రంగురంగుల పక్షిని నేను..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా.. మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి. ఓ..! నాకు అర్థమైంది.. ‘హోలీ పండుగ మొన్నే కదా అయిపోయింది.

Published : 30 Mar 2024 00:49 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా.. మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి. ఓ..! నాకు అర్థమైంది.. ‘హోలీ పండుగ మొన్నే కదా అయిపోయింది. ఇది ఇంకా ఆ రంగులతో అలాగే ఉందేంటి?’ అనుకుంటున్నారు కదూ! కానీ కాదు పిల్లలూ.. సహజంగానే నా రంగే అంత. మరి నా పూర్తి వివరాలేంటో ఈ కథనం చదివి తెలుసుకోండి!

నా పేరు పెయింటెడ్‌ బంటింగ్‌. రంగురంగులుగా ఉన్నాను కదా.. అందుకే ఆ పేరు వచ్చింది. మాలో మగ పక్షులను ‘నాన్‌పరెలి’ అని పిలుస్తారు. నేను అమెరికాకు చెందిన పక్షిని. అక్కడ అత్యంత అందమైన పక్షుల్లో నేనూ ఒకదాన్ని.. తెలుసా? క్యూబా, మెక్సికో వంటి దేశాల్లో కూడా కనిపిస్తుంటాను. నా తల ముదురు నీలం, శరీర పైభాగం ఆకుపచ్చ, నలుపు, కింది భాగం లేత ఎరుపు రంగులో ఉంటుంది. చూడటానికి కాస్త అందంగా ఉంటాను కదా.. అందుకే నన్ను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.

అదే ఇష్టం..

నేను ఒక్కోసారి ఒక్కో రకమైన ఆహారాన్ని తీసుకుంటాను. శీతాకాలంలో ఎక్కువగా విత్తనాలు, పండ్లు తింటాను. మిగిలిన రోజుల్లో చిన్నచిన్న కీటకాలను తినడానికి ఇష్టపడతాను. అయితే నేను.. పగటి సమయంలోనే కావాల్సిన ఆహారాన్ని వెతుక్కుంటాను. నాకు కాస్త భయం, సిగ్గు ఎక్కువ. అందుకే.. మీ మనుషులకు కనిపించకుండా చాలా జాగ్రత్తపడతాను. మీ మాటలు, పాటలు వినడం మాలో మగ పక్షులకు చాలా ఇష్టం. నేను పుట్టిన మొదట్లో లేత బంగారు రంగులో ఉంటాను. పెరుగుతున్నకొద్దీ నా శరీర రంగులో మార్పు వస్తుంది.

ఇట్టే పసిగడతా..

ఏదైన ప్రకృతి విపత్తు వస్తుందంటే.. దాన్ని ముందుగానే పసిగడతాను. నా అరుపుల ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తాను. ప్రస్తుతానికి మా జనాభా బాగానే ఉంది. నా బరువు 13 నుంచి 19 గ్రాములు మాత్రమే. పొడవు 12 నుంచి 14 సెంటీ మీటర్లు. దాదాపు 12 సంవత్సరాల వరకు జీవించగలను. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని