నేను తేనెటీగలను తింటా..!

హాయ్‌ నేస్తాలూ..! అలా చూస్తున్నారేంటి? మీరు అలా చూడటం ఆపేస్తే నేను మాట్లాడతాను.. ఇంతకీ ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా.

Published : 02 Mar 2024 00:02 IST

హాయ్‌ నేస్తాలూ..! అలా చూస్తున్నారేంటి? మీరు అలా చూడటం ఆపేస్తే నేను మాట్లాడతాను.. ఇంతకీ ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా. చూడటానికి ఇంతే ఉంది కానీ.. బాగా మాట్లాడుతుందే అనుకుంటున్నారా? నేను మీకు పెద్దగా తెలిసి ఉండను.. అందుకే సరదాగా ఎగురుంటూ వచ్చా.. మీకు ఒకసారి పరిచయం చేసుకొని వెళ్దామని. మరి ఇంకా ఆలస్యమెందుకు వెంటనే ఈ కథనం చదివేయండి..!

నన్ను ‘ఏషియన్‌ గ్రీన్‌ బీ- ఈటర్‌’ అని పిలుస్తారు. ఇది చూస్తే.. పక్షిలా ఉంది పేరులో మాత్రం ‘బీ’ అని ఉంది అనుకుంటున్నారా.. దానికి ఒక కారణం ఉంది. నేను ఆహారంగా తేనెటీగలను తీసుకుంటాను. అందుకే.. నా పేరులో ఆ పదం చేరింది. నేను ఎక్కువగా మీ దేశంతో పాటుగా ఇరాన్‌, చైనా, నేపాల్‌ వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను.

నేనే ప్రత్యేకం..

మాలో చాలా రకాల పక్షులు ఉంటాయి. కానీ అన్నింటిలోకెల్లా.. నా రంగు చాలా ప్రత్యేకం. చూసిన వెంటనే నచ్చేస్తాను తెలుసా..! నా శరీరం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కళ్ల దగ్గర నలుపు, గొంతు దగ్గర నీలం రంగుతో చాలా అందంగా కనిపిస్తాను. నా కళ్లు ఎరుపు, కాళ్లు, ముక్కు ముదురు బూడిద రంగులో ఉంటాయి.  తోక కూడా కాస్త పొడవుగానే ఉంటుంది. మేము ఎక్కువగా గుంపులుగా ఉండటానికే ఇష్టపడతాం. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే ఒంటరిగా బయటికి వెళ్తాం. ఒక్కో గుంపులో దాదాపు 30 నుంచి 300 పక్షుల వరకు ఉంటాయి.

అవే ఎక్కువ..

నేను చిన్నచిన్న కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటాను. కానీ తేనెటీగలనే ఎక్కువగా తింటాను. అవి అంటే నాకు చాలా ఇష్టమన్నమాట. వాటిని తినేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. ఒక్కసారిగా అన్నీ కలిసి నన్ను చుట్టుముట్టి చంపేస్తాయి. నేను పుట్టిన తర్వాత కనీసం ఒక నెల రోజుల వరకు అసలు బయటికే రాను. మా అమ్మే అన్నీ చూసుకుంటుంది. నాకు ఎక్కువసేపు ఎగరడం అంటే చాలా ఇష్టం. అందుకే అసలు గూటిలో ఉండకుండా తిరుగుతూనే ఉంటాను. నేను గంటకు 42 కిలో మీటర్ల వేగంతో ఎగరగలను. 15 నుంచి 20 గ్రాముల బరువు తూగుతాను. దాదాపు 16 సెంటీ మీటర్ల పొడవుంటాను. సాధారణంగా అయితే 12 సంవత్సరాలు, రక్షణ కల్పిస్తే.. 18 ఏళ్ల వరకు జీవిస్తాను. మొత్తానికి ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదా నేస్తాలూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని