వానరాన్ని కాదు.. ఒలింగిటోను!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా? నన్ను చూసి మీరు వానరం అనుకుంటున్నారు కదూ! కానీ కాదు. నేను రకూన్‌ కుటుంబానికి చెందిన జీవిని. నా పేరు ఒలింగిటో. నాకు తెలిసి.. మీరెప్పుడూ నన్ను చూసి ఉండరు కదా!

Published : 11 Apr 2024 00:06 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా? నన్ను చూసి మీరు వానరం అనుకుంటున్నారు కదూ! కానీ కాదు. నేను రకూన్‌ కుటుంబానికి చెందిన జీవిని. నా పేరు ఒలింగిటో. నాకు తెలిసి.. మీరెప్పుడూ నన్ను చూసి ఉండరు కదా! అందుకే నా వివరాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుంటారా?!

నేను కొలంబియా, ఈక్వెడార్‌లో ఆండీస్‌ పర్వత శ్రేణుల్లో జీవిస్తుంటాను. 2013 ముందు వరకు నా గురించి మీకు తెలియదు. అప్పుడే నన్ను కనుగొన్నారు. నా పేరిట ఓ రికార్డు కూడా ఉంది తెలుసా..! అదేంటంటే.. ఈ ప్రాంతంలో దాదాపు 35 సంవత్సరాల తర్వాత కొత్తగా కనుగొన్న క్షీరదాన్ని నేనే! నా బరువు సగటున దాదాపు 900 గ్రాములుంటుంది. ఎక్కువగా పండ్లను ఆహారంగా తీసుకుంటాను. అలా అని పూర్తి శాకాహారిని కాదు. కొన్ని కీటకాలు, పక్షులు, చిన్న చిన్న ఇతర జీవుల్ని తిని బొజ్జ నింపుకొంటాను.

 పొడవైన తోక!

 నాకు పొడవైన తోక ఉంటుంది. అది 33.5 నుంచి 42.4 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. చెవులేమో చిన్నగా ఉంటాయి. నేను సముద్ర మట్టానికి 1500 నుంచి 2750 మీటర్ల ఎత్తున ఉండే అడవుల్లో బతుకుతుంటాను. నాలో మళ్లీ నాలుగు ఉపజాతులూ ఉన్నాయి. దాదాపు 10 నుంచి 25 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఎంచక్కా చెట్లనూ ఎక్కగలను. నాకు పొడవైన, పదునైన గోర్లుంటాయి. బూడిద రంగులో ఉంటాను. నా వెంట్రుకలు ఒత్తుగా మెత్తగా ఉంటాయి. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం, అడవుల నరికివేత వల్ల మా ఉనికి ప్రమాదంలో ఉంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని