చిన్ని రూపం.. నేనెంతో అపురూపం!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా..! నేను చూడ్డానికి ముద్దుగా.. భలే అందంగా ఉన్నాను కదూ! నాకు తెలిసి నన్ను ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు. అందుకే నా గురించి విశేషాలు చెప్పిపోదామని ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను.

Published : 26 May 2024 00:17 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా..! నేను చూడ్డానికి ముద్దుగా.. భలే అందంగా ఉన్నాను కదూ! నాకు తెలిసి నన్ను ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు. అందుకే నా గురించి విశేషాలు చెప్పిపోదామని ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను.

నేనో ఆక్టోపస్‌ను. నా పేరు డంబో. ‘ఆక్టోపస్‌ ఏంటబ్బా.. ఇలా ఉంది’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ! నేను చాలా అరుదైన జీవిని. నన్ను అంబ్రెల్లా ఆక్టోపస్‌ అని కూడా పిలుస్తుంటారు. నాలో మళ్లీ దాదాపు 15 రకాలున్నాయి. 1000 నుంచి 4000 మీటర్ల లోతైన సముద్రజలాల్లో జీవిస్తుంటాను. అక్కడ చాలా చలిగా, ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఉంటుంది. సూర్యరశ్మి కూడా అక్కడికి చేరుకోలేదు. ఇలాంటి విభిన్న పరిస్థితులనూ తట్టుకొని మా మనుగడ సాగిస్తూ ఉంటాం. నాకు తెలిసి మరే ఆక్టోపస్‌ కూడా సముద్రంలో ఇంత లోతున మనుగడ సాగించలేదు. 

మేం భిన్నం!

మిగతా అక్టోపస్‌లతో పోల్చుకుంటే మేం భిన్నం. మాకు చెవుల్లా ఉండే రెక్కల సాయంతో ఈత కొడుతాం. వీటిని ఆడించడం ద్వారా ముందుకు, వెనక్కు వేగంగా కదలగలుగుతాం. మా జీవితకాలం 3 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే. ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, కాలిఫోర్నియా, న్యూగినియా, గల్ఫ్‌ఆఫ్‌ మెక్సికో సముద్ర జలాలు మాకు ఆవాసాలు.

ఏం తింటామంటే...

మామూలుగా అయితే మేం కేవలం 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు వరకే పెరుగుతాం. గతంలో ఓ డంబో ఆక్టోపస్‌ మాత్రం 1.8మీటర్ల పొడవు, 5.9 కేజీల బరువు తూగిందట. ప్రస్తుతం వరకైతే ఇదే రికార్డు. నేను ఆల్చిప్పలు, నత్తలు, చిన్న చిన్న చేపలు, సముద్రంలో ఉండే పురుగుల్లాంటి వాటిని ఆహారంగా తీసుకుంటాను. పెద్దపెద్ద చేపలు, షార్క్‌లు, సీల్స్, తిమింగలాలు నాకు ప్రధాన శత్రువులు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి. బై.. బై..!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు