నేను.. వలసల పక్షిని..!

హాయ్‌ నేస్తాలూ..! ఏంటి అలా చూస్తున్నారు? ‘చూడటానికి ప్రత్యేకంగా ఏం లేదు.. అయినా మా పేజీలోకి ఎందుకు వచ్చిందా?’ అనే కదా మీ సందేహం.

Published : 27 May 2024 00:08 IST

హాయ్‌ నేస్తాలూ..! ఏంటి అలా చూస్తున్నారు? ‘చూడటానికి ప్రత్యేకంగా ఏం లేదు.. అయినా మా పేజీలోకి ఎందుకు వచ్చిందా?’ అనే కదా మీ సందేహం. నా రూపంలో ప్రత్యేకత లేకపోవచ్చు.. కానీ నా లక్షణాల్లో మాత్రం ఉంది. అందుకే అవి మీతో పంచుకుందామని ఇలా వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కథనం చదివేయండి. నా విశేషాలన్నీ తెలిసిపోతాయి..!

నా పేరు ఆర్కిటిక్‌ టెర్న్‌. మీరు ఎప్పుడూ చూసే పక్షుల్లా కనిపించినా కూడా.. నన్ను మీరు చూసి ఉండరు. ఎందుకంటే నేను మీ దేశంలో ఉండను కాబట్టి. ఆస్ట్రేలియా, బ్రెజిల్, బెల్జియం, కెనడా వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాను. నా శరీరం తెలుపు, లేత బూడిద రంగులో ఉంటుంది. తల మీద నలుపు.. ముక్కు, కాళ్లు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. నేను గూడు కట్టుకోవడానికి సురక్షితమైన ప్రాంతాన్ని ఎంచుకుంటాను. అదే చోట మూడు సంవత్సరాలకు ఒకసారి కొత్త గూడును నిర్మించుకుంటాను. 

ప్రయాణం అంటే ఇష్టం..!

నేను చేపలు, చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాను. అయితే.. పగటి పూట ఆహారాన్ని సంపాదించుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాను. ఇంకో విషయం ఏంటంటే.. నాకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. వేరే చోటుకు వలస వెళ్లడానికి ఇష్టపడతాను. మీకో విషయం తెలుసా.. ప్రపంచంలో ఎక్కువ దూరం వలస వెళ్లే జీవుల్లో నేనే మొదటి స్థానంలో ఉంటాను. సంవత్సరానికి దాదాపు 90 వేల కిలో మీటర్లు ప్రయాణించగలను. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే నేస్తాలూ! అలా ఎక్కువ దూరం వెళ్లినప్పుడు.. నీటి మీద, చెట్ల కొమ్మల మీద విశ్రాంతి తీసుకుంటాను. 

ముప్పేమీ లేదు..!

వలసలు ఎక్కువగా వెళ్లడం వల్ల నేను రెండు వేసవికాలాలను చూడగలను. ఎక్కువ సూర్యరశ్మిని పొందే పక్షిని కూడా నేనే. ప్రస్తుతానికి మా ఉనికికి ముప్పేమీ లేదు. నా బరువు 86 నుంచి 127 గ్రాములు ఉంటుంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఎగరగలను. నేను దాదాపు 30 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని