ఎగరని పావురమా!

పావురాలు అనగానే వాటి రెక్కల టపటప సవ్వడులే మనకు గుర్తుకొస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా అవి ఎగిరే దృశ్యాలే జ్ఞప్తికి వస్తాయి. కానీ ఓ అరుదైన జాతికి చెందిన పావురాలకు ఎగరడం వచ్చినా..

Updated : 13 Mar 2024 05:18 IST

పావురాలు అనగానే వాటి రెక్కల టపటప సవ్వడులే మనకు గుర్తుకొస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా అవి ఎగిరే దృశ్యాలే జ్ఞప్తికి వస్తాయి. కానీ ఓ అరుదైన జాతికి చెందిన పావురాలకు ఎగరడం వచ్చినా.. అవి ఆకాశంలోకి వెళ్లడానికి పెద్దగా ఇష్టపడవు. ఎక్కువగా.. నేల మీద, చెట్ల కొమ్మల పైనే నిక్షేపంగా కాలక్షేపం చేస్తాయి. మరి ఆ పావురం విశేషాలేంటో తెలుసుకుందామా!

విచిత్రమైన పావురం పేరు కొలంబినా సైనోపిస్‌. దీన్నే బ్లూ ఐడ్‌ గ్రౌండ్‌ డోవ్‌ (నీలి కళ్ల నేల పావురం) అని కూడా పిలుస్తారు. ఇవి ఊదా, గోధుమ రంగులో ఉంటాయి. రెక్కల మీద నీలి రంగు చుక్కలు ఉంటాయి. విచిత్రంగా వీటి కళ్లు కూడా నీలి వర్ణంలోనే కనువిందు చేస్తాయి. ఇవి బ్రెజిల్‌ సెరాడాలోని సవన్నా గడ్డి భూముల్లో మాత్రమే నివసిస్తుంటాయి. నిజానికి ఈ పావురాలు ఎప్పుడో 75 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయని అంతా అనుకున్నారు. కానీ 2015లో అనూహ్యంగా మళ్లీ వీటిలో 15 జాతుల ఉనికి బాహ్యప్రపంచానికి తెలిసింది.

బుజ్జి బొజ్జలో...

ఈ పావురాలు ఎక్కువగా నేల మీదే తిరుగుతుంటాయి. గడ్డి విత్తనాలు, చిన్న చిన్న పండ్లు, కీటకాలను తిని తమ బుజ్జి బొజ్జ నింపుకొంటాయి. నీటిలోనూ ఇవి ఆహారం కోసం అన్వేషించడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ పావురాల గుడ్లను, చిన్న చిన్న పిల్లలను పాములు, డేగల్లాంటి శత్రువులు విపరీతంగా తింటుండటం వల్ల, వీటి సంఖ్య పెరగడం లేదు. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, ఇతర మానవకార్యకలాపాల వల్ల కూడా ఈ నీలి కన్ను నేల పావురాల సంఖ్య వేగంగా పడిపోతోంది. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలో ఉన్నాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ఎగిరే సామర్థ్యం ఉండీ.. ఎగరడానికి అంతగా ఇష్టపడని అరుదైన పావురం సంగతులు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు