ఆనందమే అందం

సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళుతోంది. ఆమె మొహంలో దుఃఖం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది.

Updated : 12 May 2024 08:57 IST

- పురిఘళ్ళ శ్రీనివాసరావు

రళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళుతోంది. ఆమె మొహంలో దుఃఖం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది. ఏమైంది... ఎప్పుడూ చలాకీగా ఆనందంగా ఉండే పిల్లకు ఇవాళ ఏమైంది... ఎక్కడికి వెళుతోంది... అనుకున్నాడు. ఆమె తనను చూడకుండా దూరంగా వెంబడించాడు. అయినా పరిసరాలని పట్టించుకునేలా లేదు ఆమె. సరాసరి కోదండరాముడి ఆలయానికి వెళ్ళింది. సమయం ఉదయం పదిన్నర అవుతోంది. గుడి పల్చగా ఉంది. ఇద్దరు ముగ్గురు ఉన్నారంతే. ఆమె ఇవేమీ చూడకుండా సరాసరి రాముల వారి విగ్రహం ముందు నిలబడింది. తన దైవం శ్రీరాముడిని చూసిన వెంటనే ఏడుపొచ్చింది. ఆమె స్వామికి ఏదో చెప్పుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్ళు మూసుకుని తనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటోంది. ఆమెనే తదేకంగా గమనిస్తున్నాడు శివాజీ. సరళ అంత అందగత్తేమీ కాదు. ఐదు అడుగులు మించని పొడవు, సమంగా ఉన్న శరీరం, చామన ఛాయ రంగుతో చాలా మామూలు చీర కట్టుకొని జడ వదులుగా వేసుకుని నిలబడ్డ సరళను చూసిన శివాజీ ‘పెద్ద అందగత్తె కాకపోయినా సంప్రదాయంగా కళగానే ఉంది’ అనుకున్నాడు. ఒకటి రెండుసార్లు మాత్రం స్వామిని చూసి, ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు. కాసేపటికి తీర్థం, శఠగోపం తీసుకుని మండపంలో కూర్చుంది సరళ. ఒంట్లో సత్తువ లేనట్లుగా స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది.

రాశిఫలం (మే 12 - మే 18)

అప్పుడు పలకరించాడు శివాజీ ‘‘ఏం సరళా, మీ దేవుడితో ఏదో మాట్లాడుతున్నావు’’ అంటూ వాతావరణంలోని గంభీరతను తగ్గించడానికి ప్రయత్నించాడు.
ఒక క్షణం ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుని ‘‘రా బావా, ఎంతసేపైంది వచ్చి’’ అని జరిగి చోటు ఇచ్చింది. ఆమె పక్కనే కూర్చుంటూ మళ్ళీ తన ప్రశ్నను అడిగాడు.
ఒక్క క్షణంలోనే తమాయించుకుని ‘‘నాకూ నా దేవుడికీ సవాలక్ష ఉంటాయి. అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది’’ అని మామూలుగా, కాస్త హాస్యంగా అంది.
‘‘నాకు తెలుసులే కానీ, ఆ దేవుడు నీ సమస్యను తీర్చమని నాకు చెప్పాడు’’ అన్నాడు శివాజీ. ‘‘ఏం చెప్పాడేం..?’’ అంది. ‘‘ఈ వయసులో ఆడపిల్లలు ఏం కోరుకుంటారు... ‘ఒక అందమైన రాజకుమారుడు వచ్చి తనను అందమైన గుర్రం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాలి’ అనే కదా. ఆ ప్రయత్నం మీదే ఉన్నానని మీ స్వామికి చెప్పానులే’’ అన్నాడు. పకపకా నవ్వింది సరళ. ‘‘నేను నా రాముడిని కోరినది రాజకుమారుడిని పంపమని కాదు. అందుకని తమరేమీ వెతకనవసరం లేదు’’ అంది.

