అత్యంత అరుదైన చిలుకను నేను!

నా పేరు ఇంపీరియల్‌ అమెజాన్‌. డొమినికన్‌ అమెజాన్‌, సిస్సెరౌ చిలుక అని కూడా పిలుస్తారు. నేను కరేబియన్‌ ద్వీపమైన డొమినికాలో మాత్రమే కనిపిస్తుంటాను.

Updated : 11 Mar 2024 05:20 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా..?! నేనైతే బాలేను. ఎందుకంటే నేను అంతరించిపోయే స్థితిలో ఉన్నాను. అందుకే నా గురించి మీకు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను. నా విశేషాలు తెలుసుకుంటారా మరి!

నా పేరు ఇంపీరియల్‌ అమెజాన్‌. డొమినికన్‌ అమెజాన్‌, సిస్సెరౌ చిలుక అని కూడా పిలుస్తారు. నేను కరేబియన్‌ ద్వీపమైన డొమినికాలో మాత్రమే కనిపిస్తుంటాను. నేను డొమినికా జాతీయ పక్షిని కూడా. జాతీయ జెండా మీద కూడా నా చిత్రం ఉంటుంది. ప్రస్తుతం నేను అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాను. ఈ భూమ్మీద అడవుల్లో మా సంఖ్య కేవలం 50 మాత్రమే.

ఒకేలా ఉంటాం..

నేను సగటున 48 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. మాలో మగవి 900 గ్రాముల బరువుంటే, ఆడవి 650 గ్రాముల వరకు బరువు తూగుతాయి. మాలో ఆడ, మగ పక్షుల్లో కేవలం బరువులో మాత్రమే తేడా ఉంటుంది. రూపులో ఒకేలా ఉంటాం. రెక్కలేమో ఆకుపచ్చరంగులో, ఛాతీ, తల భాగాలు ఊదా రంగులో కనువిందు చేస్తాయి. రెక్కల్లో, తోక మీద కొన్ని ఎరుపు రంగు ఈకలూ కనిపిస్తుంటాయి. నా కన్ను నారింజ, ఎరుపు మిశ్రమ రంగులో ఉంటుంది.

ఏం తింటామంటే..

మేం పండ్లు, కాయలు, గింజలు, పువ్వులను ఆహారంగా తీసుకుంటాం. మేం ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా ఆహారన్వేషణ చేస్తాం. మాలో ఆడ పక్షులు ఫిబ్రవరి, ఏప్రిల్‌ మధ్య రెండు గుడ్లను పెట్టి పొదుగుతాయి. గుడ్ల నుంచి 26 నుంచి 28 రోజులకు పిల్లలు బయటకు వస్తాయి. ఆడ, మగ రెండు పక్షులూ.. పిల్లల సంరక్షణ చూసుకుంటాయి. ప్చ్‌..! కానీ సాధారణంగా ఈ పిల్లల్లో ఒకటి మాత్రమే బతుకుతుంది.

తుపాన్ల వల్ల..

మేం అంతరించిపోయే ప్రమాదంలో ఉండటానికి 1979లో డొమినికాను కకావికలం చేసిన హరికేన్‌ డేవిడ్‌, 2017లో వచ్చిన మారియా హరికేన్‌లే ప్రధాన కారణం. వీటి కారణంగా అన్ని జీవులతో మాకూ తీవ్ర నష్టం జరిగింది. ఈ ప్రకృతి విపత్తులకు తోడు మీ మానవ కార్యకలాపాలు, అటవీ నిర్మూలన, పర్యావరణ కాలుష్యం మా మనుగడకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. అలాగే గూడు కోసం మేం గుడ్లగూబలతో పోటీ పడాల్సి వస్తోంది. మా జనాభా వృద్ధి చెందాలంటే గూళ్లే మాకు ప్రధానం. వీటిని కాపాడటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాం. మొత్తానికి మేం బతకడం కోసం రోజూ ఓ యుద్ధమే చేయాల్సి వస్తోంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు