నా రంగుని చూశారా..!

హాయ్‌ నేస్తాలూ..! ‘ఏంటిది.. ఇంత వికృతంగా ఉంది..’ అనుకుంటున్నారా? నా రూపమే అంత! కాస్త వింతగానే ఉంటాను.

Updated : 14 May 2024 05:24 IST

హాయ్‌ నేస్తాలూ..! ‘ఏంటిది.. ఇంత వికృతంగా ఉంది..’ అనుకుంటున్నారా? నా రూపమే అంత! కాస్త వింతగానే ఉంటాను. ప్రతిసారీ చూడటానికి అందంగా ఉన్నవాటి గురించే కాకుండా, నాలాంటి వాటి గురించి కూడా తెలుసుకోండి. ఆలస్యం చేయకుండా.. వెంటనే ఈ కథనం చదివేయండి. అన్ని విషయాలూ తెలిసిపోతాయి!

నా పేరు హనీ బాడ్జర్‌. నేను ఆఫ్రికాకు చెందిన జీవిని. కువైట్‌, ఇండియా, గునియా వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. నన్ను ‘కిల్లర్‌ బీస్‌’ అని కూడా పిలుస్తారు తెలుసా! ఎందుకంటే నేను.. తేనె జాడను మానవులకు చూపిస్తాను కాబట్టి. మాలో మగ వాటిని బోర్స్‌ అని, ఆడ వాటిని సౌస్‌ అని పిలుస్తారు.

రెండు రంగులు..!

నన్ను మొదటిసారి చూసిన వాళ్లు అయితే.. ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. నా శరీరం రెండు రంగుల్లో ఉంటుంది. పైభాగం ముదురు బూడిద, కింది భాగం నలుపు రంగులో ఉంటుంది. కళ్లు చాలా చిన్నగా, నలుపు రంగులో ఉంటాయి. నా ఆకారం మరీ పెద్దగా లేకపోయినా, నేను చాలా బలంగా ఉంటాను. మేము ఎక్కువగా పగటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటాము. మాలో మగ జీవులు ఒక రోజుకు దాదాపు 27 కిలోమీటర్లు ప్రయాణించగలవు. మీకో విషయం తెలుసా.. మా గుంపుని కాలనీ అని పిలుస్తారు.

అన్నీ తింటా..!

నాకు ప్రత్యేకమైన ఆహార అలవాట్లేమీ లేవు నేస్తాలూ! పక్షులు, చిన్నచిన్న జంతువులు, పాములు, గుడ్లు, పండ్లు, దుంపలు.. ఇలా ఏవి దొరికినా తినేసి, నా బొజ్జ నింపుకుంటాను. అందుకే నాకు ఆహారానికి కొరతేమీ ఉండదు. మా సంఖ్య రానురాను చాలా తగ్గిపోతుంది. మా చర్మం కోసం.. మమ్మల్ని వేటాడి చంపుతున్నారు. ఏదైనా ప్రమాదం వస్తుందని గమనించినప్పుడు వెంటనే గుంత తవ్వుకొని, అందులో దాక్కుంటాను. నా బరువు 5 నుంచి 16 కిలోలు ఉంటుంది. ఎత్తు 23 నుంచి 28 సెంటీమీటర్లు. సాధారణంగా అయితే ఏడేళ్లు.. కాస్త రక్షణ కల్పిస్తే, 26 సంవత్సరాల వరకైనా జీవిస్తాను. ఇవీ నా విశేషాలు.. మీకు నచ్చే ఉంటాయి కదూ!?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు