నాకు నాలుగు రంగులోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నేనో పక్షిని.. అలా అని మామూలు పిట్టను కాదు. నాకు నాలుగు వర్ణాలు తెలుసా! ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీరు నన్ను చూసి ఉండరు కదూ!

Published : 16 Apr 2024 00:03 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నేనో పక్షిని.. అలా అని మామూలు పిట్టను కాదు. నాకు నాలుగు వర్ణాలు తెలుసా! ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీరు నన్ను చూసి ఉండరు కదూ! అందుకే నా విశేషాలు మీతో చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను. మరి ఆ వివరాలేంటో తెలుసుకుంటారా?!

నా పేరు సెబు ఫ్లవర్‌ పెకర్‌. నేను అరుదైన పక్షిని. ఫిలిప్పీన్స్‌లోని సెబూ ద్వీపానికి చెందిన పిట్టను. మీకో విషయం తెలుసా.. నేను ఎప్పుడో అంతరించిపోయా అనుకున్నారు మీరంతా! కానీ నేను 1992లో ఒక చిన్న అడవిలో తిరిగి కనిపించాను. అదిగో అప్పటి నుంచి మరో మూడు ప్రాంతాల్లోనూ నా ఉనికిని చాటుకుంటున్నాను. ఆల్కాయ్‌, మౌంట్‌ లాంటోయ్‌ ఆఫ్‌ అర్గావ్‌, దలాగుటేలో జీవిస్తున్నాను.

అందమైన పక్షిని..

నాలుగు రంగులతో చూడ్డానికి అందంగా ఉంటాను. నేను 11 నుంచి 12 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను. మాలో ఆడ, మగ పక్షుల వర్ణాల్లో కాస్త తేడా ఉంటుంది. చిన్న చిన్న పండ్లు, ఓ రకమైన మొక్కలు, పువ్వులను ఆహారంగా తీసుకుంటాను. రాజీ మార్గమే రాజ మార్గం అని నమ్మిన పక్షిని నేను. అందుకే.. నా కంటే బలవంతులతో అస్సలు పోటీ పడను! సాధారణంగా మిగతా పక్షులన్నీ సూర్యోదయం కాగానే ఆహారాన్వేషణకు వెళ్తాయి. కానీ నేను మాత్రం మిగతా పక్షుల సందడి తగ్గిన తర్వాత.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య మాత్రమే చురుకుగా ఉంటాను. ఆ సమయంలోనే నా బుజ్జి బొజ్జను నింపుకొనే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇక ఎంచక్కా విశ్రాంతి తీసుకుంటాను.

ప్రమాదపుటంచున...

అడవుల నరికివేత, వ్యవసాయం, పర్యావరణ మార్పులు, ఇతర పక్షుల పోటీ వల్ల మా సంఖ్య వేగంగా పడిపోతోంది. ప్రస్తుతం అడవుల్లో మా జనాభా కేవలం 85 నుంచి 105 మధ్య ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. చిన్న చిన్న పండ్లు, పువ్వులను ఆహారంగా తీసుకునే క్రమంలో అడవిలో కొత్త మొక్కలు పుట్టడానికి కారణమవుతున్నా. ఇలా నేను ఉడతా భక్తిగా ప్రకృతికి సేవ చేస్తూనే ఉన్నా. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఆగండి.. ఆగండి.. మరో చిన్నమాట. మీకు మాలాంటి పిట్టలంటే ఎంతో ఇష్టం కదూ! వేసవికాలంలో నీళ్లు, ఆహారం దొరక్క ఎన్నో పక్షులు మరణిస్తున్నాయి. అందుకే మీరు అమ్మానాన్న సాయం తీసుకుని చిన్న చిన్న మట్టిపాత్రల్లో గుప్పెడు గింజలు, గుక్కెడు నీళ్లు అందుబాటులో ఉంచండి. మాలాంటి చిన్న చిన్న విహంగాలు వాటితో తమ ప్రాణాలు నిలుపుకొంటాయి. ఫ్రెండ్స్‌.. నేను చెప్పింది చేస్తారు కదూ! బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని