ఆ కృతజ్ఞతతో...ఉచితంగా ‘కిడ్నీ’ ఆపరేషన్‌!

ఆకాశవాణిలో ఆ ప్రకటన విని ఆశ్చర్యపోయారందరూ. ‘మీరు పేదవారా... కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందా? మేం ఉచితంగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తాం’ అన్నది దాని సారాంశం!

Updated : 12 May 2024 09:19 IST

ఆకాశవాణిలో ఆ ప్రకటన విని ఆశ్చర్యపోయారందరూ. ‘మీరు పేదవారా... కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందా? మేం ఉచితంగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తాం’ అన్నది దాని సారాంశం! ‘మద్రాసు కిడ్నీ ఫౌండేషన్‌’ అనే సంస్థ దాన్ని విడుదలచేసింది. ‘బోగస్‌ కావొచ్చు. వెళ్ళాక డబ్బులు గుంజుతారేమో!’ అంటూ సామాజిక మాధ్యమాల్లో అనుమానాలు వ్యక్తంచేశారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఉచిత కిడ్నీమార్పిడి చికిత్సలకి నాంది పలికాడు ఆ యువవైద్యుడు. అడిగితే ‘ఇది నా చిన్ననాటి కల అండీ!’అంటాడు! ఆ కల వెనక కథేమిటో చూద్దామా...

యువ వైద్యుడి పేరు డాక్టర్‌ ఆంటన్‌ యురేశ్‌కుమార్‌. యురాలజీ సర్జరీలో అతిపిన్న వయసులోనే చక్కటి గుర్తింపు సాధించినవాడు. చెన్నై గిండీలోని ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రొఫెసర్‌. 2015 నుంచీ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆయన కిడ్నీ సమస్యల బారినపడ్డ నిరుపేదల పాట్లని ప్రత్యక్షంగా చూశాడు. పాతికేళ్ళకే కిడ్నీ సమస్య కబళిస్తే... అందరూ దూరమై అనాథగా మిగిలినవాళ్ళూ, చికిత్సకి డబ్బుల్లేక సమస్తమూ అమ్ముకున్నవాళ్ళూ... ఇలా ఎన్నో జీవిత వ్యథలకి సాక్షిగా నిలిచాడు. మనదేశంలో కిడ్నీ మార్పిడి అవసరం ఉన్నవాళ్ళ సంఖ్య ఏటా రెండు లక్షల వంతున పెరుగుతోందట. కానీ అన్ని ఆసుపత్రులూ కలిసి ఆరువేల కంటే ఎక్కువ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు చేయడంలేదట. చికిత్సకి డబ్బే ప్రధాన అవరోధంగా మారుతోంది. ప్రభుత్వం నెలకి నాలుగువేలకన్నా తక్కువ జీతం ఉన్నవాళ్ళనే- పేదలుగా లెక్కించి వాళ్ళకి ఉచితంగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయిస్తోంది. మధ్యతరగతి రోగులైతే ఈ చికిత్సకి కనీసం ఏడులక్షలైనా ఖర్చుచేయాల్సిన పరిస్థితి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లోనైతే ఇరవై లక్షల దాకా అవుతుంది. ఎలాగోలా ఆ డబ్బు పోగేసినా సరే- మార్పిడి ఆపరేషన్‌కి తమ వంతు వచ్చేదాకా  ఆరునెలలైనా వేచి ఉండాలి! ఈలోపు డయాలసిస్‌, దానికయ్యే మందుల ఖర్చులూ తడిసిమోపెడవుతాయి. ఇవన్నీ తాళలేక తమకుతాము జీవితాన్ని కడతేర్చుకున్న రోగుల్నీ చూశాడట ఆంటన్‌. అలాంటివాళ్ళ కోసమే ‘మద్రాసు కిడ్నీ ఫౌండేషన్‌’ని పెట్టాడు. మొదట్లో రాయితీలతోనే ఆపరేషన్‌లు నిర్వహించినా ఆ తర్వాత ఉచితంగా చేస్తానంటూ ప్రకటనలు విడుదలచేశాడు. తనని ఆశ్రయించిన 12 మంది పేదవాళ్ళని ఎంపిక చేశాడు. వారిలో తక్షణ శస్త్రచికిత్సకి నలుగుర్ని ఎంపిక చేసుకుని.. 17 ఏళ్ల కుర్రాడికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్‌ నిర్వహించాడు. శస్త్రచికిత్స ఉచితంగా చేయడమే కాదు మందుల ఖర్చూ, ఆపరేషన్‌ థియేటర్‌కైన అద్దె కలిసి మూడు లక్షల రూపాయలైతే ఆ డబ్బుకూడా తనే ఇచ్చాడు!

ఆనందమే అందం

ఎందుకా కల...

డాక్టర్‌ ఆంటన్‌ యురేశ్‌ స్వస్థలం తమిళనాడులోని విళుప్పురం పట్టణం. మధ్యతరగతి కుటుంబం. పన్నెండో తరగతి దాకా ప్రభుత్వ బడిలోనే చదువుకున్నాడు. 1998లో జిల్లా స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. ఎంట్రన్స్‌ రాసి ఎంబీబీఎస్‌లో సీటు సాధించాడు. అప్పట్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకి వాళ్ళ ఉన్నత విద్యకి కావాల్సిన సమస్త ఖర్చుల్నీ తమిళనాడు ప్రభుత్వమే భరించేది. అలా ఆంటన్‌ ఎంబీబీఎస్‌ కోర్సుకయ్యే ట్యూషన్‌ ఫీజు, పుస్తకాలు, మెస్‌ ఖర్చుల్ని సర్కారే ఇచ్చింది. ఐదేళ్ళకి లెక్కగడితే అప్పట్లోనే ఒకట్నిర లక్షరూపాయలిచ్చిందట ప్రభుత్వం. ‘ఓ రకంగా సర్కారు నాపైన పెట్టిన పెట్టుబడి అది. ప్రభుత్వ డబ్బంటే ప్రజల సొమ్మనే అర్థం కదా... అందుకే కెరీర్‌లో ఓ స్థాయికి చేరుకున్నాక ఉచితంగా సేవలందించే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాను’ అంటాడు ఆంటన్‌. ఆ కలతోనే ఎంబీబీఎస్‌లో బంగారు పతకం అందుకున్నాడు. జనరల్‌ సర్జరీలో ఎమ్మెస్‌ చేశాడు. ల్యాప్రోస్కోపీ సర్జరీలో పట్టు సాధించాడు. ఆ అర్హతలకి పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు ఆహ్వానించినా- వద్దనుకుని ప్రభుత్వ వైద్యుడయ్యాడు. విళుప్పురం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయడానికి వెళ్ళాడు! ఆ పల్లెప్రాంతంలో చక్కటి పేరుతెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆ జిల్లాలోని ఎంబీబీఎస్‌ డాక్టర్‌లు పీజీ కోర్సులకి వెళ్ళేలా ఉచిత కోచింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ శిక్షణ అందుకున్న వాళ్ళలో ఒకరు జాతీయ ర్యాంకూ, ఇంకొకరు రాష్ట్ర ర్యాంకూ సాధించడంతో అలాంటివాళ్ళకోసమే ‘కాన్సెప్ట్‌’ అన్న కోచింగ్‌ కేంద్రాల్ని ప్రారంభించాడు. చూస్తుండగానే దేశవ్యాప్తంగా విస్తరించాడు దాన్ని. తమిళనాడుతోపాటూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, తెలంగాణలోని హైదరాబాద్‌ల్లోనూ శాఖలున్నాయి దానికి! మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశాక- యురాలజీలో ‘ఎంసీహెచ్‌’ చదివాడు. ల్యాప్రోస్కోపి ద్వారా దాత శరీరం నుంచి కిడ్నీని తీసే అరుదైన ఆపరేషన్‌లో విశిష్ట గుర్తింపు అందుకున్నాడు. చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో తొలిసారి చిన్నారులకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేసి సంచలనం సృష్టించాడు. అలా- ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలోని యురాలజీ డిపార్ట్‌మెంట్‌కి వచ్చాడు. పిన్న వయసులోనే ప్రొఫెసర్‌ అయ్యాడు. ఇంత ఎదిగినా తన పాత కలని మరిచిపోలేదు!

‘సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించాలన్న నా కలకి సంబంధించిన తొలి అడుగే మా ‘మద్రాసు కిడ్నీ ఫౌండేషన్‌’. దాని ద్వారా పూర్తి ఉచితంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేయడం ద్వారా ఒక మెట్టు ఎక్కాను. ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది...’ అంటున్నాడు డాక్టర్‌ ఆంటన్‌ యురేశ్‌ కుమార్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..