రంగుతోనే మెప్పిస్తాను..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! నన్ను చూసి ఆశ్చర్యపోవడం మానేసి.. నేను చెప్పేది వినండి ముందు. ఎందుకంటే..

Updated : 17 May 2024 00:20 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! నన్ను చూసి ఆశ్చర్యపోవడం మానేసి.. నేను చెప్పేది వినండి ముందు. ఎందుకంటే.. నేను ఎందుకిలా ఉన్నానో చక్కగా వివరిస్తాను. నా విశేషాలు మీతో సరదాగా పంచుకుందామనే ఇలా వచ్చాను. వింటారా మరి? ఇంకెందుకాలస్యం.. వెంటనే ఈ కథనం చదివేయండి!

నా పేరు గ్రేట్‌ హార్న్‌బిల్‌. నేను మన దేశంతో పాటుగా.. చైనా, మలేషియా, నేపాల్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. నేను చూడటానికి చాలా అందంగా, కలర్‌ఫుల్‌గా ఉంటాను. నిజంగానే నా రంగు మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నా శరీరమంతా.. నలుపు, తెలుపు రంగులో ఉంటుంది. రెక్కల మధ్యలో, మెడ చుట్టూ, ముక్కు మీదా పసుపు రంగు ఉంటుంది. నా కనురెప్పలు కూడా ఎవరో అతికించినట్లుగా భలేగా ఉంటాయి తెలుసా!

రాష్ట్ర పక్షిని..!

చెక్కినట్లుగా ఉండే నా ముక్కే నాకు అందం. అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పలేదు కదూ! నేను కేరళ రాష్ట్ర పక్షిని కూడా. మాలో మగ పక్షుల కంటే.. ఆడవి పరిమాణంలో కాస్త చిన్నగా ఉంటాయి. మేము ఎక్కువగా గుంపులుగా ఉండటానికే ఇష్టపడతాము. ఒక్కో గుంపులో దాదాపు 40 వరకు పక్షులుంటాయి. ఆహారం కోసం వెళ్లేటప్పుడు కూడా అంతా కలిసే వెళ్తాం. అయితే.. పగటి సమయంలోనే ఆహారం వెతుక్కోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాం. రాత్రిళ్లు ఎంచక్కా నిద్రపోతాం.

శబ్దాలు చేస్తా..!

నేను ఎక్కువగా పండ్లు తినడానికి ఇష్టపడతాను. కొన్నిసార్లు చిన్న చిన్న కీటకాలను కూడా తింటాను. నేను గట్టిగా శబ్దాలు కూడా చేస్తాను. ఇంకా.. చాలా ఎక్కువ ఎత్తుకు ఎగరగలను. నా రెక్కలు చేసే శబ్దం కూడా ఎక్కువే.. తెలుసా! నేను పుట్టాక.. దాదాపు మూడు నెలల వరకు, అన్నీ మా అమ్మే చూసుకుంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చి.. నేను ఆహారాన్ని వెతుక్కుంటాను. నేను అప్పుడప్పుడు చెట్టు తొర్రల్లో కూడా ఉంటాను. నా బరువు 2 నుంచి 4 కిలోల వరకు ఉంటుంది. పొడవు 95 నుంచి 130 సెంటీ మీటర్లు. నేను దాదాపు 50 ఏళ్ల వరకు జీవిస్తాను. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని