కొవ్వు చికిత్సలోనూ ఆడవారిపై వివక్షే

జబ్బులు, చికిత్సల విషయంలో మహిళలను చిన్నచూపు చూడటం గమనిస్తున్నదే. స్వీడన్‌లోని ఉప్సల యూనివర్సిటీ అధ్యయనంలో దీన్ని మరోసారి ఎత్తి చూపింది.

Published : 30 Apr 2024 00:04 IST

జబ్బులు, చికిత్సల విషయంలో మహిళలను చిన్నచూపు చూడటం గమనిస్తున్నదే. స్వీడన్‌లోని ఉప్సల యూనివర్సిటీ అధ్యయనంలో దీన్ని మరోసారి ఎత్తి చూపింది. గుండెజబ్బులు గల మగవారితో పోలిస్తే ఆడవారికి కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్‌ రకం మందులను ఇవ్వటం తక్కువేనని వెల్లడించింది. గుండెజబ్బులు గలవారిలో లక్షణాలను తగ్గించటానికి, గుండెపోటు నివారణకు, మృత్యువాత పడకుండా ఉండటానికి మందులు అత్యవసరం. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు వీరందరికీ ఇవ్వాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. స్టాటిన్‌ మందును గరిష్ఠ మోతాదులో ఇచ్చినా కొలెస్ట్రాల్‌ తగ్గనట్టయితే మరో రకం మందునూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మగవారికి, ఆడవారికి ఇద్దరికీ సమానమే. అయినప్పటికీ ఆడవారిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) స్థాయులు తగ్గటం లేదని గత అధ్యయనాల్లో వెల్లడైంది. దీనికి కారణమేంటి? ఆడవారికి, మగవారికి సమానంగా చికిత్స చేస్తున్నారా? లేదా? అనే దానిపై స్వీడన్‌ పరిశోధకులు దృష్టి సారించారు. దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతూ, గుండెపోటు రానివారిని ఎంచుకొని ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు. జబ్బు నిర్ధరణ అయ్యాక మొదట్లో దాదాపు అందరికీ కొలెస్ట్రాల్‌ తగ్గించే మందులను బాగానే ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆడవారిలో తగ్గిపోతూ వచ్చింది. మూడేళ్ల అనుశీలన అనంతరం కేవలం 54% మంది మహిళలకే మందులతో చికిత్స చేశారని గుర్తించారు. అదే మగవారిలో 74% మందికి వీటిని ఇచ్చారు. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ తేడా పెరుగుతూ వస్తుండటం గమనార్హం. ఒక మందుతో కొలెస్ట్రాల్‌ తగ్గకపోతే రెండో మందును జోడించటమూ ఆడవారిలో తక్కువగానే కనిపించింది. ‘కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు ప్రాణాలను కాపాడతాయి. గుండెపోటును నివారిస్తాయి. వీటిని గుండెజబ్బులు గల అందరికీ సమానంగా సిఫారసు చేయాలి’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ నీనా జాంస్టన్‌ సూచిస్తున్నారు. ఈ అత్యవసర మందులను మహిళలకు అంతగా ఇవ్వటం లేదని తమ అధ్యయనంలో తేలటం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని