భలే జంబో జంప్‌..!

హాయ్‌ నేస్తాలూ..! మనకు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. ఎంచక్కా ఆడుకోవాలని చూస్తాం. సెలవు రోజుల్లో అయితే.. పార్కులకు, ఎగ్జిబిషన్లకు తీసుకెళ్లమని ఇంట్లో మారాం చేస్తుంటాం.

Published : 29 Feb 2024 02:48 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. ఎంచక్కా ఆడుకోవాలని చూస్తాం. సెలవు రోజుల్లో అయితే.. పార్కులకు, ఎగ్జిబిషన్లకు తీసుకెళ్లమని ఇంట్లో మారాం చేస్తుంటాం. అంతే కదా! అక్కడికి వెళ్లాక మనకు నచ్చిన ఆటలు ఆడుకుంటాం. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారా..? ఈ కథనం చదివేయండి ఎందుకో మీకే తెలిసిపోతుంది..!

పార్కులకు, ఎగ్జిబిషన్లకు వెళ్లినప్పుడు రకరకాల ఆట వస్తువులు చూస్తుంటాం. అందులో జంబో జంప్‌ కూడా ఒకటి. అది ఎక్కి ఆడుకోవడానికి పిల్లలు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ అన్నిచోట్లా పెద్దవి ఉండవు కాబట్టి, ఎక్కువ సార్లు ఆడుకునే అవకాశం రాదు... అంతే కదా! కానీ పక్క దేశమైన పాకిస్థాన్‌లోని కరాచీలో మాత్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద జంబో జంప్‌ని ఏర్పాటు చేశారు నేస్తాలూ..!

 ప్రత్యేకమైన థీమ్‌..

 ఒకే విధంగా కాకుండా ఇల్లు, ఫొటో బూత్‌.. పిల్లలకు నచ్చేలా ఐస్‌క్రీం, డోనట్స్‌ ఆకారాలు ఇలా రకరకాల థీమ్‌లతో దాన్ని ఏర్పాటు చేశారట. దీని నిర్మాణం పూర్తవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందట. 15,295.51 చదరపు అడుగుల పరిమాణంలో ఈ జంబో జంప్‌ని ఏర్పాటు చేశారు. ఇంకో విషయం ఏంటంటే.. ఒకేసారి దీంట్లో దాదాపు 200 మంది ఆడుకోవచ్చట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే నేస్తాలూ..!

రద్దీ ఎక్కువే..!

ఆ చుట్టు పక్కల వాళ్లే కాకుండా చాలా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తుంటారట. సాధారణ రోజుల కంటే వారాంతాల్లో, సెలవు రోజుల్లో అక్కడ ఎక్కువ రద్దీ ఉంటుందట. మీకో విషయం తెలుసా.. ఇక్కడ పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్లు కూడా ఎంచక్కా ఆడుకోవచ్చట. మరి ఇంత మంచి ఆట స్థలానికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది. ఇటీవలే ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు గుర్తించి.. అవార్డు కూడా అందించారు. ఇవీ ఫ్రెండ్స్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద జంబో జంప్‌ విశేషాలు. వెంటనే.. మీకు అక్కడికి వెళ్లాలని ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని