నేను చక్కని గూడు కడతా..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా..! ఏంటి అంత ఇబ్బందిగా చూస్తున్నారు? ఓ.. నా రంగు అంతగా నచ్చలేదా!

Updated : 08 Mar 2024 05:04 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా..! ఏంటి అంత ఇబ్బందిగా చూస్తున్నారు? ఓ.. నా రంగు అంతగా నచ్చలేదా! కానీ ఏం చేస్తాం, దాన్ని మార్చలేం కదా! ఇంతకీ నేనెవరో నా వివరాలేంటో తెలియదుగా మీకు.. అయితే ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి. నా పూర్తి వివరాలు ఇట్టే తెలుస్తాయి!

నా పేరు పర్పుల్‌ మార్టిన్‌. నా రంగు వల్ల నాకు ఆ పేరు వచ్చింది. కానీ.. నాది పూర్తిగా పర్పుల్‌ రంగు కానే కాదు. ముదురు నలుపు, నీలం రంగులో ఉంటాను. నేను అమెరికాకు చెందిన పక్షిని. అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. ఉత్తర అమెరికా ప్రాంతంలో.. మా జాతిలో నేనే అతిపెద్ద పక్షిని తెలుసా! నా కళ్లు, ముక్కు, కాళ్లు నలుపు రంగులో ఉంటాయి. రెక్కలు, మెడ కింది భాగం మాత్రం పర్పుల్‌ రంగులో ఉంటాయి.

గుంపులుగానే..!

నాకు గుంపుతో ఉండటమే ఎక్కువ ఇష్టం. మేము ఆహారం కోసం వెళ్లినా కూడా.. గుంపుతో కలిసే వెళ్తాము. వేటాడటంలో మాత్రం చాలా చురుగ్గా ఉంటాను. మీకు చెప్పలేదు కదా నేస్తాలూ.. నేను గాలిలో ఎగురుతున్నప్పుడు ఏవైనా కీటకాలు కనిపిస్తే వెంటనే పట్టుకొని తినేస్తా. నాకు రెక్కలున్న కీటకాలంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు మాత్రమే ఆహారం కోసం నేల మీదకి వస్తాను. నేను ఒక రోజులో దాదాపు 400 ఈగలను అలవోకగా తినేయగలను.

మంచి గూడు..!

నేను ఉండే గూడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. దాన్ని నిర్మించుకోవడం కోసం.. మట్టి, చిన్నచిన్న కొమ్మలు, గులకరాళ్లు ఉపయోగిస్తాను. సంవత్సరం గడిచినా కూడా పాడవ్వకుండా ఉండేలా, ఏ చిన్న లోపం లేకుండా చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటాను తెలుసా! ఎండిపోయన సొరకాయ వంటి వాటిని కూడా.. నేను ఉండేందుకు వీలుగా తయారు చేసుకుంటాను. నా బరువు 45 నుంచి 60 గ్రాముల వరకు ఉంటుంది. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ఎగరగలను. నా పొడవు దాదాపు 20 సెంటీ మీటర్లు ఉంటుంది. నేను 13 సంవత్సరాల వరకు జీవించగలను. ఇవీ నా విశేషాలు. ఉంటా మరి.. బై నేస్తాలూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని