సినిమా చదివిస్తా.. బాబూ..!

హాయ్‌ నేస్తాలూ.. ఎంత మంచి కార్టూన్‌ సిరీస్‌ అయినా, మనకిష్టమైన గేమ్‌ అయినా..మహా అయితే కదలకుండా గంటసేపు చూస్తాం.

Updated : 28 Mar 2023 03:46 IST

హాయ్‌ నేస్తాలూ.. ఎంత మంచి కార్టూన్‌ సిరీస్‌ అయినా, మనకిష్టమైన గేమ్‌ అయినా..మహా అయితే కదలకుండా గంటసేపు చూస్తాం. ఇక మూడు గంటలపాటు కుదురుగా కూర్చొని, సినిమా చూడటమంటే మనలాంటి పిల్లలకు చాలా కష్టమైన పని. కానీ, ఓ తల్లి మాత్రం తన కొడుక్కి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూపించాలని అనుకుంది. అందుకు ఆ తల్లి ఏం చేసిందో మీరే తెలుసుకోండి మరి..

మన తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాట ఇటీవల ఆస్కార్‌ అవార్డు సాధించిందని మీకు తెలిసే ఉంటుంది. అయితే, ఆ సినిమాను జపాన్‌కు చెందిన ఓ తల్లి, తన ఏడేళ్ల కుమారుడికి చూపించాలని అనుకుంది. అన్నం తినిపించేందుకే చుక్కలు చూపించే ఆ వయసు పిల్లాడికి.. సబ్‌టైటిల్స్‌తో అంతసేపు సినిమా చూపించడం చాలా కష్టం. అందుకే, ఆ సినిమాలోని ప్రధాన అంశాలతో ఓ కథల పుస్తకం తయారు చేసింది. ఆయా సన్నివేశాలకు సంబంధించిన బొమ్మలనూ తానే స్వయంగా గీసింది. ఇక ఆ తర్వాత తన కొడుకును ఎంచక్కా ఒడిలో కూర్చోబెట్టుకొని.. ఆ పుస్తకం సహాయంతో సినిమా మొత్తాన్ని వివరించేసిందా తల్లి.

క్షణాల్లోనే వైరల్‌..

ప్రపంచ ఖ్యాతి సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను ఓ పుస్తకంలా తయారు చేసిన వీడియోను ఎవరో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇక అంతే.. కొద్దిగంటల్లోనే ఆ తల్లి ప్రతిభ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తెలుగు చిత్రానికి జపాన్‌లో అంత క్రేజ్‌ రావడమంటే మాటలు కాదు కదా.. అందుకే, ఆ పుస్తకాన్ని చూడాలని భారతీయులు సోషల్‌ మీడియాలో తెగ వెతికేస్తున్నారట. నెటిజన్లు సైతం ఆ తల్లీకొడుకులపైన ప్రశంసలు కురిపిస్తున్నారు. నేస్తాలూ.. పుస్తకంతోపాటు బొమ్మలూ భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని