భూముల వేలం..మార్కెట్‌పై ప్రభావం

ప్రభుత్వ స్థలాల వేలం పాట స్థిరాస్తి మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మూడు రోజులపాటు నిర్వహించిన వేలంపాటను ఇటు కొనుగోలుదారులు, అటు నిర్మాణదారులు ఆసక్తిగా గమనించారు. కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన మార్కెట్‌ జోరుకు అద్దం పట్టినా.. ఆయా వర్గాలను ఒకింత కలవరానికి...

Published : 28 Apr 2018 01:30 IST

భూముల వేలం..మార్కెట్‌పై ప్రభావం
ఈనాడు, హైదరాబాద్‌  

ప్రభుత్వ స్థలాల వేలం పాట స్థిరాస్తి మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మూడు రోజులపాటు నిర్వహించిన వేలంపాటను ఇటు కొనుగోలుదారులు, అటు నిర్మాణదారులు ఆసక్తిగా గమనించారు. కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన మార్కెట్‌ జోరుకు అద్దం పట్టినా.. ఆయా వర్గాలను ఒకింత కలవరానికి గురిచేసింది. హెచ్‌ఎండీఏ నిర్ణయించిన అప్‌సెట్‌ ధర కంటే చాలా ప్రాంతాల్లో స్థలాల ధరలు కొన్నిరెట్లు అధికంగా పలికాయి. వీటి విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆశించిన దానికంటే అధికంగా ఆదాయం రావడం సంతోషంగా ఉన్నా.. ధరలను చూసి సామాన్యులు, మధ్యతరగతి వాసులు ఆందోళనకు గురవుతున్నారు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు, భవిష్యత్తు దృష్ట్యా స్థలాలను కొనాలనుకునేవారు ఈ ధరలను చూసి బెంబేలెత్తుతున్నారు.
ప్రభుత్వ స్థలాలను వేలం వేయడం ద్వారా స్పెక్యులేషన్‌కు దారి తీస్తుందని.. మరో రూపంలో విక్రయించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం స్థిరాస్తి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒక ప్రాంతంలో చివరగా ఎవరైనా స్థలం అమ్మితే అక్కడ విక్రయించిన ధర కంటే తక్కువగా అమ్మడానికి ఎవరూ ఇష్టపడరు. స్థల యాజమాని, కొనుగోలుదారు ఇద్దరి మధ్య జరిగే లావాదేవీ అయినా మధ్యవర్తుల ద్వారా ఆ ప్రాంతమంత తెలిసిపోతుంది. ప్రధాన రహదారికి దూరంగా ఉంటే ఒక ధర.. దగ్గరలో ఉంటే మరో ధర ఉంటుంది. మధ్యవర్తులు ఎక్కువ చేసి చెబుతుంటారు. మొత్తంగా ఆ ధరకు అటుఇటుగా అక్కడ మార్కెట్‌ స్థిరపడుతుంది. ఇదంతా లోపల్లోపల జరుగుతోంది. హెచ్‌ఎండీఏ మియాపూర్‌, చందానగర్‌, మాదాపూర్‌ సెక్టార్‌ 1, 3, నల్లగండ్ల, బాచుపల్లి, దూలపల్లి, మంఖల్‌, అమీన్‌పూర్‌, అంతారం, భువనగిరి, ఘట్‌కేసర్‌, పోచారం, ఎల్బీనగర్‌, జల్‌పల్లి, షేక్‌పేట, తెల్లపూర్‌, శంకర్‌పల్లి, వనస్థలిపురం, అత్తాపూర్‌, మైలార్‌దేవ్‌పల్లి, నెక్నంపూర్‌ వంటి ప్రాంతాల్లోని 210 ప్లాట్లను వేలం వేసింది. మాదాపూర్‌, అత్తాపూర్‌లో చదరపు గజం లక్షన్నర పైన పలకడం రియాల్టీ వర్గాలను ఆశ్చర్చపర్చింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ధరకంటే కూడా ఇది చాలా ఎక్కువ. హెచ్‌ఎండీఏనే విక్రయిస్తుండటంతో భూ వివాదాలు లేకుండా క్లియర్‌ టైటిల్‌ ఉంటుందనే సానుకూల అంశాలు చూసి పోటీపడి మరి కొనుక్కున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ధర అనూహ్యంగా పెరగడం స్పెక్యులేషన్‌కు దారితీస్తుందని నిర్మాణ వర్గాలు అంటున్నాయి. ఇకముందు అక్కడ ఎవరైనా కొనాలంటే ఇదే ధర వెచ్చించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అంతకంటే తక్కువ అంటే విక్రయించడానికి ఎవరూ ముందుకురారు. ఇది మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే మేలు   

దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి ఇక్కడ భూముల ధరలు అందుబాటు ధరల్లో ఉన్నాయనే కారణంతోనే. కార్యాలయ అద్దెలు, ఇళ్ల ధరలు తక్కువగా ఉండటంతో ఇక్కడ మిగతా నగరాలతో పోలిస్తే జీవనవ్యయం తక్కువ. భూముల ధరలు ఇలా అనూహ్యంగా సర్కారే పెంచితే కార్యాలయ అద్దెలు, ఇంటి ధరలు పెరుగుతాయి. భూములను రక్షించలేని పరిస్థితుల్లో విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధి పనులను కేటాయించుకోవడం మంచిదే. కానీ వేలం ద్వారా విక్రయించడం ద్వారా అనూహ్యంగా ధరలు పెరగడం.. చ.గజం ఎంతవరకు పోయిందో బహిర్గతం అవడం కారణంగా ఆ ధరనే బెంచ్‌మార్క్‌గా మారుతుంది. 210 ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.351 కోట్లను ఆర్జించడం మొత్తం మార్కెట్లో ఒక శాతం విలువ ఇది. కానీ 99 శాతం మార్కెట్‌పై దీని ప్రభావం ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచిస్తున్నాం. హెచ్‌ఎండీఏనే ఒక ధర నిర్ణయించి కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన వారిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తే బాగుండేది. పీపీపీ పద్ధతిలో ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశాలుఉన్నాయి.

- సి.శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని