నేను నీళ్ల మీద నడుస్తాను..!

హాయ్‌ నేస్తాలూ..! నన్ను అలాగే చూస్తూ ఉండి పోకండి. నా విశేషాలు చెబుదామనే ఇలా వచ్చాను. ఎండలు బాగా ఉన్నాయి కదా! మీరు బయట తిరగకండి..

Published : 30 Apr 2024 00:11 IST

హాయ్‌ నేస్తాలూ..! నన్ను అలాగే చూస్తూ ఉండి పోకండి. నా విశేషాలు చెబుదామనే ఇలా వచ్చాను. ఎండలు బాగా ఉన్నాయి కదా! మీరు బయట తిరగకండి.. చాలా ప్రమాదం. అందుకే నేను మీ పేజీలోకి వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి. నా వివరాలేంటో తెలుస్తాయి..!

నా పేరు ప్లమ్డ్‌ బాసిలిస్క్‌. అంటే.. ‘లిటిల్‌ కింగ్‌’ అని అర్థం అన్నమాట. ఇంకా.. నన్ను ‘జీసస్‌ క్రిస్ట్‌ లిజర్డ్‌’ అని కూడా పిలుస్తారు. పిలవాలంటే నోరు తిరగడం లేదు కదా! మరేం పర్లేదు. ఎంచక్కా బల్లి అని పిలిచేయండి. ఎందుకంటే.. నేనూ ఒక రకమైన బల్లినే అన్నమాట. చూడటానికి ఆకుపచ్చ, కాస్త పసుపు రంగులో కనిపిస్తాను. నా శరీరం మీద తెల్లని మచ్చలు కూడా ఉంటాయి. కళ్లు పసుపు రంగులో ఉంటాయి. నా తోక మీద నలుపు రంగు మచ్చలు ఉంటాయి. అన్నట్టు అసలు విషయం చెప్పలేదు కదూ.. నేను అమెరికాకు చెందిన జీవిని. మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను.

అలా గుర్తుపట్టొచ్చు..!

మాలో ఆడ, మగ బాసిలిస్క్‌ని చాలా సులభంగా గుర్తుపట్టొచ్చు. మగ బాసిలిస్క్‌కి తల, శరీరం, తోక మీద ఈకల్లాంటి ఆకారం ఉంటుంది. కానీ.. ఆడ వాటికి తల మీద మాత్రమే ఉంటుంది. నేను ఒకరోజులో ఆహారం సంపాదించుకోవడానికే.. ఎక్కువ సమయం కేటాయిస్తాను. భూమి, చెట్లు, నీళ్లు.. ఎక్కడైనా నేను బతకగలను. ఒక గంటసేపు బయటికి రాకుండా నీళ్లలోనే ఉండగలను తెలుసా..? చిన్నచిన్న కీటకాలు, చేపలు, పక్షులను ఆహారంగా తీసుకుంటాను.

నా ప్రత్యేకత..!

ప్రస్తుతం మా సంఖ్య బాగానే ఉంది. మీకో విషయం తెలుసా..? నా కాళ్ల ప్రత్యేక నిర్మాణం వల్ల, నేను నీళ్ల మీద కూడా నడవగలను. గంటకు దాదాపు 11 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలను. నా పొడవు 91 సెంటీ మీటర్లు. నేను 8 నుంచి 12 ఏళ్ల వరకు జీవిస్తాను. ఇవీ నేస్తాలూ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని