తాటిముంజెలు... కోటి లాభాలు!

‘ఇక్కడి నుంచి చూస్తే ఇనుము, దగ్గరికిపోతే గుండు, పట్టి చూస్తే పండు, తింటే తీయగనుండు’ ఈ పొడుపుకథకు జవాబు తాటిపండు అని అందరూ చెప్పకపోవచ్చు కానీ ‘దాహం తీర్చే గుణం, వెన్నలా కరిగిపోయే తీరు, ఎండల్లో చలువనిచ్చే ఐస్‌ పండు’ ఏమిటది... అంటే మాత్రం కాసేపు ఆలోచించి అయినా తాటిముంజె అని చెబుతారు.

Updated : 14 Apr 2024 07:57 IST

‘ఇక్కడి నుంచి చూస్తే ఇనుము, దగ్గరికిపోతే గుండు, పట్టి చూస్తే పండు, తింటే తీయగనుండు’ ఈ పొడుపుకథకు జవాబు తాటిపండు అని అందరూ చెప్పకపోవచ్చు కానీ ‘దాహం తీర్చే గుణం, వెన్నలా కరిగిపోయే తీరు, ఎండల్లో చలువనిచ్చే ఐస్‌ పండు’ ఏమిటది... అంటే మాత్రం కాసేపు ఆలోచించి అయినా తాటిముంజె అని చెబుతారు. మంచు ముద్దలాంటి ముంజె- వేసవి కాలంలో చల్లదనాన్ని మాత్రమే కాదు, అంతకుమించిన మేలే చేస్తుందట. ముంజెల ఆ మజా మజా కబుర్లలోకి వెళితే...

ఎండాకాలపు ఉక్కపోతలు ఎంతలా ఇబ్బంది పెట్టినా... వేసవి వడగాలులు విలవిలలాడిపోయేలా చేసినా... సూర్యుడి ప్రతాపం మనల్ని మరెంత తాపానికి గురిచేసినా... వాటిని కాస్త మరిపించేవి- ఈ కాలంలోనే దొరికే ప్రత్యేకమైన పండ్లు.

వాటిల్లో మామిడికాయలతో సమానంగా అందరికీ నచ్చేవి తాటి ముంజెలు. మంచు ముక్కల్లాంటి ముంజెల్లో తినడానికి ఏముంటుంది అని కొంతమంది అనుకుంటారు కానీ నిజానికి బోలెడన్ని పోషకాలున్నాయి. శరీరానికి కావాల్సిన నీళ్లను అందించడం దగ్గర్నుంచి క్యాన్సర్‌ కారకాల్ని తరిమికొట్టే వరకూ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఇప్పటిదాకా అంతగా పట్టించుకోని ఆ విశేషాలేమిటో ఒక్కసారి విన్నారంటే- ఈ ఏడు ఎప్పటి కన్నా ఇంకాస్త ఎక్కువే లేలేత ముంజెల్ని జుర్రుకుని తినేస్తారేమో!

నిజానికి జామ, మామిడి, అరటిలాంటి పండ్ల సంగతి వేరు, ముంజెల విషయం వేరు. ఎక్కువగా సహజసిద్ధంగా మాత్రమే పెరిగే తాటిచెట్ల నుంచి కొబ్బరికాయల్లాంటి తాటికాయల్ని దింపడం, వాటిని ఒక దగ్గరకు చేర్చడం, కాయల్ని కత్తితో కొట్టడం... అబ్బో ఇదంతా కూడా పెద్ద ప్రయాసే. అంతేకాదు, తినడమూ అంత సులువేం కాదు... గుండ్రని తాటికాయకి పైన ఉన్న డిప్పను కోయగానే మూడు రంధ్రాలు కనిపిస్తాయి. వాటిల్లోనే పసుపు, నారింజ రంగు తొక్కలతో ముంజెలు ప్రత్యక్షమవుతాయి. అవి మరీ లేతవైతే వేళ్లతో జుర్రుకోవడమో కాస్త ముదురుగా ఉంటే తీసుకుని తినడమో చేస్తుంటారు. ఆ తతంగమంతా ఎలా ఉన్నా, చెట్టు మీద నుంచి నోట్లోకి చేరేవరకూ ఎంత శ్రమైనా... ‘అబ్బ, జెల్లీ లాంటి ఆ ముంజె తినకుండానే వేసవి గడిచిపోతుందేమో’ అంటూ వాటికోసం ఎదురుచూసేవాళ్లెందరో.

సోలార్ తో అదనపు ఆదాయం ఎలా పొందాలో తెలుసా?

ఎన్ని పేర్లో..

శాస్త్రీయంగా ‘బోరాసస్‌ ఫ్లాబెల్లిఫెర్‌’గా పిలిచే తాటిముంజెల్ని- తెల్లని రూపమూ చల్లని తీరునూ బట్టి ఆంగ్లంలో ‘ఐస్‌ ఆపిల్‌’ అనీ, కన్నడలో తాటి నుంగు, తమిళంలో నుంగు, బంగ్లాలో తాల్‌... ఇలా ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. పొడి, ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే తాటిముంజెలు దక్షిణ ఆసియాకి చెందినవని చెబుతారు. ముఖ్యంగా భారత్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల్లో అత్యధికంగా ఉంటాయివి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ విరివిగా దొరికే ఈ ముంజెలు మన దేశంలో మిగతా ప్రాంతాల కన్నా తమిళనాడు, మహారాష్ట్ర, తెలుగురాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ముంజెకున్న క్రేజ్‌ వల్ల పల్లెటూళ్లతోపాటూ పట్టణాల్లోనూ తాటికాయల్ని తీసుకొచ్చి గుట్టలుగా పోసి అమ్ముతుంటారు.

ఎన్ని ప్రయోజనాలో..

  •  అధిక శాతం నీటితో ఉండే తాటిముంజెలు కూలింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. రోజంతా చురుగ్గా పనిచేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
  •  తక్కువ క్యాలరీలు, ఎక్కువ కాల్షియం, పీచు, ప్రొటీన్లు, ఐరన్‌, జింక్‌... విటమిన్‌-సి, విటమిన్‌-ఎ, విటమిన్‌-ఇ, విటమిన్‌-కె, విటమిన్‌ బీ7లతో ఉండే తాటిముంజెలు- ఎండాకాలానికి మంచి సూపర్‌ ఫుడ్‌ మరి.
  •  దీంట్లో ఉండే సోడియం, పొటాషియం ఖనిజాలు శరీరంలో ఎలక్ట్రొలైట్ల సమతుల్యతను కాపాడటంలో సాయపడతాయి. ఎండ వేడిమి కారణంగా మనం కోల్పోయిన పోషకాల్ని తిరిగి అందిస్తాయి, శరీరాన్ని డీహైడ్రేషన్‌ నుంచి రక్షిస్తాయి.
  •  తాటిముంజెల్లోని నీళ్లు పిల్లలకూ, వృద్ధులకూ ఎంతో మంచివి. ఎసిడిటీ, మలబద్ధకం, అల్సర్లలాంటి సమస్యల్ని నివారిస్తూనే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
  •  గర్భిణులు మిగతా ఆహారంతోపాటూ వీటినీ తీసుకున్నారంటే వాంతులూ వికారం నుంచి ఉపశమనం పొందొచ్చు. పాలిచ్చే తల్లులు తింటే సమృద్ధిగా పాలు పడతాయట.
  •  వేసవిలో దద్దుర్లు, స్కిన్‌ అలర్జీల్లాంటివి వస్తుంటాయి. ముంజెల్ని తిన్నా, గుజ్జును నేరుగా రాసుకున్నా చర్మం పొడిబారే సమస్య నుంచి కాపాడి నిగారింపుని అందిస్తాయి. ఇంకా జుట్టుకూ సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తూ కుదుళ్లను బలంగా చేస్తాయి.
  •  అధికశాతం పొటాషియంతో ఉండే ముంజెలు శరీరంలోని వ్యర్థాల్ని బయటికి పంపడానికీ, లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడానికీఎంతో ఉపయోగపడతాయట. పొటాషియం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది, ఇంకా గుండె, కిడ్నీలూ ఆరోగ్యంగా ఉంటాయి.
  •  బరువు తగ్గాలనుకునేవాళ్లకీ ముంజెలు మంచి ఆహారం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీళ్లతో సన్నబడటంలో సాయపడతాయి. పైగా వీటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తీసుకుంటారు.
  •  ఆడవాళ్లు ఎక్కువగా ఎదుర్కొనే మూత్ర సంబంధిత వ్యాధుల బారి నుంచి ముంజెలు కాపాడతాయి. వీటిల్లోని యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు యూరిన్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయట.
  •  దీంట్లో ఉండే మెగ్నీషియం, ప్రొటీన్లు కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతూ తిమ్మిర్ల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.  
  •  లేత ముంజెల్ని పొట్టుతో సహా తిన వల్ల శరీరానికి కావాల్సిన పీచు అందుతుందట.
  •  యాంటీ హైపర్‌గ్లైసెమిక్‌ ఏజెంట్‌గా పనిచేస్తూ డయాబెటిస్‌తో ఇబ్బంది పడేవాళ్లకు ముంజెలు ఎంతగానో ఉపయోగపడతాయి.
  •  వివిధ రకాల ట్యూమర్లూ, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కణాల్ని వృద్ధి చేసే కారకాల్ని నిర్మూలించే పోషకాలు తాటి ముంజెల్లో దండిగా ఉన్నాయి.
  •  శ్వాసకోశ ఇబ్బందులతో పాటు దగ్గు తగ్గించడంలోనూ ముంజెల పాత్ర ఎంతో ఉంది.
  •  పిల్లల్లో, పెద్దల్లో పోషకాహార లోపాన్ని తగ్గిస్తూ ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషక గుణాలతో నిండిన ముంజెలు... నిజంగా అమృత ఫలాలే.
  • ఈ ఎండల్లో గొంతు తడుపుకోవ డానికి ఎప్పటిలా కృత్రిమమైన కూల్‌డ్రింకులకు బదులు చల్లచల్లని ముంజెల్ని నోట్లో వేసుకున్నారంటే... అటు దాహమూ తీరుతుంది, ఇటు ఆరోగ్యమూ బాగుంటుంది... ఏమంటారు?!

ఉత్పత్తులు...

కేవలం వేసవిలో మాత్రం దొరికే ముంజెల్ని మామూలు కాలాల్లోనూ తినాలనుకుంటే ఎలా... అందుకే మిగిలిన పండ్లలాగే ఎండు తాటిముంజెలూ దొరుకుతున్నాయి. ఎక్కడికైనా పంపేలా ప్రత్యేకమైన ప్యాకింగ్‌తో లభిస్తాయి. ముంజెలతో చేసిన జ్యూసు బాటిళ్లూ వచ్చాయి. ఇంకా, ముంజెలకు అదనపు పదార్థాల్ని కలిపి కొత్త రుచిని సృష్టిస్తూ రకరకాల వంటకాలూ ట్రై చేస్తున్నారు. తెల్లగా తియ్యని నీళ్లతో నిండి ఉండే ముంజెలతో ఐస్‌ ఆపిల్‌ ఖీర్‌, ఐస్‌క్రీములూ, స్మూతీలూ, సలాడ్లూ, షర్బత్‌, బర్ఫీ, నుంగు పాయసం అంటూ తీయతీయని వంటల్నీ వండుతున్నారు. అంతేకాదు, జుట్టుకీ, చర్మానికీ వాడే రకరకాల సౌందర్యోత్పత్తుల్లోనూ దీన్ని వాడుతున్నారు.

తాటికాయల్లోంచి ముంజెల్ని తీయకుండా వదిలేస్తే అవి తాటిపండ్లవుతాయి. గుజ్జు తీసి వాటిని అలాగే మట్టితో కప్పి ఉంచితే తేగలు వస్తాయి. ఆ తాటి తేగల్ని టెంక నుంచి వేరు చేసి తినొచ్చు లేదంటే అవే మొక్కలవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..