‘‘మరి?’’ ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ. ‘‘నిన్న మా పెద్దనాన్న మా ఇంటికి వచ్చాడు బావా. రావడం రావడం... మా నాన్నకు బాధ్యతలేదనీ ఎదిగిన ఆడపిల్ల కళ్ళముందే తిరుగుతుంటే పట్టించుకోవడంలేదనీ ఆ పిల్లకు అన్యాయం చేస్తున్నాడనీ అంటూ... ‘సరళను ఇలాగే మోడులాగా ఉంచేస్తావా?’ అని నిలదీశాడు. పాపం నాన్న అమాయకుడు. వాళ్ళ అన్నయ్య అంటే గౌరవం, భయం కూడా. ‘చూస్తున్నాను అన్నయ్యా’ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆయన వదిలితేగా... ‘నువ్వేం చూడనవసరం లేదు. చక్కని సంబంధం చూశాను. అబ్బాయిది మన దగ్గరి గ్రామమే. బాగా ఐశ్వర్యవంతుడు. పొలం పదెకరాల పైమాటే. సంపాదనకేమీ లోటు లేదు. పాపం అతని భార్య పోయి సంవత్సరం అయింది. రెండు సంవత్సరాల పాప. మంచి సంప్రదాయమూ ఓర్పూ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు. రూపం, కట్నకానుకలు... ఏమీ పట్టించుకోడు. నాకు వెంటనే మన సరళ జ్ఞాపకం వచ్చింది. మాఘమాసం వచ్చిన వెంటనే మనం వెళ్ళి మాట్లాడదాం. నా మాటంటే అతనికి ఎంతో గురి. తప్పకుండా ఒప్పుకుంటాడు. ఇంకా 35 సంవత్సరాలు కూడా నిండలేదు. ఇంతకంటే మంచి సంబంధం మన సరళకు తేలేం. ఇదే ఖరారు చేద్దాం’ అన్నాడు. ‘తనతో మాట్లాడతాను అన్నయ్యా’ అన్నాడు నాన్న. ‘నీ మొహం, అదేం చెప్తుంది. ‘నా పెళ్ళి చెయ్యి నాన్నా’ అని అడుగుతుందా. మనమే నిర్ణయించాలి. నువ్వు ఇంకేం మాట్లాడకు. అన్నీ నేను చూసుకుంటాను. సరళంటే నాకెంతో అభిమానం. అందుకే చెప్తున్నాను. నాకు అర్జెంట్‌ పని ఉంది. మళ్ళీ వారంలో వస్తాను’ అంటూ వెళ్ళిపోయాడు.

నాన్న ఏమీ అనలేదు. అనడు కూడా. నీకు తెలుసు కదా బావా, ఆయనెంత అమాయకుడో. ఏమీ చెప్పలేడు. వాళ్ళ అన్నయ్య మాట కాదనే ధైర్యం ఆయనకు లేదు.’’
‘‘మంచిదేగా సరళా, త్వరలో ఒక శ్రీమంతుడికి భార్య కాబోతున్నావన్న మాట’’ అన్నాడు శివాజీ. ‘‘నువ్వూ అలా అంటావేమిటి బావా. నీకు తెలియదా నాన్న విషయం. పెద్దనాన్న మా పొలం కూడా చూసుకుంటున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతోంది. అమ్మ ఆయనను కంటికి రెప్పలా కాపాడింది. ఆమె ప్రేమలో, రక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది. కానీ పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుండీ ఆయన మరీ పిచ్చివాడిలా తయారయ్యాడు. అమ్మలా కాకపోయినా నాకు చేతనైనంత వరకూ శ్రద్ధగా నాన్నను చూసుకుంటున్నాను. ఆయనకు వేళకు అన్నీ అందివ్వడం, భోజనం పెట్టడం, మందులు ఇవ్వడం అన్నీ నేనే చూసుకుంటున్నాను. డబ్బూ దస్కం కూడా నా బాధ్యతే. ఆయన నాకు తండ్రి కాదు బావా... నా కొడుకు. పెద్దవాళ్ళు ఇచ్చిన కాస్త పొలాన్నీ ఆవులనూ చూసుకుంటుంటే మా జీవితాలు గడిచిపోతాయి. నేను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే నాన్న ఏమవుతాడు?

కోటి పనులున్నా...ఓటు తర్వాతే!

ఈ ఊళ్ళో నాకొచ్చిన లోటేమీ లేదు. పెళ్ళి చేసుకోకపోతే బతకలేనా... హాయిగా బతుకుతాను బావా- ఆ రాముడి దయ వలన. నేనిలాగే ఉండిపోతాను. ఈ విషయంలో మా పెద్దనాన్నే కాదు, ఎవ్వరూ నన్ను ఒప్పించలేరు. ఏ పరిస్థితిలోనూ నాన్నను వదిలి వెళ్ళే ప్రశ్నే లేదు. అదే రాముడిని ప్రార్థించాను... మా నాన్న నుండి నన్ను దూరం చేయవద్దనీ నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమనీ. అంతేకానీ, నువ్వు చెప్పినట్లు రాజు కోసమూ కాదు, రాకుమారుడి కోసమూ కాదు.’’

ఆమె స్వార్థ రాహిత్యం, తండ్రి మీద ఉన్న ప్రేమా, బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధా అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి. ‘‘నిన్ను మనసారా అభినందిస్తున్నాను సరళా. ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గం అవుతుంది. నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావ్‌. మనిద్దరం పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాము. ఇంతకంటే మంచి చోటు ఉండదు. నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను చేసుకుంటావా సరళా?’’ అన్నాడు. అదిరిపడింది సరళ. ‘‘బావా, హాస్యానికి కూడా అటువంటి మాటలు అనవద్దు. నువ్వెక్కడ, నేనెక్కడ? అందమూ చదువూ మంచితనమూ ఐశ్వర్యమూ అన్నీ ఉన్న నీలాంటి వాడికి చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది, నాలాంటి అమ్మాయి కాదు. నువ్వే కాదు బావా, మీ కుటుంబంలో అందరూ చాలా బాగుంటారు. ముఖ్యంగా మీ వదిన... ఎంత బాగుంటుంది! ఆమెకు తోడికోడలుగా తగ్గ అమ్మాయిని తీసుకురా. సానుభూతితో నన్ను చేసుకుంటానని అన్నా రేపైనా నువ్వు బాధపడతావ్‌. నాకటువంటి అత్యాశ కలలో కూడా లేదు బావా. నేను వస్తాను’’ అని లేవబోయింది.

చనువుగా చెయ్యి పట్టుకుని ఆపాడు శివాజీ. ‘‘నీ విషయం నువ్వు చెప్పావు. నా విషయం కూడా విను. నీకు తెలుసు- మా అమ్మానాన్నా ఎంత మంచి వాళ్ళో. ఊళ్ళో అందరికీ వాళ్ళంటే గౌరవమే. నన్నూ మా అన్నయ్యనూ ఎంతో ప్రేమగా పెంచారు. మేము బాగా చదువుకుని మాస్టర్‌ డిగ్రీ తెచ్చుకున్నాం. కానీ మా ఇద్దరి భావాలూ పూర్తిగా విరుద్ధం. పెద్ద ఉద్యోగాలు చేయాలనీ అమెరికా లాంటి దేశంలో ఉండాలనీ అన్నయ్య కోరిక. కష్టపడి ఆ కోరిక సాధించాడు. మన ఊరు అన్నా మా పొలం అన్నా వ్యవసాయం అన్నా నాకు చాలా ఇష్టం. జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనీ మా పొలాన్నే కాకుండా ఈ గ్రామాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలనీ నా ఆశయం. అందుకనే ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ చేశాను. అది అయిన వెంటనే నాన్నకు అసిస్టెంట్‌గా చేరిపోయాను. ఆయన అనుభవంతో శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాను. రెండు సంవత్సరాల నుండీ నాన్న ఎక్కువగా పొలం రావడంలేదు. నేనే చూసుకుంటున్నాను. కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను. ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంటున్నాను.

నేనూ కొద్దిమంది నా స్నేహితులూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పని మొదలుపెట్టాం. వీటన్నిటి వలన నాకు తీరికే తక్కువ. అన్నయ్య తన క్లాస్‌మేట్‌నే ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. మా వదినది అపురూపమైన సౌందర్యం. బాగా ఉన్నవాళ్ళు. కోడలిని చూసి మురిసిపోయారు అమ్మానాన్నా. పెళ్ళి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరు వచ్చింది మా వదిన. మరునాడే హనీమూన్‌ అని వెళ్ళిపోయారు. మళ్ళీ ఆమె మన ఊరు రానేలేదు. అన్నయ్య ఒక్కడే వచ్చి అమ్మానాన్నల ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోయాడు. పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తర్వాత అన్నయ్య ఇండియా వచ్చాడు. కొడుకూ కోడలి కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఎన్నో పిండివంటలు చేసింది అమ్మ. కానీ, ఒక్కరోజే ఉంది మా వదిన. ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు.

ముభావంగా ముళ్ళ మీద ఉన్నట్లు ఉంది. ‘ఈ ఊళ్ళో నేను ఉండలేను, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను’ అని మరుసటి రోజే వెళ్ళిపోయింది. అన్నయ్యకు ఎంతో కోపం వచ్చింది. కానీ, అమ్మా నాన్నా వారించారు. ‘నిజమే కదా బాబూ, ఆ అమ్మాయి పాపం ఎప్పుడూ పల్లెటూళ్ళో ఉండలేదు. తనకు ఇక్కడ కష్టమే... మనమే అర్థం చేసుకోవాలి’ అని అన్నయ్యను కూడా పంపించేశారు.

రెండు రోజుల తర్వాత అన్నయ్య వచ్చి ఒక వారం ఇక్కడే ఉన్నాడు. మా కోసం కారు కొన్నాడు. ఇంటి సౌకర్యాలు పెంచాడు. నన్ను పొలం తీసుకు వెళ్ళి ‘శివాజీ, నువ్వు చాలా తెలివైన పని చేశావ్‌. ఊళ్ళోనే ఉండిపోయావ్‌. అమ్మా నాన్నతోనే ఉన్నావ్‌. నేను అంత దూరం వెళ్ళి ఆత్మీయులందరికీ దూరమై బావుకున్నదేమిటో నాకే అర్థం కావడం లేదు. కానీ, వెనక్కు రాలేని పరిస్థితి. అనుభవంతో చెప్తున్నాను. నువ్వన్నా అమ్మానాన్నలకు ఒక మంచి కోడలిని తీసుకురా. మన ఇంటికి చక్కని ఇల్లాలిని తీసుకురా. ఈ ఊరినీ మన భావాలనూ మన పెద్దలనూ గౌరవించే ఒక మంచి అమ్మాయిని తీసుకురా. పైపై మెరుగులకు లొంగిపోకు. భగవంతుడి దయ వలన మనకు డబ్బుకేమీ లోటు లేదు. నేను ప్రతి నెలా వెయ్యి డాలర్లు పంపిస్తాను. దేనికైనా వాడుకో. నీకు అవసరం లేకపోతే ఊరి బాగు కోసం ఖర్చుపెట్టు.

ప్రత్యక్షంగా నేనేమీ చేయలేకపోయినా పరోక్షంగా ఎప్పుడూ నీతోనే ఉంటాను. ముఖ్యంగా మనల్ని ఇంతవాళ్ళను చేసిన అమ్మానాన్నలను సుఖపెట్టు’ అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ‘నువ్వింతగా చెప్పాలా అన్నయ్యా, తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను’ అని మాట ఇచ్చాను. నా మనసులో ఉన్న మాట కూడా అదే. వదిన ప్రవర్తన చూశాక, మా స్నేహితుల బాధలు విన్నాక, నేనేం చేయాలో స్పష్టంగా అర్థమైంది. అప్పటినుండీ నీకు తెలియకుండా నిన్నే చూస్తున్నాను సరళా. చూసేకొద్దీ నాకు ఎంతో ఆనందమూ నీమీద ఇష్టమూ కలిగాయి. నీ ప్రవర్తనా నీ మంచితనమూ నీ దైవభక్తీ మీ నాన్న మీద నీకున్న ప్రేమా ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధా... నన్ను ముగ్ధుడిని చేశాయి. చెప్పు సరళా, నా భావాలనూ నా ఆశయాలనూ అర్థం చేసుకుని నావెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ, మా అమ్మానాన్నలను ప్రేమగా చూసుకుంటూ ఉండటానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా! వదినను చూసేకొద్దీ- నాకు ఆమెలో అందం కాదు, వికృత రూపం కనిపించసాగింది. నువ్వు సినిమా హీరోయిన్‌లా ఉండకపోవచ్చు కానీ, నీ మొహంలో ఆకట్టుకునే సౌమ్యత, నాకు ఎంతో అందంగా కనిపిస్తోంది.

ఈ రోజు అనుకోకుండా ఇలా దైవ సన్నిధిలో కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఇది ఆ భగవంతుడి సంకల్పమే. ఏదో సినిమా పాటలో ‘అందమె ఆనందం’ అని పాడారు. అందం ఆనందం కాదు సరళా. ఆనందమే అందం. తన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయే నిజమైన అందగత్తె. ఏమంటావ్‌ సరళా... మీ నాన్న కూడా మనతోనే ఉంటారు. నన్ను పెళ్ళి చేసుకుంటావా?’’ అని ప్రేమగా అడిగాడు. అతనికేసి ఎంతో ఆనందంగా చూసింది సరళ. లేచి వెళ్ళి రాముడికి నమస్కారం చేసింది. తర్వాత శివాజీ పాదాలను తాకి కళ్ళకు అద్దుకుంది. ఎంత వేగంగా గుడికి వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది... ఈసారి ఆనందంతో కృతజ్ఞతతో. సంతోషంగా ఆమెనే చూస్తూ గుడి గంట మోగించాడు శివాజీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..