చక్కని చదునైన పర్వతం!

ఫ్రెండ్స్‌! పర్వతం అనగానే మనకు మొనదేలిన శిఖరాలే గుర్తుకు వస్తాయి. కానీ.. ఓ పర్వతం చదునుగా ఉంటుంది తెలుసా?

Updated : 07 Apr 2024 00:28 IST

ఫ్రెండ్స్‌! పర్వతం అనగానే మనకు మొనదేలిన శిఖరాలే గుర్తుకు వస్తాయి. కానీ.. ఓ పర్వతం చదునుగా ఉంటుంది తెలుసా? ‘ఏంటీ సమాంతర పర్వతమా! అసలు అది సాధ్యమా?’ అని మీరు సందేహిస్తున్నారు కదూ! అయితే ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.

ఈ పర్వతం పేరు రోరైమా. ఇది దక్షిణ అమెరికాలో బ్రెజిల్‌, గయానా, వెనిజులా మధ్య ఉంది. రోరైమా సగటున 400 నుంచి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పర్వతంలో ఎత్తైన ప్రదేశం మాత్రం వెనిజులాలో ఉంది. అక్కడ దీని ఎత్తు సుమారు 2810 మీటర్లు. ఈ పర్వతప్రాంతం పచ్చని చెట్లతో కనువిందు చేస్తుంది. జంతుజాలానికీ నిలయంగా ఉంది. దీని పైన సుమారు 10 కిలోమీటర్ల మేర దాదాపు చదునుగా ఉంటుంది. విపరీతమైన వర్షపాతమే ఈ విలక్షణ ఆకృతికి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మేఘాలను తాకుతూ..

ఈ పర్వతంపైన ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 డిగ్రీల వరకు నమోదవుతాయి. ఇక్కడ వర్షపాతం సగటున 1,500 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం ఉంటుంది. ఈ సమయంలో పర్వతం కింద నుంచి చూస్తే.. మాయమైనట్లుగా కనిపిస్తుంది. దీనికి కారణం మబ్బులు. పై నుంచి చూస్తే మాత్రం మేఘాల్లో తేలుతున్నట్లుగా ఉంటుంది. రోరైమా మీద ఉన్న వాతావరణానికి కింద ఉన్న పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తుంది. ఇది అనేక గుహలు, లోయలకూ నిలయం. అతిపెద్ద క్వార్ట్జ్‌ గుహలు కూడా ఇక్కడే ఉన్నాయి. వర్షపాతం వల్ల ఉద్భవించిన జలప్రవాహాల కారణంగా ఈ గుహలు, లోయలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతటి విలక్షణమైన పర్వతం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడింది.

అధిరోహించడం సులువే.. కానీ!

రోరైమా పర్వతం చదునుగా ఉండటం వల్ల దీన్ని అధిరోహించడం కాస్త సులువే.. కానీ...! సుడులు తిరుగుతూ ప్రవహించే నీరు, జలపాతాలను దాటుకుంటూ వెళ్లడం చాలా కష్టం. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడైతే మరింత ప్రమాదకరం. ఈ పర్వతాన్ని ఎక్కడానికి నెలకు 200 మందికి మాత్రమే అనుమతిస్తారు. దీని అధిరోహణకు మొత్తం మూడు నుంచి అయిదు రోజుల సమయం పడుతుందట. దిగడానికి మాత్రం రెండు రోజులు సరిపోతుందట. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి వేసవికాలం చాలా అనుకూలంగా ఉంటుంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ మౌంట్‌ రోరైమా విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని