గణ గణ గంటల మోతే..!

అక్కడ అడుగు పెట్టామంటే చాలు. ఎటు చూసినా గంటల వరుసలే! గణ గణమంటూ స్వాగతం పలుకుతాయి. ఒక్కో గంటది ఒక్కో ప్రత్యేకత. ఒక్కోటి ఒక్కోలా శబ్దం చేస్తుంది. దేని విశిష్టత దానిదే.

Published : 23 Mar 2023 00:08 IST

అక్కడ అడుగు పెట్టామంటే చాలు. ఎటు చూసినా గంటల వరుసలే! గణ గణమంటూ స్వాగతం పలుకుతాయి. ఒక్కో గంటది ఒక్కో ప్రత్యేకత. ఒక్కోటి ఒక్కోలా శబ్దం చేస్తుంది. దేని విశిష్టత దానిదే. ఇంతకీ ఈ గంటలన్నీ ఎక్కడున్నాయో తెలుసా...!

కేరళలోని తిరువనంతపురానికి చెందిన లతామహేష్‌ అనే అమ్మమ్మ దగ్గర కొన్నివేల గంటలున్నాయి. మన దేశంలో ఇంకెవరి దగ్గర కూడా ఇన్ని గంటలు లేవంటే అతిశయోక్తి కాదు. ఈమె ఏర్పాటు చేసుకున్న తన సొంత మ్యూజియంలో ప్రస్తుతం దాదాపు 7,500 వరకు గంటలున్నాయి.

దేశవిదేశాల నుంచి...

ఈమె కేవలం మనదేశానికి చెందిన గంటలనే కాకుండా విదేశాల నుంచి సైతం సేకరించారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 90 దేశాల నుంచి తెప్పించారు. 1988లో యూకే వెళ్లినప్పుడు మొదటిసారిగా లతామహేష్‌కు గంటలు సేకరించాలన్న ఆసక్తి కలిగింది. అలా అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడికెళ్లినా అక్కడి నుంచి గంటలు సేకరించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు.

కిలోమీటరు వరకు...

ఈమె సేకరించిన వాటిలో 68 సెంటీమీటర్ల పొడవు, 167 కిలోగ్రాముల బరువున్న గంటే పెద్దది. ఇదో గుడి గంట. దీనికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... దీన్ని మోగిస్తే ఆ శబ్దం దాదాపు కిలోమీటరు దూరం వరకూ వినిపిస్తుందట.

రెండో ప్రపంచయుద్ధం నాటి...

ఈ అమ్మమ్మ దగ్గర రెండో ప్రపంచయుద్ధ కాలానికి చెందిన అత్యంత అరుదైన గంట ఉంది. ఇది అల్యూమినియంతో తయారైంది. ఇలాంటి చరిత్రాత్మకమైన గంటలతో పాటు, మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేవీ ఉన్నాయి. ఇంకా మనలాంటి బుజ్జాయిలకు నచ్చేలా ఐస్‌క్రీం కోన్‌ బెల్‌్్స, జార్‌బెల్స్‌, గుమ్మడికాయ ఆకృతుల్లో ఉండే గంటలు కూడా ఉన్నాయి. ఇన్ని గంటలు సేకరించిన ఈ అమ్మమ్మ ఎంతైనా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు