక్కా వీటిని పశువులు తింటాయి.

రాను రాను కష్టమే...

పర్యావరణ మార్పులు, మానవ కార్యకలాపాలు, పశువులకు ఈ చెట్ల పూలు, పండ్లను ఎక్కువగా తినిపించడం వల్ల కొత్త మొక్కల సంఖ్య పెరగడం లేదు. సోకోత్రా దీవిలో నీటి లభ్యత తగ్గుతుండటం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో ఈ చెట్ల సంఖ్య మరింతగా తగ్గే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ఈ విచిత్ర చెట్టు సంగతులు. భలే ఉన్నాయి కదూ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని