టెడ్డీబేర్‌ బొమ్మ! ఈ రోజు నీదే సుమా!!

టెడ్డీబేర్‌లంటే మనకు భలే ఇష్టం... మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి... ఇంకా ఇంకా కొనుక్కోవాలనిపిస్తాయి... మరి వీటికీ ఓ రోజుందని తెలుసా? మరి ఆ సంగతులేవో చదువుకుందామా! మీ ఇంట్లో టెడ్డీబేర్‌ ఉందా? అయితే ఈ రోజు దాన్ని...

Published : 09 Sep 2016 01:49 IST

టెడ్డీబేర్‌ బొమ్మ! ఈ రోజు నీదే సుమా!!

టెడ్డీబేర్‌లంటే మనకు భలే ఇష్టం... మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి... ఇంకా ఇంకా కొనుక్కోవాలనిపిస్తాయి... మరి వీటికీ ఓ రోజుందని తెలుసా? మరి ఆ సంగతులేవో చదువుకుందామా!

మీ ఇంట్లో టెడ్డీబేర్‌ ఉందా? అయితే ఈ రోజు దాన్ని ఒళ్లొకి తీసుకుని, దాని మెత్తటి జూలు దువ్వుతూ ‘శుభాకాంక్షలు’ చెప్పండి. ఎందుకంటే ఇవాళ ‘టెడ్డీబేర్‌ డే’. అంటే దాని కోసం ప్రత్యేకంగా కేటాయించిన రోజన్నమాట. ఇవాళ సెప్టెంబరు 9 కదా? చాలా దేశాల్లో ఈ రోజును ‘టెడ్డీబేర్‌ డే’గా జరుపుకుంటారు.

* అమెరికాలో అయితే టెడ్డీబేర్లను బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటారు. ఇంట్లో వాడకుండా ఉన్న పాతవాటిని స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థల్లో ఇచ్చేస్తారు. వాళ్లు వాటిని శుభ్రం చేసి అనాథ పిల్లలకు పంచుతారన్నమాట.

* బేర్‌ అంటే ఎలుగుబంటని తెలుసుగా? వాటి గురించి పిల్లలకు బోలెడు విషయాలు చెప్పేందుకు అక్కడ జూల్లో ఈ వారమంతా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటి కార్టూన్‌ సినిమాలు, పుస్తకాల్లాంటి వాటినీ ప్రదర్శిస్తారు.
* ఎలుగుబంటి బొమ్మకి ‘టెడ్డీ బేర్‌’ అనే పేరు రావడానికి ఓ కథుందని తెలుసా?
* 1902లో థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ అమెరికాకి అధ్యక్షుడిగా పనిచేసేవారు. అక్కడ మిస్సిసిపీలో ఉన్న ఓ అడవికి ఆయన వేటకెళ్లారు. అక్కడ అందంగా ఉన్న ఓ ఎలుగు బంటి పిల్ల కనిపించింది. తుపాకీ గురిపెట్టినా, దాన్ని చంపేందుకు ఆయన మనసొప్పుకోక ప్రాణాలతో విడిచిపెట్టేశారు. అప్పుడు ఆ వార్త అన్ని పత్రికల్లోనూ వచ్చింది. ఓ పత్రిక దాన్ని టెడ్డీబేర్‌ అని రాసిందట. అందుకు గుర్తుగానే ఈ రోజు జరుపుకుంటారనీ చెబుతారు.
* తర్వాత అమెరికాలో ఓ బొమ్మల తయారీ సంస్థ టెడ్డీబేర్‌ పేరుతో బొమ్మల్ని తయారు చెయ్యడం ప్రారంభించింది. మరికొంత కాలానికి మరో జర్మన్‌ సంస్థా ఈ బొమ్మల తయారీ మొదలుపెట్టింది.
* అంటే మన బుజ్జి టెడ్డీలు పుట్టి 114 ఏళ్లయ్యిందన్నమాట.


మీకు తెలుసా?

* ప్రపంచంలోనే ఎక్కువ టెడ్డీబేర్లు పోగేసిన మహిళ జాకీ మెలెయ్‌. ఆమె దగ్గర ఏకంగా ఎనిమిది వేలకుపైగా బొమ్మలున్నాయి. ఇది గిన్నిస్‌ రికార్డు కూడా.
* అతిపెద్ద టెడ్డీబేర్‌ దక్షిణ కొరియాలోని ఇంచెన్‌లో ఉంది. అది 32 అడుగుల పొడవుంది.
* అతి చిన్న టెడ్డీబేర్‌ పరిమాణం 4.5 మిల్లీమీటర్లు. అంటే అది మన గోటి కంటే చిన్నగానే ఉంటుంది. దక్షిణాఫ్రికాలో తయారైన ఇది ఇప్పుడు దక్షిణ కొరియాలోని ఓ మ్యూజియంలో ఉంది.
* ప్రపంచంలో మొదటి టెడ్డీబేర్‌ మ్యూజియంని ఇంగ్లండ్‌లోని పీటర్స్‌ఫీల్డ్‌లో 1984లో ప్రారంభించారు. అయితే అది 2006లో మూతపడింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని