Sunday Story: ముఖ చిత్రం

భోజనం అయి, ఈజీ చెయిర్‌లో రిలాక్స్‌ అవుతున్న హేమచంద్ర ఫోన్‌ రింగుకి లేచాడు. ఆ ఫోన్‌ మాట్లాడినప్పటి నుంచీ సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు.

Updated : 26 Nov 2023 08:04 IST

- ఎం.బిందుమాధవి

భోజనం అయి, ఈజీ చెయిర్‌లో రిలాక్స్‌ అవుతున్న హేమచంద్ర ఫోన్‌ రింగుకి లేచాడు. ఆ ఫోన్‌ మాట్లాడినప్పటి నుంచీ సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు.

అన్యమనస్కంగా తనలో తనే ‘ఎందుకిలా జరిగింది? వాడి ఇష్టాన్ని తామిద్దరూ కాదనలేదే?’ అనుకుంటూ కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్న భర్తని చూసిన కల్యాణి... ‘‘ఏమయిందండీ, ఎందుకలా ఉన్నారు? ఫోన్‌ ఎవరి దగ్గర నుంచి, వాళ్ళేం మాట్లాడారేమిటీ... అంతగా ఆందోళనపడుతున్నారు’’ అని అడిగింది.

‘‘సాగర్‌ విడాకులకి అప్లై చేస్తాడట... ఇందాక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చిన ఫోన్‌ సారాంశం అదే’’ అన్నాడు.

‘‘ఆయనకెలా తెలిసింది?’’ అంది ముఖం అసహనంగా పెట్టి.

‘‘సుబ్రహ్మణ్యం కొడుకూ మనవాడూ ఫ్రెండ్స్‌ కదా... వాడితో చెప్పాడట. అయినా వీడికేం తీపరం... కావాలని కోరిచేసుకున్నాడు కదా! జీవితం అంటే నాలుగు రోజులు వేసుకుని... నచ్చలేదని అవతల పారేసే షర్టూ కాదూ, అంత తేలికగాతీసుకునే విషయమూ కాదు.

వాడు ఆ అమ్మాయిని మనకి చూపించి, ‘ఈ అమ్మాయిని తప్ప ఇంకొకరిని చేసుకోను’ అని కరాఖండీగా చెప్పినప్పుడు... ‘ఒకటికి రెండుసార్లు ఆలోచించు. ఒకసారి చేసుకున్నాక కష్టమైనా సుఖమైనా చివరిదాకా వాళ్ళతో సర్దుకు బతకటం నేర్చుకోవాలి’ అనిమనిద్దరం చెప్పాం.

‘ఆ అమ్మాయి... నా కొలీగ్‌. నాలుగేళ్ళ నుంచీ చూస్తున్నాను. అన్ని విషయాల్లో నాకు తగిన వ్యక్తి. తన వేషభాషలూమాట తీరూ అన్నీ నాకు నచ్చాయి. అన్నిటికంటే ఎక్కువగా ఒకే లైన్‌ ఆఫ్‌ వర్క్‌లో ఉన్నాం. జీతాలు ఇంచుమించు ఒకటే. ఇద్దరం ఎన్నో విషయాలు షేర్‌ చేసుకోవచ్చు’ అని బోడి కబుర్లు చెప్పాడు.

ఇప్పుడవన్నీ ఏమయ్యాయో? అయినాతల్లిదండ్రులం... ఇంత ముఖ్యమైన విషయం మనకి చెప్పకుండా ఎవరికో చెబితే, వాళ్ళొచ్చి మనకి చెప్పటమేమిటి’’ అన్నాడు ముఖాన గంటు పెట్టుకుని హేమచంద్ర.

హేమచంద్రకి గత సంవత్సరం కళ్ళముందు రీల్‌ లాగా తిరిగింది...

*  *  

ఒక సెలవురోజు మధ్యాహ్నం ‘‘అమ్మా, నాన్నగారూ... మీరిద్దరూ ఇలా కూర్చోండి. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మ ఎప్పటినుంచో నా పెళ్ళి గురించి కంగారు పడుతోంది. మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి... నా కొలీగ్‌... ‘దివ్య’ నాకు బాగా నచ్చింది. తనైతే అన్నీ నాలాగేఆలోచిస్తుంది. అమ్మా, నువ్వు తన డ్రెస్సింగ్‌ చూస్తే... ‘అమ్మాయి అంటే ఇలా ఉండాలి’ అంటావు. అన్ని కోణాల్లోనూ తను నాకు బాగా మ్యాచ్‌ అయ్యే అమ్మాయి’’ అని ఒక్కసారి ఆగి తల్లిదండ్రులమొహాల్లోకి... వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశాడు సాగర్‌.

‘‘పెళ్ళి అనేది... అట్టమీది బొమ్మ చూసి చదవటానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదు. పైపై విషయాలు చూసి నిర్ణయించుకునేది కాదు. నువ్వు నాలుగేళ్ళు కలిసి పనిచేసినా ఐదేళ్ళు పక్కపక్క ఇళ్ళల్లో ఉన్నా... వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు అనుకోవటం భ్రమ. మన ఇంటికొచ్చి, మనతో కలిసి బతకటం మొదలుపెడితేగానీ వాళ్ళ అసలు స్వరూపం, స్వభావం మనకి తెలియవు. పైగా ఒకచోట కలిసి పని చేసేటప్పుడు, ఎవరూ తమ సహజ లక్షణాలని బయటికి ప్రదర్శించరు. తమ బలహీనతలు ఇతరులకితెలియకుండా జాగ్రత్త పడతారు. నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించు’’ అన్నారు హేమచంద్ర, కల్యాణి ముక్త కంఠంతో.

పిల్లలు సుఖంగా ఉండటం ముఖ్యం అని నమ్మే తల్లిదండ్రులవటం వల్ల... కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తరువాత-సాగర్‌ ఇష్టప్రకారమే సాగర్‌-దివ్యలకిదగ్గరుండి పెళ్ళి జరిపించారు.సాగర్‌ ఉద్యోగం బెంగళూరులో.

దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవటంతో కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి... కొత్తకాపురంలోకి అడుగుపెట్టారు.

ఇరుపక్కల తల్లిదండ్రులూ వచ్చిచెరొక వారం రోజులు ఉండి, పిల్లలకిఅవసరమైన ఏకాంతం ఇస్తూ తమతమ ఇళ్ళకి వెళ్ళిపోయారు.

*  *  

ఆరు నెలల కాలం... కొత్త కుండలోనీటిలాగా తియ్యతియ్యగా పిల్లల కాపురం సాగుతున్నదని ఇరుపక్కల తల్లిదండ్రులూ సంతోషంగా ఉన్నారు. ఇంకొక ఆరు నెలలు వాళ్ళ ప్రాజెక్ట్‌ వర్కులతో బిజీగా గడిచింది. సాగర్‌ దగ్గర నుంచి శుభవార్త వస్తుంది అని ఎదురు చూస్తున్నారు.ఇంతలో పిడుగులాంటి ఈ విడాకుల వార్త విని కల్యాణి దంపతులు తల్లడిల్లిపోయారు.దివ్య తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసో లేదో... అసలు వాళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థంకాక తలలు పట్టుక్కూర్చున్నారు.

ఇంతలో సాగరే ఫోన్‌ చేశాడు.‘‘అమ్మా, రేపు నేను హైదరాబాద్‌ వస్తున్నాను. నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి’’ అన్నాడు.

‘‘దివ్య కూడా వస్తోందా?’’ అనడిగింది కల్యాణి మనసులోని సందేహం తీర్చుకోవటానికి.‘‘లేదమ్మా, నేనొక్కడినే వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలూ మాట్లాడతాను’’ అని ఫోన్‌ పెట్టేశాడు.

*  *  

కల్యాణి దంపతులకి ఆ రాత్రి అన్నం సహించలేదు. కంటినిండా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనే ఎదురు చూపులతో గడిపారు.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తినాలనిపించక, కాఫీ మాత్రం తాగి కొడుకు రాకకోసం ఎదురు చూస్తున్నారు.

మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చినకొడుకుతో...

‘‘ఏమయ్యిందిరా, ఎందుకింత హఠాత్తుగా వచ్చావు? ముఖ్యమైన విషయం అన్నావు... ఫోన్‌లో చెప్పొచ్చు కదా. వర్కింగ్‌ డే రోజు పరుగెత్తుకొచ్చేటంత అర్జెంటు విషయాలేముంటాయి? మీ ఇద్దరి ఆరోగ్యాలూ బాగానే ఉన్నాయా? అసలు తిళ్ళు తింటున్నారా? ఆఫీసు వర్క్‌, టార్గెట్స్‌, ప్రాడక్ట్‌ లాంచింగ్‌ అంటూ ల్యాప్‌టాప్‌లకి అతుక్కుపోతున్నారా? ఉద్యోగాల్లో సమస్యలేం లేవు కదా’’ అన్నారు ఇద్దరూ ఏమీ తెలియనట్టు.

‘‘అమ్మా ముందు అన్నం పెట్టు. నీ చేతివంట తిని ఎన్నాళ్ళయిందో. భోజనమయ్యాక మాట్లాడతాను. రుచికరమైన భోజనానికి మొహం వాచినట్టుంది’’ అన్నాడు సాగర్‌, అక్కడున్న న్యూస్‌పేపర్‌ చేతిలోకి తీసుకుంటూ.

బ్రేక్‌ఫాస్ట్‌ తినే మూడ్‌ లేక ఏమీతినకుండా... ఉదయం నుంచీ కొడుకుకోసం ఎదురుచూస్తున్న కల్యాణికిఒక్కసారిగా ఆకలి గుర్తొచ్చింది.

గబగబా వెళ్ళి కొడుక్కిష్టమైన వంట చేసి... భోజనానికి పిలిచింది.

కొడుకేం చెబుతాడో అనే ఆదుర్దాతో వాళ్ళూ... సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగర్‌... డైనింగ్‌టేబుల్‌ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినేపనిలో పడ్డారు.

*  *  

హాల్లోకొచ్చిన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి... ‘‘అమ్మా-నాన్నా, ప్రశాంతంగా వినండి. నేనూ దివ్యా విడిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అన్నాడు దీర్ఘ నిశ్వాసం తీసుకుంటూ.

‘‘అంత పరిస్థితి ఏమొచ్చింది. ఇద్దరూఇష్టపడే అన్నీ ఆలోచించే పెళ్ళిచేసుకున్నారు కదా!’’

‘‘తనకి అసలు ఏ పనీ రాదమ్మా.వంట కూడా రాదు. చెయ్యాలన్న ఆసక్తీ లేదు. రోజూ స్విగ్గీలో ఏదో ఒకటితెప్పించుకు తింటుంది. ఎప్పుడు చూసినా ఫోన్‌ మాట్లాడుతూ ఉంటుంది. మధ్యలో పిలిస్తే నన్నొక విలన్‌లాగా చూస్తుంది.తన వర్క్‌ టార్గెట్స్‌, తన ఫ్రెండ్స్‌ తప్ప నేనంటూ ఒక వ్యక్తిని తన జీవితంలో ఉన్నట్టే అనుకోదు.

నాతో ఏకాంతం... బెడ్‌ షేరింగ్‌ ఎప్పుడో తప్ప ఇష్టపడదు. తనని దగ్గరకి తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహంపెడుతుంది.

పోనీ తనని ఆ మూడ్‌లోకి తీసుకెళదామని... వీకెండ్స్‌లో సరదాగా ఏ పార్కుకో వెళదామంటే ‘నువ్వడగ్గానే నీ వెంటపడి వచ్చెయ్యాలా? నాకు ఇవాళ మూడ్‌ లేదు’ అంటుంది. నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ‘బోర్‌ కొడుతోంది... అలా ఔటింగ్‌కి వెళ్ళొద్దాం’ అని గొడవ చేస్తుంది.

తను కూడా ఉద్యోగం చేస్తోంది... అందులో ఉండే కష్టసుఖాలు తనకీ తెలుసు. అయినా తన మాట సాగాలనే పంతం’’ అని ఆగాడు, ఇవి మచ్చుకి కొన్ని అన్నట్టు.

‘‘ఫ్రెండ్స్‌తో చాటింగులో నా గురించి ఏం చెబుతుందో ఏమో... నన్నుకలిసినప్పుడు... వాళ్ళల్లో వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు.’’

*  *  

కొడుకు చెప్పింది విని తల పంకించింది కల్యాణి.

‘‘మేము నీకు ముందే చెప్పాం...పెళ్ళి అంటే పైపై మెరుగులు చూసినిర్ణయాలు తీసుకోకూడదూ అనేకవిషయాలు ఆలోచించాలీ అని.

నీకు గుర్తుందా... చిన్నప్పుడు మనం ఇంట్లో తెప్పించే వారపత్రిక కవరు మీద బొమ్మ చూసి నువ్వొక రకంగా, బామ్మ ఇంకొక రకంగా మొహాలు పెట్టేవాళ్ళు. దేవుడి బొమ్మ వేస్తే ఆవిడ సంతోషపడేది. సినిమా హీరో-హీరోయిన్ల బొమ్మ వేస్తే నీకు నచ్చేది. అందులో డాక్టర్‌ సలహాల దగ్గర నుంచీ వంటలూ కథలూ సినిమా కబుర్లూరాజకీయాలూ గ్రహబలమూ పజిల్సూ... ఇలా మీకిద్దరికీ ఇష్టమైన అంశాలూ నచ్చని శీర్షికలూ కూడా ఉండేవి. పుస్తకం తెరిచిచదివితేనే కదా అన్నీ తెలుస్తాయి అనేదాన్ని.

వైవాహిక జీవితం... ఆ మాటకొస్తేఎవరితోనైనా కొత్తగా ఏర్పడే పరిచయంఒక పుస్తకం లాంటిదే.

పుస్తకం అట్టనుబట్టి ఎలా ఒక నిర్ణయానికి రాకూడదో... పైపై విషయాలు చూసిజీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు’’ అంది కల్యాణి కొడుకు మొహంలో ఫీలింగ్స్‌ కోసం చూస్తూ.సాగర్‌ రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల వంచుకుని మౌనంగా కూర్చున్నాడు. తరవాత తల ఎత్తి తల్లి వైపు చూస్తూ...‘‘అమ్మా, నీకూ నాన్నగారికీ ఎప్పుడూగొడవలు జరగలేదా? ఎలా మేనేజ్‌చేసేవాళ్ళు? మీరిద్దరూ గొడవపడటం నేను చూడలేదు’’ అన్నాడు.

‘‘నేను కాలేజీలో చదివేటప్పుడు... మన సీతా ఆంటీ వాళ్ళ ‘వివాహ స్వర్ణోత్సవం’ అని వాళ్ళు గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చారు.నాకు బాగా గుర్తుంది. అసలు పూర్వం అన్నన్ని ఏళ్ళు ఎలా కలిసి ఉండేవారు’’ అన్నాడు మళ్ళీ.

కల్యాణి గొంతు సవరించుకుని ‘‘చూడు పండూ, ఈ తరం పిల్లలు... పెళ్ళి అంటే సర్దుబాటు అనుకోవట్లేదు. అసలు ఆ మాటకొస్తే జీవితమంతా ఎవరో ఒకరితోసర్దుకునే బతకాలి. ఎందుకంటే, ఏ ఇద్దరి ఆలోచనలూ అభిరుచులూ సమర్థతలూఒకే విధంగా ఉండవు.

నా పెళ్ళికి నాకు పంతొమ్మిదేళ్ళు. డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం చెయ్యట్లేదు.ఆ కాలం ప్రమాణాలనిబట్టి అమ్మమ్మా వాళ్ళు నాకు పెళ్ళి చేశారు.

పెళ్ళికి కుటుంబ నేపథ్యం చూసేవారు. వాళ్ళింట్లో ఏమైనా దీర్ఘకాల రోగాలు ఉన్నాయా అని తెలుసుకునేవారు. ఇంట్లో పిల్లలు పుట్టనివాళ్ళు ఉన్నారేమో అని వాకబు చేసేవారు... పిల్లలు పుట్టకపోతే తమ వంశం కొనసాగదని భయపడేవాళ్ళు.

పెళ్ళి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం. ఎలాంటి మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలున్నా ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. డబ్బు సంపాదన, ఉద్యోగపు హోదాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు.

నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మనపై ఫ్లాట్‌లో ఉండే డాక్టర్‌ అంకుల్‌గుర్తున్నారా? నీకు తెలుసో తెలియదో...ఆ ఆంటీ పెద్దగా చదువుకోలేదు. అయినా అంకుల్‌ ఏ అభ్యంతరం లేకుండా ఆ ఆంటీని చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళెంత ఆనందంగా కలిసి ఉంటున్నారో! ఈరోజు రాత్రి వాళ్ళ అమ్మాయి పెళ్ళి. వాళ్ళిద్దరి మధ్యలో చదువులేకపోవటం అనేది ఒక సమస్యే కాలేదు.

ఆ రోజుల్లో ఎక్కువగా- తెలిసినవాళ్ళు... బంధువులో, మిత్రులో... సంబంధాలు చెబితే... పెద్దలు కుదిర్చే వివాహాలే ఉండేవి. వధూవరులకి పూర్వ పరిచయం ఉండేది కాదు. పెళ్ళయ్యాకే ఒకరి కుటుంబం గురించి ఇంకొకరూ... వ్యక్తిగతంగా ఒకరి గురించి మరొకరూ తెలుసుకునేవారు. ఆ క్రమంలో కొంతకాలం గడిచిపోయేది. కొత్తగా పరిచయం అయిన భాగస్వామిని మెప్పించటానికి (వాళ్ళ ఇంప్రెషన్‌ కొట్టెయ్యటానికన్నమాట) ఇద్దరూ తాపత్రయ పడేవాళ్ళు.

వారిద్దరినీ పెద్దలు గమనిస్తూ ఉండేవారు. ఎక్కడైనా కొంచెం పొరపొచ్చాలు వచ్చే సూచనలు కనిపిస్తే సర్ది చెప్పి రాజీ కుదిర్చేవారు.

పెళ్ళయ్యేటప్పటికి నాకూ వంట రాదు. మేము వేరు కాపురం పెట్టినప్పుడు...తరచుగా కూర మాడ్చెయ్యటం, పాలు పొంగ పెట్టెయ్యటం చేసేదాన్ని.

నాన్నగారు... ‘పోనీలే బంగారం... ఇదొక వెరైటీ అనుకో. ఇప్పుడేం లోపం జరిగిందో గుర్తుపెట్టుకుంటే... రేపు అలా చెయ్యకుండా ఉంటే సరి. కొన్నాళ్ళకి నీకే సరిగా చెయ్యటం తెలుస్తుంది. ‘అభ్యాసం కూసు విద్య’అన్నారు పెద్దలు. కొన్నాళ్ళయ్యాక ఇవన్నీ తలచుకుంటే భలే సరదాగా ఉండి మనమే నవ్వుకుంటాం’ అనేవారు. ఎప్పుడూవిసుక్కోలేదు. మా అమ్మకి కానీ వాళ్ళ అమ్మకి కానీ చెప్పి... ఎప్పుడూ నన్ను హేళన చెయ్యలేదు.

పెళ్ళైన కొన్నాళ్ళ తరువాత నేనుఉద్యోగంలో చేరాను. అప్పటికి నాకు ఇల్లు ఎలా నిర్వహించుకోవాలో తెలిసింది. ఈలోపు- ఇంట్లోకి అన్నీ... నాకు పువ్వులూ చీరలతో సహా నాన్నగారే సమకూర్చేవారు.

ఈతరం ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్య్రం కావాలని... ఉద్యోగాల్లో చేరాకనే పెళ్ళి చేసుకుంటున్నారు. డ్రైవింగ్‌ నేర్చుకుని, స్కూటరో కారో కొనుక్కుంటున్నారు. ఏ విషయానికీ ఎవరిమీదా ఆధారపడక్కరలేదు.

పెళ్ళినాటికే ఇరువురికీ జీవితంలో ప్రతి విషయం మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఒక రకంగా ఆ అభిప్రాయాలు నిర్దుష్టంగా, నిక్కచ్చిగాఉంటున్నాయి. అవసరమైనప్పుడు తమఅభిప్రాయాలు మార్చుకోవటానికి కానీసర్దుకుపోవటానికి కానీ ఇద్దరిలో ఎవ్వరూ ఇష్టపడట్లేదు. కుటుంబ పద్ధతులూ, వ్యక్తిగత అలవాట్లూ, మనస్తత్వాలూ... ఏవీ చూసుకోకుండా రూపం చూసి నచ్చిందని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎవ్వరూ దేనికీ రాజీపడట్లేదు. ఒక రకంగా అది కూడా సమస్యలకి దారి తీస్తున్నదేమో అనిపిస్తోంది.

జీవితం ఎక్కువ కాలం హాయిగాసాగాలంటే... ముందు భార్యాభర్తలిద్దరి మధ్యా స్నేహం అనేది ముఖ్యం. ఇప్పుడు మీకు మీరు కుదుర్చుకుని, చేసుకుంటున్న పెళ్ళిళ్ళల్లో... ఇద్దరిమధ్యా కాస్తయినా కొత్తదనం అంటూ ఉండట్లేదు. మెల్లగా స్నేహం ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనే విషయానికి ఆస్కారం ఉండట్లేదు. వివాహబంధంలోకి ప్రవేశించేటప్పటికే... ఒకరినొకరు ‘ఒరేయ్‌, ఒసేయ్‌’ అని పిలుచుకునే చనువు ఉంటోంది. మితిమీరిన ఆ చనువు మీలో అనుబంధానికి బదులు లెక్కలేనితనాన్ని పెంచుతోంది. ఎవరూ ఎవరి మీదా డబ్బు కోసం ఆధారపడక్కరలేదు. దానివల్ల ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ధోరణి పెరుగుతోంది. అక్కడి నుంచీ మాటా మాటా అనుకోవటం... కనీస మర్యాదను కూడా వదిలేసి నోటికెంతవస్తే అంత తిట్టుకోవటం జరుగుతోంది.

మా రోజుల్లో ‘పెద్దవాళ్ళముందు కొన్ని మాటలు వాడకూడదు’ అనే సభ్యత పాటించేవాళ్ళం. అందుకే ఎంత కోపం వచ్చినా హద్దు దాటేవాళ్ళం కాదు. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పుతోంది అని పెద్దలు గమనిస్తే, ‘అమ్మాయిని అలా సినిమాకి తీసుకెళ్ళమనో, ఇద్దరూ కలిసి గుడికెళ్ళి రమ్మనో’ పంపించేవాళ్ళు. భర్తని ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయికి చెప్పేవాళ్ళు. అమ్మాయినిఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అబ్బాయికి చెప్పేవాళ్ళు.

ఒకసారి ఒకరిది పైచేయి అయితే, ఇంకోసారి ఇంకొకరిది అయ్యేది. అది లొంగుబాటు తనమనో బానిసత్వమనో అనుకోకూడదు. పట్టూ విడుపూ తెలియటమే ముఖ్యం.

మనిషి ఆవేశంగా ఉన్నప్పుడు మాటలూ చేతలూ తప్పుదారిలో వెళతాయి. అందుకే, కోపం తగ్గేవరకూ కాస్త సంయమనంతో మౌనంగా ఉండి- ఆ తర్వాత మాట్లాడుకుంటే అనర్థాలు జరగవు. అప్పటికీ అవసరమనిపిస్తే పెద్దవాళ్ళ సహాయం కోరవచ్చు.

అలా బతికాం కనుకనే మా వైవాహిక జీవితం మరొకరిచేత వేలెత్తి చూపించుకోకుండా ఇన్నేళ్ళు నడిచింది.

ఇప్పుడు మీ జీవితాలు చాలా సెల్ఫ్‌ సెంటర్డ్‌గా ఉంటున్నాయి. పెద్దలు అనే కాదు... మూడోవ్యక్తి ప్రమేయం, జోక్యం మీరు ఇష్టపడట్లేదు.

దివ్యకి ఏ పనీ రాదన్నావు, నీకు వచ్చా? ఆ అమ్మాయికి వంట చాతకాకపోవచ్చుకానీ... ఇల్లు నీట్‌గా అందంగా సర్దేనేర్పు ఉండొచ్చు. ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడుతుండొచ్చు కానీ... ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ బాగా తెలిసి ఉండొచ్చు. తన బలం తెలిసినచోట నువ్వు పొగడటం నేర్చుకోవాలి. బలహీనతను అర్థం చేసుకుని సర్దుకుపోగలగాలి. అలా ఆ అమ్మాయి మనసుగెలుచుకోవాలి. నీ విషయంలో ఆ అమ్మాయీ అలాగే ఉండాలి. ఇద్దరిలో ఎవరి వల్లతప్పు జరిగినా- వేలెత్తి చూపించడం కాక వేలందించి ముందుకు సాగటం అలవాటు చేసుకోవాలి. మానవ సంబంధాలు అనేవి ఎంతో సున్నితమైన బంధాలు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విజ్ఞతానేర్పూ ఉన్నవాళ్ళ జీవితాలు చిరకాలం బాగుంటాయి.

ఇప్పుడు ఆవేశంలో విడిపోవాలనుకుంటున్నారు సరే... ఇలాగే ఒంటరిగాఎప్పటికీ బతకలేవు కదా. రేపు ఇంకోఅమ్మాయిని చేసుకుంటే... ఆ అమ్మాయిలో మాత్రం నీకు నచ్చని విషయాలు ఉండవనే గ్యారంటీ ఏముంది? అందుకే- తొందరపడకు. ఇంకాస్త టైమ్‌ తీసుకుని, మరోసారి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.

ఇంతకీ నువ్విక్కడికొస్తున్నట్టు దివ్యకి చెప్పావా? అసలు ఉద్యోగపు ఒత్తిడులుతప్ప... మీ తరం పిల్లలు... పెళ్ళి అయ్యాక... మనసు విప్పి స్నేహంగాఎప్పుడైనా మాట్లాడుకుంటారా? తనుచిరాకుగా ఉన్నప్పుడు నువ్వే ఒకడుగు ముందుకేసి ‘చాలా అలిసిపోయావు...కాసేపు రిలాక్స్‌ అవ్వు. నీ కోసం ఇవాళఈ వంట చేశాను’ అని చెప్పి చూడు. ఎంత మార్పు వస్తుందో! పొగడ్తకీ ప్రేమకీపడనివాళ్ళెవరుంటారురా’’ అంటూ కల్యాణిదంపతులు కొడుక్కి నచ్చచెప్పి, ‘‘ఇంకొన్ని రోజులు వేచి చూడు. అప్పటికీ కలిసి ఉండలేమనిపిస్తే అప్పుడే ఆలోచించవచ్చు’’ అని తాత్కాలిక పరిష్కారం చెబుతూ కొడుక్కి కౌన్సిలింగ్‌ చేశారు.

‘ఇలా ఎవరో ఒకరు చెప్పకనే... ఈ కాలం పిల్లలు ఈగోలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చదువులు ఎక్కువై...సర్దుబాటు తక్కువ అవుతోంది. మనం అమ్మాయి తరఫు అయినా... అబ్బాయి తరఫు అయినా... పెళ్ళంటూ జరిగాక వాళ్ళిద్దరూ మన పిల్లలే. వాళ్ళ జీవితాలు బాగుండటం మనకి ముఖ్యం.

జీవితం గురించి అనుభవంతో ఆలోచించగలిగిన మనం ఒకడుగు ముందుకేసి... వీలైతే జరగబోయే అనర్థాన్ని ఆపుదాం. పని జరిగినా జరక్కపోయినా... ప్రయత్నం అయితే చేసి చూద్దాం. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం’ అనుకున్నారు ఆ దంపతులు... కాస్త ఆందోళనతో, మరికాస్త ఆశాభావంతో.

 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..