ఎగిరే అతిపెద్ద పక్షిని..!

హాయ్‌ నేస్తాలూ..! మీరు చిన్నప్పటి నుంచి చాలా రకాల పక్షులు చూసే ఉంటారు. వాటిని చూసి భలేగా ఉన్నాయే.. అనుకొని ఉంటారు. కానీ నన్ను చూస్తే మీరు కొంచెం భయపడతారు.

Updated : 20 Apr 2024 04:42 IST

హాయ్‌ నేస్తాలూ..! మీరు చిన్నప్పటి నుంచి చాలా రకాల పక్షులు చూసే ఉంటారు. వాటిని చూసి భలేగా ఉన్నాయే.. అనుకొని ఉంటారు. కానీ నన్ను చూస్తే మీరు కొంచెం భయపడతారు. వాటన్నింట్లో నేను చాలా ప్రత్యేకం. మిమ్మల్ని కాస్త భయపెట్టేలా ఉంటాను. ఆ విశేషాలన్నీ ఒకసారి మీతో పంచుకుందామనే ఇలా వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కథనం చదివేయండి.

న్ను అండేయన్‌ కాండోర్‌ అని పిలుస్తారు. నా రూపం లాగే.. పేరు కూడా కాస్త వింతగా అనిపిస్తుంది కదూ! అన్నట్టు.. నేను అమెరికాకు చెందిన పక్షిని. కొలంబియా, పెరు, బ్రెజిల్‌ వంటి దేశాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తాను. నా రూపం మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే.. ముందే చెప్పాను కదా, కాస్త భయపెట్టేలా ఉంటానని. శరీరం అంతా నలుపు.. మెడపైన భాగం, రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. నేను చిన్నచిన్న పక్షులను ఆహారంగా తీసుకుంటాను. కుందేళ్లను వేటాడి తినడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీకో విషయం తెలుసా.. కొన్ని రోజుల వరకు ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా ఉండగలను. కానీ తిన్నప్పుడు మాత్రం.. అసలు నేల మీద నుంచి లేవలేనంతగా తింటాను.

జాతీయ పక్షిని..!

నేను బొలివియా, చిలీ, కొలంబియా దేశాలకు జాతీయ పక్షిని కూడా తెలుసా! మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలో ఎగిరే పక్షుల్లో నేనే అతి పెద్దదాన్ని. నా గూడు కూడా చాలా పెద్దగా ఉంటుంది. నేను పుట్టాక 6 నెలల తర్వాతనే ఎగురుతాను. అప్పటి వరకు గూడులో ఉంటాను. ఎక్కువగా పగటి సమయంలోనే వేటాడటానికి ఇష్టపడతాను. నేను ఒక రోజులో దాదాపు 200 కిలో మీటర్ల దూరం ప్రయాణించగలను. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ నిజమే నేస్తాలూ! ప్రస్తుతం మా సంఖ్య సుమారుగా పదివేలు. నా బరువు దాదాపు 8 నుంచి 15 కిలోల వరకు ఉంటుంది. నా రెక్కల పొడవు 270 నుంచి 320 సెంటీ మీటర్లు ఉంటుంది. నేను 50 ఏళ్ల వరకు జీవిస్తాను. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని