రండి బాబూ.. రండి..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే.. ఖర్చు, శ్రమతో కూడుకున్న పని. అదే విదేశాలకైతే.. పాస్‌పోర్టు, వీసా అదీ ఇదీ అంటూ దానికి బోలెడు తతంగం ఉంటుంది కదూ! కానీ, ఆ ఇబ్బందులేవీ లేకుండానే.. ‘మా ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడితే చాలు..

Updated : 15 Mar 2023 04:42 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే.. ఖర్చు, శ్రమతో కూడుకున్న పని. అదే విదేశాలకైతే.. పాస్‌పోర్టు, వీసా అదీ ఇదీ అంటూ దానికి బోలెడు తతంగం ఉంటుంది కదూ! కానీ, ఆ ఇబ్బందులేవీ లేకుండానే.. ‘మా ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడితే చాలు.. మేమే మీకు చాలా డబ్బిస్తాం’ అని అంటున్నారో ఊరి ప్రజలు. ఇంతకీ అదెక్కడో, అలా ఎందుకు ఆహ్వానిస్తున్నారో తెలుసుకుందామా..!

స్విట్జర్లాండ్‌ అనగానే మనకు అందమైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తుకొస్తాయి. అంతేకాదు.. ఆ దేశం క్రమశిక్షణ, పరిశుభ్రతకు మారుపేరు. విద్యారంగంలోనూ ప్రపంచంలోనే మేటిగా నిలుస్తోంది. అలాంటి దేశంలో ఆల్బినెన్‌ అనే ఓ మారుమూల గ్రామం ఉంది. సముద్రమట్టానికి 4,265 అడుగుల ఎత్తులో ఉంటుందది. ప్రకృతి ఒడిలో సేదతీరినట్లు ఉండే ఆ చోటుకి.. వేరే ప్రాంతాల నుంచి వలసలను ఆహ్వానిస్తున్నారా స్థానికులు. అంతేకాదు.. అక్కడికి వెళ్లి స్థిరపడే కుటుంబాలకు ప్రోత్సాహకంగా రూ.50 లక్షలు కూడా ఇవ్వనున్నారట.

జనాభా తగ్గిపోతుండటంతో..

ఇంతకీ ఆ ఆల్బినెన్‌ వాసులు వేరే ప్రాంతం వారిని ఎందుకు తమ గ్రామానికి పిలుస్తున్నారంటే.. రోజురోజుకీ అక్కడ జనాభా తగ్గిపోతుండటమే అందుకు కారణం. నలుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఇక్కడికి వచ్చి స్థిరపడితే.. రూ.అర కోటి ఇవ్వనున్నారట. అవికాకుండా.. పిల్లలు ఒక్కొక్కరికి రూ.9లక్షలు, పెద్దలకు రూ.22.5 లక్షల చొప్పున చెల్లించనున్నారు.

నిబంధనలూ ఉన్నాయండోయ్‌..

ఇది చదవగానే.. ‘అబ్బా.. వెంటనే వెళ్లిపోవచ్చు’ అని ఎగిరి గంతేయకండి నేస్తాలూ.. దీనికి కొన్ని నిబంధనలూ ఉన్నాయి. వలస వచ్చిన వారు కనీసం పదేళ్లు అక్కడే ఉండాలట. మధ్యలో వెళ్లిపోతే.. బహుమతిగా పొందిన డబ్బును తిరిగి చెల్లించాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే.. స్విట్జర్లాండ్‌ దేశస్థులతోపాటు యూరప్‌, అమెరికా, కెనడా వారికే ఈ అవకాశం అని చెబుతున్నారు.

మేడలు కట్టడం నిషిద్ధం

ఆల్బినెన్‌ ప్రజలు.. తమ ఊరు స్వచ్ఛంగా ఉండేలా చూసుకుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ మాల్స్‌లాంటివి కట్టడం నిషిద్ధం. ఎందుకూ అంటే.. అవి వస్తే, చుట్టూ ఉన్న పర్యావరణం దెబ్బతింటుందని. పరిశుభ్రతతోపాటు గొప్ప విద్యావ్యవస్థ ఉన్న ఈ దేశానికి వచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారట.


ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇటలీలోని ప్రెస్సీ అనే ప్రాంతం. ఈ పట్టణంలో నివాసం ఉండేందుకు వచ్చే వారికి రూ.25 లక్షలు ఇస్తారట.  


ఇది గ్రీస్‌లోని అంటీకైథ్రా అనే ఐల్యాండ్‌. సముద్ర తీరంలో ఉండే సుందరమైన ఈ ద్వీపంలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి నెలకు రూ.50 వేలు బహుమతిగా ఇవ్వనున్నారట. ఇల్లు కూడా వాళ్లే సమకూరుస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని