నాటి చెత్తకుప్పే.. నేటి ఒప్పులకుప్ప!

మనిషి పర్యావరణానికి హాని చేసినా.. ప్రకృతి మాత్రం ఎప్పుడూ మానవాళికి మేలు చేస్తూనే ఉంటుంది. దీనికి చక్కటి ఉదాహరణే ఈ గ్లాస్‌ బీచ్‌. సముద్రం తీరం అనగానే మనకు ఇసుక, రాళ్లు గుర్తుకు వస్తాయి.

Published : 15 Mar 2024 00:03 IST

మనిషి పర్యావరణానికి హాని చేసినా.. ప్రకృతి మాత్రం ఎప్పుడూ మానవాళికి మేలు చేస్తూనే ఉంటుంది. దీనికి చక్కటి ఉదాహరణే ఈ గ్లాస్‌ బీచ్‌. సముద్రం తీరం అనగానే మనకు ఇసుక, రాళ్లు గుర్తుకు వస్తాయి. కానీ ఓ బీచ్‌లో మాత్రం గాజు గులకరాళ్లు పరుచుకుని కనువిందు చేస్తాయి. ఇంతకీ విచిత్ర బీచ్‌ ఎక్కడుంది? ఎలా ఏర్పడిందో?... తెలుసుకోవాలని ఉంది కదూ నేస్తాలూ! అయితే ఈ కథనం చదివేయండి సరేనా!!

కాలిఫోర్నియాలోని ఫోర్ట్‌ బ్రాగ్‌ సమీపంలో ఉంది ఈ గ్లాస్‌ బీచ్‌. ఇక్కడ సముద్ర తీరంలో రంగురంగుల, నునుపైన గాజు గులకరాళ్లు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా పగటి పూట ఈ బీచ్‌ మరింత అందంగా కనిపిస్తుంది. సూర్యుడి వెలుతురులో రంగురంగుల గాజు గులకరాళ్లు భలే చక్కగా మెరుస్తుంటాయి. ఇంత శోభాయమానంగా కనిపించే ఈ బీచ్‌ వెనక మానవుల నిర్లక్ష్యపూరిత చర్య దాగుంది!

పోగు చేశారు!

1906 ప్రాంతంలో ఈ ఫోర్ట్‌బ్రాగ్‌ నివాసితులు ఈ ప్రాంతాన్ని తమ చెత్త పారవేసే డంపింగ్‌యార్డుగా ఉపయోగించారు. గాజు, సిరామిక్‌, కలప, లోహాల్లాంటి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పోగు చేశారు. ఇది ఎంతలా కొనసాగింది అంటే.. 1943 నాటికి ఈ ప్రాంతం మొత్తం నిండిపోయి, పెద్ద కొండలా మారిపోయింది. తర్వాత పక్కనే ఉన్న మరో ప్రాంతంలో సైట్‌ 2 పేరుతో చెత్తను డంప్‌ చేశారు. ఇది కూడా నిండిపోవడంతో, సైట్‌ 3ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా 1967 చివరి నాటికి ఫోర్ట్‌ బ్రాగ్‌ ప్రాంతంలో సైట్‌ 1, సైట్‌ 2, సైట్‌ 3 అనే మూడు డంపింగ్‌ యార్డులు వెలిశాయి.

దిద్దుబాటు చర్యలతో..

కొన్నాళ్లకు ఈ ప్రాంతం వాళ్లకు పర్యావరణ స్పృహ వచ్చింది. సముద్రాన్ని ఆనుకుని ఇలా డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయడం పర్యావరణానికి మంచిది కాదని గ్రహించారు. అందుకే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఈ చెత్తకుప్పల్లోంచి రీసైక్లింగ్‌ కోసం వస్తువులను సేకరించారు. ఇలా లోహాలను వేరు చేసి వాటిని పలు నిర్మాణాల్లో వినియోగించారు. కానీ గాజులు, సిరామిక్స్‌ మాత్రం మిగిలిపోయాయి. సంవత్సరాల తరబడి అవి సముద్ర కెరటాల తాకిడికి గురవడం వల్ల నునుపైన గులకరాళ్లలా మారిపోయాయి. అవన్నీ సముద్ర తీరమంతా పరుచుకున్నాయి. మనుషులు చెత్తను విసిరితే, ప్రకృతి మాత్రం దాన్ని ఇలా కళాత్మకంగా మార్చింది.

సందడే సందడి!

కొన్ని సంవత్సరాలకు పూర్వం డంపింగ్‌ యార్డు ఉన్న ప్రాంతం, నేడు పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది. సముద్రుడు చెక్కిన ఈ గ్లాస్‌ బీచ్‌ను సందర్శించడానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మొదట్లో సందర్శకులు ఇక్కడి గాజు గులకరాళ్లను ఇష్టారీతిన తీసుకువెళ్లారు. దీంతో వాటి సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం మాత్రం ఇక్కడి గాజు గులకరాళ్లను తీసుకువెళ్లనీయకుండా స్థానిక యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. మొత్తానికి ఒకప్పటి చెత్తకుప్పలను సముద్ర అలలు ఒప్పులకుప్పలుగా మార్చాయన్నమాట. గ్లాస్‌ బీచ్‌ సంగతులు భలే ఉన్నాయి కదూ! నేస్తాలూ.. మనం మాత్రం చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి సరేనా!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని