పాలరాతి గుహల్లో లాహిరి.. లాహిరి!

తాజ్‌మహల్‌లాంటి పాలరాతి కట్టడాలు మనల్ని మైమరిపిస్తాయి కదూ! వెన్నెల వెలుగుల్లో అవి మరింత మెరిసిపోతూ కనిపిస్తాయి. అవే పాలరాతి గుహలు అయితే...!

Updated : 24 Mar 2024 05:04 IST

తాజ్‌మహల్‌లాంటి పాలరాతి కట్టడాలు మనల్ని మైమరిపిస్తాయి కదూ! వెన్నెల వెలుగుల్లో అవి మరింత మెరిసిపోతూ కనిపిస్తాయి. అవే పాలరాతి గుహలు అయితే...! ఇంకా బాగుంటుంది కదా! ‘కానీ.. అలాంటి గుహలు కూడా ఉంటాయా?!’ అనే అనుమానం మీకు వస్తోందా?! ఆ ప్రకృతి వింత చిలీలో ఉంది. అది కూడా సరస్సులో! మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

ప్రపంచంలోనే అత్యంత అందమైన గుహలు దక్షిణ చిలీలో పటగోనియాలోని ఓ సరస్సులో ఉన్నాయి. వీటిని క్యూవాస్‌ డి మార్మోల్‌ అని కూడా పిలుస్తారు. వీటికి మార్బుల్‌ కేథడ్రల్‌ అనే పేరు కూడా ఉంది. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. రూపుదిద్దుకోవడానికి మాత్రం ఏకంగా ఆరువేల సంవత్సరాలు పట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

నిరంతరం మారుతూ..

ఈ పాలరాతి గుహలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఇవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిత్యం తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఒకలా, వేసవికాలంలో మరోలా కనిపిస్తుంటాయి. శీతాకాలంలో గుహలు ఇంకాస్త మెరుస్తుంటాయి. ఎండాకాలంలో మాత్రం సరస్సులో నీటిమట్టం పెరుగుతుంది. అప్పుడు గుహల ఆకృతి కూడా మారిపోతుంది.

ఎందుకో తెలుసా...

‘అవునూ.. ఎండాకాలంలో నీటి మట్టం తగ్గాలి కానీ.. పెరగడం ఏంటి?’ అనే సందేహిస్తున్నారు కదూ! ఇక్కడ వేసవిలో చుట్టుపక్కల ఉన్న మంచు కరుగుతుంది. అందుకే సరస్సు నీటిమట్టం ఘననీయంగా పెరుగుతుంది. నీళ్ల ప్రతిబింబం వల్ల గుహలు కాస్త నీలి రంగులోకి మారతాయి. లోపలంతా చిక్కటి నీడలు కూడా పరుచుకుంటాయి.

ఎంతకష్టమో..

ఈ ప్రకృతి వింత చాలా అందంగా ఉంటుంది. కానీ.. దీన్ని చేరుకోవడమే చాలా కష్టం. కాయ్హేక్‌ నుంచి సుమారు 320 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కఠినమైన మట్టిరోడ్లనూ దాటాల్సి వస్తుంది. చివరగా పటగోనియాలోని సరస్సును చేరుకుని, పడవల ద్వారా గుహల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇన్ని వ్యయప్రయాసలకోర్చి కూడా.. ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పాలరాతి గుహలను చూశాక, వాటి గుండా చిన్న చిన్న పడవల్లో లాహిరి..లాహిరిలో.. అంటూ.. విహరించాక తాము పడ్డ కష్టమంతా మరిచిపోతారట! నేస్తాలూ.. మొత్తానికి ఇవీ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని