ఈ పువ్వు ఖరీదు తెలుసా..!

హాయ్‌ నేస్తాలూ..! పువ్వులు అనగానే మనకు రకరకాల రంగులు, వాటి సువాసనలు గుర్తుకొస్తాయి. వాటితో ఆడుకోవడానికి కూడా ఆసక్తి చూపుతాము. మనకు తెలిసినవి చాలా రకాల పువ్వులే ఉన్నా.. తెలియనివి కూడా కొన్ని ఉంటాయి కదా!

Published : 07 May 2024 00:25 IST

హాయ్‌ నేస్తాలూ..! పువ్వులు అనగానే మనకు రకరకాల రంగులు, వాటి సువాసనలు గుర్తుకొస్తాయి. వాటితో ఆడుకోవడానికి కూడా ఆసక్తి చూపుతాము. మనకు తెలిసినవి చాలా రకాల పువ్వులే ఉన్నా.. తెలియనివి కూడా కొన్ని ఉంటాయి కదా! అందులో ఒకదాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కథనం చదివేయండి. ఆ వివరాలేంటో తెలిసిపోతాయి..!

రోత్స్‌చైల్డ్స్‌ పఫిలేదిలం.. ఇది చిత్రంలో కనిపిస్తున్న పువ్వు పేరు. పలకడానికి కష్టంగా ఉంది కదా! అయితే దీనికి ఇంకో పేరు కూడా ఉంది.. అదే ‘గోల్డ్‌ ఆఫ్‌ కినబాలు’. ఈ పేరుతోనే ఎక్కువ ప్రాచుర్యంలో ఉందీ పువ్వు. మలేషియాలోని కినబాలు పార్కులో తప్ప ఇంక ఎక్కడా ఈ పువ్వు కనిపించదు. ఎందుకంటే.. అక్కడ మాత్రమే ఈ చెట్టు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందట. లేత పసుపు, ఎరుపు రంగుతో.. కిరీటం ఆకారం కలిగి, చాలా అందంగా ఉంటుంది. ఈ పువ్వులు ఆకు ఆకారంలో వింతగా ఉంటాయి.

చాలా కాలం..!

ఈ చెట్లు పర్వతం మీద.. 600 నుంచి 1200 మీటర్ల వాలుగా ఉన్న ప్రాంతంలో పెరుగుతాయట. సాధారణంగా ఏ చెట్లు అయినా.. కొన్ని నెలలు, లేదంటే ఒక సంవత్సరం తర్వాత పెరిగి పువ్వులు, కాయలు ఇస్తాయి. కానీ ఈ చెట్టు పెగిరి, పువ్వులు పూయడానికి 15 సంవత్సరాల సమయం పడుతుందట నేస్తాలూ..! ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజమే. ఈ పువ్వు ఆకులు దాదాపు 40 నుంచి 60 సెంటీ మీటర్ల పొడవు, 5సెంటీ మీటర్ల వెడల్పు ఉంటాయి. మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలో దొరికే అత్యంత ఖరీదైన పువ్వుల్లో ఇదీ ఒకటి. ప్రస్తుతం ఒక పువ్వు ధర రూ.5.75 లక్షలు. ఈ రోత్స్‌చైల్డ్స్‌ పువ్వుల చెట్లు.. ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయట. అందుకనే వాటిని రక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందట. ఈ పువ్వు విశేషాలు మీకు నచ్చే ఉంటాయి కదా నేస్తాలూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని