బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట.. అత్యంత అరుదైన పిట్ట!

హాయ్‌ ఫ్రెండ్స్‌ నేను మీ చింటూను. ఈ రోజు నేను ఓ చిన్ని పిట్టను ఇంటర్వ్యూ చేయబోతున్నాను.

Published : 09 Apr 2024 00:15 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ నేను మీ చింటూను. ఈ రోజు నేను ఓ చిన్ని పిట్టను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ విశేషాలేంటో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి మీరూ తెలుసుకుంటారా అవేంటో!

చింటు: హాయ్‌.. బుజ్జి పిట్టా.. బాగున్నావా? అవును ఇంతకీ నీ పేరేంటి?
పిట్ట: హాయ్‌ చింటూ.. నేను బాగున్నాను. నా పేరు స్ట్రెస్‌మాన్స్‌ బ్రిస్ట్‌ఫ్రంట్‌.
చింటు:  నీ పేరు చాలా బాగుంది. కానీ.. ప్చ్‌.. పలకడం మాత్రం నాలాంటి పిల్లలకు కష్టం. అందుకే నిన్ను ఎంచక్కా బుజ్జి పిట్ట అని పిలుస్తా సరేనా!
పిట్ట: ఓ.. తప్పకుండా పిలువు. నాకైతే ఏ సమస్యా లేదు.
చింటు:  నిన్ను ఇంతకు ముందెప్పుడూ నేను చూడలేదు. నీ స్వస్థలం ఎక్కడ?
పిట్ట: అవును చింటూ.. ఇంతకు ముందెన్నడూ నువ్వు, నీ స్నేహితులు నన్ను చూసి ఉండరు. నేను బ్రెజిల్‌లో మాత్రమే నివసిస్తుంటాను. మరో విశేషం ఏంటంటే.. నేను అక్కడ కూడా ఎక్కువగా కనిపించను.
చింటు: అవునా...! అదేంటి?
పిట్ట: అవును.. ఎందుకంటే.. నేను చాలా అరుదైన పక్షిని మరి.
చింటు:  నువ్వు ఇంతకీ ఎంత పొడవుంటావు?
పిట్ట: నేను దాదాపు 20 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను.
చింటు:  నువ్వు ఏం తింటావు?
పిట్ట: చింటూ.. నేను ఎక్కువగా కీటకాలను ఆహారంగా తీసుకుంటాను.
చింటు:  నీకో విషయం చెప్పాలా? నీ తోక భలే అందంగా ఉంది తెలుసా.
పిట్ట: థాంక్యూ చింటూ.. నాక్కూడా నా తోక అంటే చాలా ఇష్టం.
చింటు:  నువ్వు అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నావట కదా.. నిజమేనా!
పిట్ట: అవును చింటూ.. నిజమే.
చింటు: అయ్యో.. పాపం.. నీకెందుకీ కష్టం వచ్చింది?
పిట్ట: విపరీతమైన నగరీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత, వ్యవసాయక్షేత్రాల విస్తరణ కారణంగా మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఆవాస ప్రాంతాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇంకా.. పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు కూడా మా సంతతి అభివృద్ధి చెందకుండా ఉండిపోవడానికి ప్రధాన కారణాలు.
చింటు: అవును ప్రపంచవ్యాప్తంగా మీరెంత మంది ఉన్నారు?
పిట్ట: చింటూ.. మా సంఖ్య చాలాచాలా తక్కువ. ప్రస్తుతం బ్రెజిల్‌ అడవుల్లో మా జనాభా 50 కంటే కూడా తక్కువే తెలుసా.
చింటు:  ఓ.. అలాగా.. సారీ..!! త్వరలోనే మీ సంఖ్య పెరగాలని కోరుకుంటున్నా.
పిట్ట: థాంక్యూ చింటూ.. సరే ఇక ఉంటామరి. ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది.
చింటు: బై.. బై.. బుజ్జి పిట్ట. జాగ్రత్తగా వెళ్లు.. సరేనా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని