చిట్టి పండ్లు...మన సంతకూ వచ్చేశాయ్‌!

వేలెడంత అరటి పండు చూశారా... ద్రాక్ష సైజు కివీ, స్ట్రాబెర్రీలు తెలుసా... బత్తాయి పండంత పైనాపిల్‌ని తిన్నారా... అవునండీ బాబూ... చూడటం, తెలుసుకోవడమే కాదు, కొనుక్కుని తినొచ్చు కూడా... ఈ చిట్టిపొట్టి పండ్లన్నీ ఇప్పుడు మన దగ్గరా దొరుకుతున్నాయి మరి!

Updated : 12 May 2024 09:06 IST

వేలెడంత అరటి పండు చూశారా... ద్రాక్ష సైజు కివీ, స్ట్రాబెర్రీలు తెలుసా... బత్తాయి పండంత పైనాపిల్‌ని తిన్నారా... అవునండీ బాబూ... చూడటం, తెలుసుకోవడమే కాదు, కొనుక్కుని తినొచ్చు కూడా... ఈ చిట్టిపొట్టి పండ్లన్నీ ఇప్పుడు మన దగ్గరా దొరుకుతున్నాయి మరి!

పండ్లను చాలావరకూ కోసుకునే తింటుంటాం కదా. కానీ కొన్ని పండ్లు కోయకుండానే గుటుక్కుమని నోట్లో వేసుకునేలా బుజ్జిగా ఉంటే... మరి కొన్నేమో అసలు పండ్ల కన్నా- కొత్త రుచితో నోరూరిస్తే... ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది! మన దగ్గరుండే రకరకాల పండ్లలోనే ఈమధ్య ఇలాంటి మినియేచర్‌ సైజు వెరైటీలు బోలెడన్ని వచ్చాయి. వీటిల్లో కొన్ని సహజంగా చిట్టి రూపంతో ఉంటే, మరికొన్ని సంకరీకరణంతో కొత్త రకాలుగా పుట్టుకొచ్చాయి. మినీ రూపం చూడ్డానికి ముద్దొస్తుందనో, చిట్టి ఆకారం చటుక్కున తినేలా ఉంటుందనో, పండుకు సరికొత్త రుచిని తీసుకొచ్చేయాలనో... ఇలా ఏ కారణంతో ఈ మినియేచర్‌ పండ్ల వెరైటీల్ని తీసుకొచ్చినా... వీటి బేబీ రూపం మాత్రం అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.

ఎన్ని రకాలో...

అరటి పండ్లలో కర్పూర కేళిల్లాంటివే చిన్నవనుకుంటాం. కానీ మెత్తని గుజ్జుతో వేలెడంత పరిమాణంలో ఉండే బేబీ బనానాలూ ఉన్నాయి. ఈ పొట్టి అరటిని అదాటున చూస్తే ‘అరె! పండ్లు పూర్తిగా ఎదగకముందే అరటి గెలను కోసేశారా’ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ పండును నోట్లో వేసుకున్నామంటే తియ్యని దాని రుచితో భలే నచ్చేస్తుందంటే నమ్మండి. అంతేకాదు, తక్కువ క్యాలరీలతో బోలెడన్ని పోషకాలూ అందిస్తుంది. మలేషియా, ఇండోనేషియాల్ని పుట్టిళ్లుగా చెప్పే ఈ బేబీ బనానాల్ని ఇప్పుడు చాలా దేశాల్లోనూ పండిస్తున్నారు. కమ్మని వాసనా, తియ్యని రుచి వల్ల వీటిని ఎక్కువగా స్వీట్ల తయారీల్లో వాడుతుంటారట.

ఇంకా ద్రాక్ష పండంత ఉండే కివీ బెర్రీస్‌ని చూస్తే ఏ పండో మనం చెప్పలేకపోవచ్చు. కోస్తే మాత్రం వెంటనే కివీ రూపం కనిపిస్తుంది. కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా ఉండే కివీ బెర్రీ... కివీల్లోనే ఓ రకం. పొట్టు సహా తినేలా ఉండే ఈ పండులోనూ కివీలోని పోషకాలన్నీ ఉంటాయి.

ఆనందమే అందం

సాధారణంగా మన అరచెయ్యంత ఉండే డ్రాగన్‌ ఫ్రూట్‌ని మొత్తం ఒకేసారి తినాలంటే కాస్త కష్టమే కదా. కానీ బేబీ డ్రాగన్‌ పండ్లను మాత్రం ఎంచక్కా రెండూ, మూడూ తినేయొచ్చు. ఇవే కాదు, మినియేచర్‌ రూపంలో అంగుళమంత సైజు స్ట్రాబెర్రీ, యాపిల్‌ పండు అంత పరిమాణంలో ఉండే మినీ పైనాపిల్‌, చిట్టి మారియన్‌ మామిడి, మినీ వాటర్‌మిలన్‌, బేబీ ఆపిల్‌ లాంటివి చాలానే దొరుకుతున్నాయి.

ఏది ఏమైనా... ఈ లిల్లీఫుట్‌ పండ్లు భలే ఉన్నాయి కదూ. ఇంటికొచ్చిన అతిథులకిచ్చినా కొత్తగా అనిపిస్తాయి, రకరకాల ఆహార పదార్థాలపైన అలంకరణలకు కూడా ఎంతో బాగుంటాయి. ముఖ్యంగా ఈ పొట్టి పండ్లు పిల్లలకు మరింత నచ్చేస్తాయి, సరదాగా బొమ్మల కిచెన్లో నిజమైన మినియేచర్‌ ఫ్రూట్స్‌ని పెట్టుకుని ఆడుకుంటూనే ఆట పూర్తయ్యాక ఆంఫట్‌మంటూ లాగించేయొచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..