భలే.. భలే.. అరుదైన చేపను!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా! నేనో చేపను. కానీ మీరెవరూ నన్ను చూసి ఉండరు. ఎందుకంటే నేను మీ దేశంలో ఉండను కాబట్టి. అందుకే నా విశేషాలు మీకు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.

Published : 17 Mar 2024 00:23 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా! నేనో చేపను. కానీ మీరెవరూ నన్ను చూసి ఉండరు. ఎందుకంటే నేను మీ దేశంలో ఉండను కాబట్టి. అందుకే నా విశేషాలు మీకు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.నా వివరాలన్నీ తెలుసుకుంటారా మరి!

 నా పేరు సఖాలిన్‌ స్టర్జన్‌. నేను అరుదైన చేపను. కేవలం జపాన్‌, రష్యాల్లో మాత్రమే కనిపిస్తుంటాను. అప్పుడప్పుడు చైనాలోనూ నన్ను చూస్తుంటారు. ఇక అంతే.. మరే దేశంలోనూ నా ఉనికి ఉండదు. ఇప్పటికే మీకో సందేహం వచ్చి ఉంటుంది. ‘ఇంతకీ.. నువ్వు ఉప్పునీటి చేపవా?.. మంచినీటి చేపవా?..’ అని మీరు, నన్ను అడగాలనుకుంటున్నారు కదూ! దీనికి నా సమాధానం.. రెండూ! ఏంటి అలా అవాక్కవుతున్నారు. నేను నిజంగా నిజమే చెబుతున్నాను.

 అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా..

నేను సముద్ర నీటిలోనూ బతికేస్తా. నదుల్లోనూ జీవిస్తాను. ఇందులోని మర్మం ఏంటంటే.. సంవత్సరంలో కొన్ని నెలలు సాగర జలాల్లో ఉంటాను. మరికొంత కాలం నదుల్లోనూ కనిపిస్తుంటాను. మీకు మరో విషయం చెబుతాను.. నేను చాలా ప్రాచీన కాలానికి చెందిన జీవిని. డైనోసార్ల కాలం నుంచీ ఈ భూమిపై జీవించి ఉంటున్నాను. ఈ విషయాన్ని మీ శాస్త్రవేత్తలే తేల్చారు.  

ఆహా.. ఏమి రుచి!

మిగతా చేపలతో పోల్చుకుంటే నేను చాలా రుచికరంగా ఉంటాను. పోషక విలువలు కూడా ఎక్కువే. నా మాంసం లేతగులాబీ వర్ణంలో ఉంటుంది. వండాక మాత్రం తెలుపు రంగులోకి మారుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా మా సంఖ్య చాలా తక్కువ. మా జాతి అంతరించిపోయే ముప్పు ముంగిట ఉంది. నా కళ్లు మిగతా చేపలతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటాయి. అందుకే నేను నా ఆహారాన్ని తేలిగ్గా గుర్తించలేను.

దంతాలు లేవోచ్‌!

నాకసలు ఒక్క దంతం కూడా ఉండదు. నేను నా ఆహారాన్ని నేరుగా మింగేస్తాను. నా పొట్ట కండరాలే నేను తీసుకున్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తాయి. అప్పుడు నాకు తేలిగ్గా జీర్ణం అవుతుంది. అన్నట్లు మీకు చెప్పడం మరిచాను. నేను సాధారణంగా 150 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. బరువు విషయానికొస్తే 60 నుంచి 80 కిలోల వరకు పెరుగుతాను. కానీ ఇంత బరువు తూగాలంటే నాకు కనీసం 10 నుంచి 12 సంవత్సరాలైనా పడుతుంది. నిజానికైతే నా జీవితకాలం 48 నుంచి 55 సంవత్సరాలు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలేగా ఉన్నాయి కదా! మీకూ నచ్చాయి కదూ! సరే అయితే బై.. బై.. మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని