అందమైన జాతీయ పక్షిని..!

హాయ్‌ నేస్తాలూ..!  స్కూల్‌ నుంచి వచ్చాక పరీక్షలకు బాగా చదువుతున్నారా..! ‘ఇదెవరూ? రాగానే.. గబగబా ప్రశ్నలు అడిగేస్తుంది’ అనుకుంటున్నారా?

Published : 13 Apr 2024 06:34 IST

హాయ్‌ నేస్తాలూ..!  స్కూల్‌ నుంచి వచ్చాక పరీక్షలకు బాగా చదువుతున్నారా..! ‘ఇదెవరూ? రాగానే.. గబగబా ప్రశ్నలు అడిగేస్తుంది’ అనుకుంటున్నారా? మీరు నన్నెప్పుడూ చూసి ఉండరులే..! అందుకే ఒకసారి పరిచయం చేసుకొని, మీరెలా ఉన్నారో కనుక్కొని వెళ్దామని ఇలా వచ్చాను.. ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి మరి!

నన్ను ‘ఎలిగెంట్‌ గ్రే క్రౌన్‌ క్రేన్‌’ అని పిలుస్తారు. మీకు పలకడానికి ఇబ్బందిగా ఉంటే నచ్చినట్లు పిలవండి పర్లేదు. నేను ఆఫ్రికాకు చెందిన పక్షిని. మీకో విషయం తెలుసా..! అక్కడ అందమైన పక్షుల్లో నేనూ ఒకదాన్ని. నేను ఉగాండా జాతీయ పక్షిని కూడా.. వాళ్ల జాతీయ జెండా మీద నా బొమ్మే ఉంటుంది. ఇంకా కెన్యా, జింబాబ్వే వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. నా శరీరం, కళ్లు బూడిద రంగులో ఉంటాయి. రెక్కలేమో.. సగం నలుపు, సగం తెలుపు రంగులో ఉంటాయి. మెడ కింది భాగం మాత్రం ఎరుపు, కాళ్లు చాలా పొడవుగా.. నలుపు రంగులో ఉంటాయి. నా తల మీద కిరీటం లాంటి ఆకారం ఉంటుంది. అదే నేను అందంగా కనిపించేలా చేస్తుంది. నన్ను పెంచుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు.

అన్నీ తింటా..!

 నేను కచ్చితంగా ఈ ఆహారం తింటానని నియమాలేమీ లేవు. చెట్ల ఆకులు, పండ్లు, చిన్నచిన్న కీటకాలు అన్నింటినీ తినేస్తాను. కానీ నేను గడ్డి ఉన్న చోట ఉండటానికి ఇష్టపడతాను. ఎక్కువగా గుంపుతోనే ఉంటాను. నేను పుట్టిన తర్వాత దాదాపు 56 నుంచి 100 రోజుల తర్వాత గూడు నుంచి బయటికి వస్తాను. అప్పటి వరకు లోపలే ఉండిపోతాను. ప్రస్తుతం మా సంఖ్య వేలల్లోనే ఉంది. వేట, అడవుల నరికివేత వల్ల మా జనాభా చాలా వరకు తగ్గిపోయింది. నా బరువు 3 నుంచి 4 కిలోల వరకు ఉంటుంది. ఎత్తు దాదాపు 100 సెంటీ మీటర్లు. పొడవు 180 నుంచి 200 సెంటీ మీటర్లు ఉంటాను. సుమారు 25 సంవత్సరాల వరకు జీవించగలను. ఇవీ నా విశేషాలు.. మీకు నచ్చే ఉంటాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని