హృద్యమైన కథలు

తెలుగు సొసైటీ ఆఫ్‌ అమెరికా (తెల్సా) కథల పోటీల్లో బహుమతి పొందిన రచనల సంకలనమిది. వస్తు-కథన పరంగా వైవిధ్యం వీటి సామాన్య లక్షణం. చట్టబద్ధంగా ఖైదీలను ఉరితీసే తలారులు ఎదుర్కొనే మానసిక సంక్షోభానికి అద్దం పట్టిన రచన ‘ఈ శిక్షణ మాకొద్దు’.

Published : 03 Mar 2024 00:21 IST

తెలుగు సొసైటీ ఆఫ్‌ అమెరికా (తెల్సా) కథల పోటీల్లో బహుమతి పొందిన రచనల సంకలనమిది. వస్తు-కథన పరంగా వైవిధ్యం వీటి సామాన్య లక్షణం. చట్టబద్ధంగా ఖైదీలను ఉరితీసే తలారులు ఎదుర్కొనే మానసిక సంక్షోభానికి అద్దం పట్టిన రచన ‘ఈ శిక్షణ మాకొద్దు’. పైకి ఉదారత కన్పించినా సందర్భం వచ్చినప్పుడు కృతఘ్నత చూపే ‘పులివన్నె మేక’ స్వభావం మరో కథలో జలదరింపజేస్తుంది. మన నమ్మకంలోని అపనమ్మకం గుట్టును వెలికితీసే ఆసక్తికరమైన కథ ‘విశ్వాసం’. మోసం చేసిన వ్యక్తికి ప్రేమతో వేసేదే అసలైన ‘శిక్ష’ అని మరో కథ హృద్యంగా చాటుతుంది. రచయితల క్లుప్త పరిచయాలూ కథల బొమ్మలూ బాగున్నాయి. ఆడపిల్లల అలంకరణను ఇష్టపడే అబ్బాయి ట్రాన్స్‌జెండర్‌గా మారే క్రమంలో హేళనలూ అవమానాలూ తప్పవనీ, అర్థంచేసుకునే మనుషుల తోడ్పాటు చాలా అవసరమనీ ‘అంగన’ రుజువు చేస్తుంది.

సంగతి-2 

పేజీలు: 215; వెల: రూ.225/-
ప్రతులకు: ప్రధాన
పుస్తకకేంద్రాలు  

 సీహెచ్‌.వేణు


స్ఫూర్తికథలు

టాటా సంస్థల ఘనమైన వారసత్వాన్ని వివరించే కథలివి. సంస్థ పుట్టుకనుంచి మొదలెట్టి 150ఏళ్లలో పది విభిన్న రంగాల్లో 30 స్వతంత్ర కంపెనీలుగా ఎదిగిన ఈ సంస్థలన్నిటినీ ఒక్కతాటిపై నడిపిస్తున్న సిద్ధాంతం ఏమిటో, వారు నమ్మే నాణ్యతా ప్రమాణాలకూ విలువలకూ పునాదులు ఎక్కడున్నాయో విశదంగా చెబుతాయి. మొట్టమొదటి టాటా సంస్థను జంషెడ్జీ టాటా 1868లో నెలకొల్పారు. ఆ తర్వాత ఎంప్రెస్‌ మిల్స్‌ స్థాపించి కార్మికులకు గ్రాట్యుటీ, పింఛను లాంటి సౌకర్యాలు కల్పించిన తొలి సంస్థగా తీర్చిదిద్దారు. ‘ప్రజల నుంచి వచ్చిన సొమ్ము మరింత పెరిగి ప్రజలకే చేరే విధానాన్ని’ ఆచరించి చూపుతున్న టాటా సంస్థల వెనక ఉన్న అద్భుతమైన స్ఫూర్తికథలెన్నో ఇందులో ఉన్నాయి.  

టాటా కథలు; రచన: హరీష్‌ భట్‌
అనువాదం: ముంజులూరి కృష్ణకుమారి
పేజీలు: 172; వెల: రూ.250/-
ప్రతులకు: అశోక్‌ బుక్‌ సెంటర్‌  

 శ్రీ


ఈ తరం కథ

ఊహించని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటపడతాడు సుబ్బు. పిల్లల్లేని మరో దంపతులకు అండగా ఉంటూ చిన్నా చితకా కుటుంబాలతో కలిసి నివసిస్తుంటాడు. ఇష్టంలేని పెళ్లి తప్పించుకుని ప్రేమించిన వాడిని చేరుకోవడానికి ఇల్లు వదిలిన మహాలక్ష్మి మోసపోయానని తెలుసుకుని ఎటూ పాలుపోని పరిస్థితుల్లో రౌడీల బారిన పడుతుంది. ఆమెను రక్షించి ఇంటికి తీసుకెళ్తాడు సుబ్బు. వాళ్లిద్దరూ కలిసి చుట్టుపక్కల వారికి అండగా ఉంటూ వాళ్ల జీవితాల్లో మంచి మార్పులు తెస్తారు. మరి తమ కుటుంబాలను మార్చుకోగలిగారా, ఇద్దరిమధ్యా పెరిగిన ప్రేమ పెళ్లి దాకా చేరిందా అన్నది కథ. కథనం ఆసక్తిగా చదివిస్తుంది.  

మన కథ నిజం కాదా? (నవల)
రచన: మన్నెం శారద
పేజీలు: 228; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 8558899478  

 సుశీల


అసాధారణ ప్రయాణం

నకూ తన సంతానానికీ చట్టబద్ధమైన గుర్తింపు దక్కాలని ఆరాటపడిన పుష్పవల్లి కూతురికి భానురేఖాగణేశన్‌ అని పేరుపెట్టింది. తల్లికోసం చదువు మానేసి మేకప్‌ వేసుకున్న ఆ అమ్మాయికి తల్లి నటనావారసత్వం కానీ తండ్రి ఇంటిపేరు కానీ పనిచేయలేదు.
పద్నాలుగేళ్లకే బొంబాయిలో అడుగుపెట్టి తన నిస్సహాయతనీ అమాయకత్వాన్నీ అందరూ ఉపయోగించుకుంటుంటే మౌనంగా భరిస్తూ ‘రేఖ’గా ఎదిగిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. మొదట్లో ఒకింత చాయ తక్కువగా, బొద్దుగా ఉన్న ఆమె వివక్షను ప్రశ్నిస్తూ కఠోర శ్రమతో తన నటజీవితాన్నీ వ్యక్తిత్వాన్నీ మలచుకున్న వైనం అబ్బురపరుస్తుంది.

స్వయంసిద్ధ (ఒక అభినేత్రి జీవనరేఖ)
రచన: శ్రీదేవీ మురళీధర్‌
పేజీలు: 251; వెల: రూ.350/-
ప్రతులకు: ఫోన్‌- 9908132166  

 పద్మ



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..