చెంచాలాంటి ముక్కు నా సొంతం!

నా పేరు స్పూన్‌ బిల్డ్‌ శాండ్‌ పైపర్‌. నేను బేరింగ్‌ సముద్రతీరాల్లో జీవిస్తుంటాను. చెంచాలా ఉండే నా ముక్కే నాకు అందం. శీతాకాలాల్లో మాత్రం నేను ఆగ్నేయాసియాకు వలస వస్తాను.

Published : 05 May 2024 03:08 IST

నేస్తాలూ.. బాగున్నారా! నేను ఓ పక్షిని. చెంచాలాంటి ముక్కు నా ప్రత్యేకత. ఇంకా నా విశేషాలేంటో, వివరాలేంటో తెలుసుకుంటారా! అయితే ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి సరేనా!

నా పేరు స్పూన్‌ బిల్డ్‌ శాండ్‌ పైపర్‌. నేను బేరింగ్‌ సముద్రతీరాల్లో జీవిస్తుంటాను. చెంచాలా ఉండే నా ముక్కే నాకు అందం. శీతాకాలాల్లో మాత్రం నేను ఆగ్నేయాసియాకు వలస వస్తాను. భారతదేశం, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మయన్మార్‌, థాయిలాండ్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, సింగపూర్‌లలో తలదాచుకుంటాను. ఇక్కడే సంతానోత్పత్తి చేస్తుంటాను. ప్రస్తుతం మా జనాభా చాలా చాలా తక్కువగా ఉంది. నేను అంతరించిపోయే ప్రమాదం ఉన్న పక్షుల జాబితాలో ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా మా సంఖ్య కేవలం 2500 కంటే కూడా తక్కువగా ఉందని అంచనా.

ఏం తింటానంటే..

నేను ఎక్కువగా నీటికి దగ్గరగా నా ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను. నాచు, దోమలు, ఈగలు, పురుగులు, సాలీళ్లను ఆహారంగా తీసుకుంటాను. కొన్నిసార్లు చిన్న చిన్న చేపలు, రొయ్యలను కూడా హాంఫట్‌ చేస్తుంటాను. నా జీవితకాలం దాదాపు 10 సంవత్సరాలు. నేను చాలా చిన్న పక్షిని. పొడవు 14 నుంచి 16 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను. బరువేమో 31 నుంచి 40 గ్రాముల వరకు తూగుతాను. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు తగ్గిపోతుండటం, పారిశ్రామికీకరణ, వేట వల్ల మాకు తీవ్రనష్టం జరుగుతోంది.

ఇలాగే కొనసాగితే...

చైనా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల్లో మా ఆవాసాలకు విపరీతమైన నష్టం జరుగుతోంది. ఇక మయన్మార్‌లోనేమో సంప్రదాయ పక్షి ఉచ్చుల వల్ల మేం ప్రాణాలు కోల్పోతున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 10 నుంచి 20 సంవత్సరాల్లో మేం ఈ భూమి మీద నుంచి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మా గుడ్లను సేకరించి కృత్రిమంగా పొదిగించి, మా సంతతిని కాపాడేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఇదంతా చాలా క్లిష్టమైన ప్రక్రియ. అయినా ఏం జరుగుతుందో చూడాలి. నేస్తాలూ! మొత్తానికి ఇవీ నా విశేషాలు. సరే ఇక ఉంటా మరి.. బై.. బై!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని