భలే.. భలే.. బంగారు నెమలి!

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా..? నేనైతే బాగున్నాను. అవును.. ఏంటి మీరు నన్ను అలా వింతగా చూస్తున్నారు. ఓ.. నేనెవరో మీకు తెలియదు కదూ! అదిగో ఆ వివరాలు చెప్పిపోదామనే ఇదిగో... ఇలా వచ్చాను. మరి నా విశేషాలేంటో తెలుసుకుంటారా?!

Updated : 27 Mar 2024 04:44 IST

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా..? నేనైతే బాగున్నాను. అవును.. ఏంటి మీరు నన్ను అలా వింతగా చూస్తున్నారు. ఓ.. నేనెవరో మీకు తెలియదు కదూ! అదిగో ఆ వివరాలు చెప్పిపోదామనే ఇదిగో... ఇలా వచ్చాను. మరి నా విశేషాలేంటో తెలుసుకుంటారా?!

నా పేరు బంగారు నెమలి. చైనా నెమలి, హరివిల్లు నెమలి అనే పేర్లు కూడా నాకున్నాయి. మాలో మగవి దాదాపు 100 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. చాలా పొడవైన తోక కూడా ఉంటుంది. 500 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు బరువు తూగుతాయి. మాలో ఆడవి మాత్రం 60 నుంచి 80 సెంటీమీటర్ల పొడవుంటాయి. బరువేమో 350 గ్రాముల వరకు తూగుతాయి.

వేరువేరుగా.. కనిపిస్తాం!

మాలో మగ, ఆడవి వేరువేరుగా కనిపిస్తాయి. మగవేమో పసుపు, ఎరుపు, నీలం రంగుల్లో కనువిందు చేస్తాయి. ఆడవి కాస్త నలుపు, బూడిద రంగులో ఉంటాయి. ఇంతకీ మేం ఎక్కడ ఉంటామో మీకు చెప్పనే లేదు కదూ! చైనా మా స్వస్థలం. అయినప్పటికీ ఇంగ్లాండ్‌, కెనడా, యునైటెడ్‌ స్టేట్స్‌, మెక్సికో, కొలంబియా, పెరూ, బొలీవియా, చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా కనిపిస్తుంటాం.

ఏం తింటామంటే..

మేం కాస్త ఎగరగలం. కానీ ఎక్కువ దూరాలకు మాత్రం కాదు. సాధ్యమైనంత వరకు నేల మీదే జీవిస్తుంటాం. విత్తనాలు, ఆకులు, కీటకాలు, ఇతర చిన్నచిన్న ప్రాణులను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మేం వేగంగా పరుగెత్తుతాం. ఏవైనా శత్రువులు మా మీద దాడి చేసినప్పుడు, వాటి నుంచి తప్పించుకునేందుకు మాత్రం కాస్త ఎగురుతాం.

అయ్‌.. బాబోయ్‌.. మాకు సిగ్గెక్కువ!

మాలో ఆడ పక్షులు ఎనిమిది నుంచి పన్నెండు వరకు గుడ్లను పెడతాయి. 22 నుంచి 23 రోజుల తర్వాత వీటిలోంచి పిల్లలు బయటకు వస్తాయి. మరో విషయం ఏంటంటే మాకు సిగ్గెక్కువ. మీ మనుషులు కనిపిస్తే చాలు.. మేం దూరంగా పారిపోతాం. ఎక్కువగా రాళ్లు, రప్పలు, పొదలు.. ఇలా చాటుగా ఉండే ప్రదేశాల్లోనే కాలం గడుపుతుంటాం. రాత్రి పూట మాత్రం చెట్ల మీద సేద తీరుతుంటాం. మా జీవిత కాలం 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే. కానీ మమ్మల్ని చక్కగా సంరక్షిస్తే జూలల్లో ఇరవై ఏళ్ల వరకు బతకగలం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని