బాహుబలి తేనెటీగను నేను!

గుయ్‌.. గుయ్‌.. ఏంటి నేస్తాలూ.. అలా చూస్తున్నారు. ఈ శబ్దం ఏంటనా?.. నేను నా భాషలో మీకు హాయ్‌ చెబుతున్నాను. నేనో పే..ద్ద తేనెటీగను. అయ్యో... భయపడకండి.. భయపడకండి.. నేనేం మిమ్మల్ని కుట్టను.

Published : 18 Apr 2024 01:15 IST

గుయ్‌.. గుయ్‌.. ఏంటి నేస్తాలూ.. అలా చూస్తున్నారు. ఈ శబ్దం ఏంటనా?.. నేను నా భాషలో మీకు హాయ్‌ చెబుతున్నాను. నేనో పే..ద్ద తేనెటీగను. అయ్యో... భయపడకండి.. భయపడకండి.. నేనేం మిమ్మల్ని కుట్టను. నా గురించి మీకు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. తెలుసుకుంటారా.. మరి!

నా పేరు మెగాచైల్‌ ఫ్లూటో. వాలెస్‌ జెయింట్‌ బీ, కింగ్‌ ఆఫ్‌ బీ, ఫ్లయింగ్‌ బుల్‌ డాగ్‌ అని కూడా పిలుస్తుంటారు. నేను ప్రపంచంలోకెల్లా అతిపెద్ద తేనెటీగను. ఇండోనేషియా నా స్వస్థలం. నిజానికి నన్ను 1981లోనే అంతరించిపోయాను అనుకున్నారు. కానీ తిరిగి 2019లో కనిపించాను. మాలో ఆడవి 1.5 అంగుళాలుంటాయి. రెక్కల పొడవు 2.5 అంగుళాలుంటుంది. మగవి మాత్రం కేవలం 0.9 అంగుళాలు మాత్రమే పెరుగుతాయి. మేం పెద్దవాళ్ల బొటనవేలంత ఉంటాం. మాలో కేవలం ఆడవాటికి మాత్రమే పెద్ద దవడలు ఉంటాయి.

చెట్లలో కాదు.. పుట్టల్లో..

నాకు మరో ప్రత్యేకత ఉంది. మామూలుగా తేనెటీగలు... చెట్లు, పాత భవంతులు, నీళ్లట్యాంకులకు తేనెతుట్టెలను పెడతాయి కదా! కానీ నేను మాత్రం చెదల పుట్టల్లో నా గూడును పెట్టుకుంటాను. చెదపురుగుల నుంచి రక్షణ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంటాను.

ఒంటరి జీవిని నేను...  

తేనెటీగలు సాధారణంగా సమూహాలుగా జీవిస్తాయి. కానీ నేను మాత్రం ఒంటరి జీవిని. ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే అంతరించిపోయాను అనుకున్న నేను తిరిగి కనిపించాను కదా! కానీ.. ప్రస్తుతం నా పరిస్థితి ఏమంత బాగోలేదు. ఎందుకంటే.. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, మా సహజ సిద్ధ ఆవాసాల్లో విపరీతంగా ఆయిల్‌ ఫామ్‌ తోటల ఏర్పాటు వల్ల మేం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాదాపు అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాం. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని