భయంకరమైన బల్లి షార్క్‌!

నేస్తాలూ.. మీరంతా ‘బల్లి ఏంటి.. షార్క్‌ ఏంటి..? అసలు ఇదేం జీవి’ అని తెగ ఆశ్చర్యపోతున్నారు కదూ! నా గురించి మీకు అస్సలు తెలియదు కదా! అందుకే ఆ విశేషాలన్నీ చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

Published : 28 Feb 2024 00:13 IST

నేస్తాలూ.. మీరంతా ‘బల్లి ఏంటి.. షార్క్‌ ఏంటి..? అసలు ఇదేం జీవి’ అని తెగ ఆశ్చర్యపోతున్నారు కదూ! నా గురించి మీకు అస్సలు తెలియదు కదా! అందుకే ఆ విశేషాలన్నీ చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. తెలుసుకుంటారా.. మరి!! 

నా పేరు బల్లి షార్క్‌. నాకు ఫ్రిల్డ్‌ షార్క్‌ అనే పేరు కూడా ఉంది తెలుసా. మరో విషయం ఏంటంటే నన్ను సజీవ శిలాజం అనీ పిలుస్తుంటారు. ఎందుకంటే నేను ప్రాచీనకాలం నుంచి ఈ భూగోళంలో జీవిస్తున్నాను కాబట్టి. నేను రెండు మీటర్ల పొడవు, వెడల్పైన మూతితో కాస్త భయంకరంగా ఉంటాను. నాలో మళ్లీ రెండు రకాలున్నాయి. మేం అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహా సముద్రాల్లో జీవిస్తుంటాం.  

ఏం తింటామంటే...

మేం ఎక్కువ శాతం సముద్రం అడుగున, నేలను ఆనుకునే జీవిస్తుంటాం. చిన్న చిన్న ఇతర షార్క్‌లు, ఆక్టోపస్‌లు, నత్తలు, చేపలు, పీతల్లాంటి జీవులను తిని బొజ్జ నింపుకుంటాను. నేను నా ఆహారాన్ని అస్సలు నమలను. మొత్తంగా మింగేస్తా. నా బలమైన, పెద్దవైన దవడల సాయంతోనే ఇలా చేయగలుగుతాను. మీరు మాత్రం మీ ఇంట్లో అమ్మ మీకు వడ్డించే ఆహారాన్ని చక్కగా నమిలి మింగండి సరేనా!

ఎంత లోతులో అంటే...

నేను సముద్రాల్లో దాదాపు 50 నుంచి 200 మీటర్ల లోతులో జీవిస్తాను. నార్వే, స్కాట్లాండ్‌, జపాన్‌, ఐర్లాండ్‌, ఫ్రాన్స్‌ నుంచి మొరాకోను ఆనుకుని ఉన్న సముద్ర జలాల్లో ఎక్కువగా ఉంటాను. మీ మనుషులు సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు వలల్లో నేను కూడా అప్పుడప్పుడు చిక్కుకుంటాను. చాలా సార్లు నేను వారి వలలను ధ్వంసం చేస్తుంటా. నాకు కూడా కాస్తోకూస్తో వాణిజ్య విలువ ఉంది. నా మాంసం కూడా అచ్చంగా చేపల మాంసంలానే ఉంటుంది.  

దంతాలే దంతాలు!

నేను నోరు తెరిస్తే మీరంతా భయపడతారు. ఎందుకంటే సూదుల్లాంటి చాలా పదునైన దంతాలు దాదాపు 300 వరకు ఉంటాయి. ఇవి నాకు వేట సమయంలో సాయపడతాయి. మరో విషయం ఏంటంటే నేను నిజానికి షార్క్‌ జాతికి చెందిన జీవినే అయినప్పటికీ చూడ్డానికి మాత్రం ఈల్‌లా ఉంటాను. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! అన్నట్లు చెప్పడం మరిచాను.. నేనైతే ఎంచక్కా సముద్రంలో ఉంటాను. ఎండంటే మాకు తెలియదు. ఒకవేళ కాస్త జలాలు వేడెక్కినా.. ఎంచక్కా లోతుకు వెళ్లిపోతా. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. మీ దగ్గర ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కదా! ఎక్కువగా ఎండల్లో తిరగకండి, ఇప్పటి నుంచే ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి. రుచిగా ఉంటున్నాయి కదా.. అని అదేపనిగా వేపుళ్లు తినకండి. కొబ్బరినీరు, పుచ్చకాయ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోండి. సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే తీసుకోండి సరేనా.. ఇక ఉంటా మరి బై... బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని