చిన్నారి.. పొన్నారి.. డాల్ఫిన్‌ను నేను!

Updated : 09 May 2024 01:24 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! చూడ్డానికి కాస్త చిత్రంగా ఉన్న నేను, నిజానికి ఓ అరుదైన డాల్ఫిన్‌ను. మామూలు డాల్ఫిన్లతో పోల్చుకుంటే నేను చిన్నగా ఉంటాను. మరి నా విశేషాలేంటో తెలుసుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి.

నా పేరు హెక్టర్‌ డాల్ఫిన్‌. నేను న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపిస్తుంటాను. మాలో మళ్లీ రెండు ఉపజాతులున్నాయి. తీవ్రంగా అంతరించిపోయే ముప్పు ఉన్న జాబితాలో ఉన్నాం. మేం మూడు నుంచి అయిదు అడుగులు పొడవు పెరుగుతాం. 40 నుంచి 60 కేజీల వరకు బరువు తూగుతాం. తెలుపు, బూడిద రంగుల్లో ఉంటాం.

ఏం తింటామంటే..

ఎక్కువగా స్క్విడ్‌, చేపలు, రొయ్యలను ఆహారంగా తీసుకుంటాం. గ్రేట్‌ వైట్‌ షార్క్‌, బ్లూ షార్క్‌, కిల్లర్‌ వేల్స్‌ మాకు ప్రధాన శత్రువులు. మేం గుంపులుగా జీవిస్తుంటాం. వేసవిలో సముద్రంలో తక్కువ లోతులోనే తిరుగుతుంటాం. చలికాలంలో మాత్రం లోతులకు వెళ్లిపోతుంటాం.

గెంతులే గెంతులు!

మాకు సముద్ర జలాల్లో గెంతడం అంటే భలే ఇష్టం. ఖాళీ దొరికితే చాలు ఎంచక్కా గాల్లోకి లేస్తూ ఉంటాం. మేం దాదాపు 22 సంవత్సరాల వరకు జీవిస్తాం. విపరీతమైన చేపల వేట, సముద్ర మైనింగ్‌, వాతావరణ మార్పులు, సాగర జలాల కాలుష్యం మాకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఫిషింగ్‌ నెట్‌ల వల్ల మేం ఎక్కువగా గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నాం. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! సరే ఇక ఉంటా మరి.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని