అభాగ్యులకు ఆపన్నహస్తం

తెల్లారి లేస్తే ఎన్నో దృశ్యాలు మన కంటపడుతుంటాయి. వాటిలో కొన్ని కదిలిస్తాయి. అయ్యో.. అనుకునేలా చేస్తాయి. వీళ్లూ అలాంటి బాధాకర దృశ్యాల్నే చూశారు. కానీ, అంతటితో బాధితులను వదిలేయలేదు.

Published : 09 Jun 2024 01:01 IST

తెల్లారి లేస్తే ఎన్నో దృశ్యాలు మన కంటపడుతుంటాయి. వాటిలో కొన్ని కదిలిస్తాయి. అయ్యో.. అనుకునేలా చేస్తాయి. వీళ్లూ అలాంటి బాధాకర దృశ్యాల్నే చూశారు. కానీ, అంతటితో బాధితులను వదిలేయలేదు. వారి కష్టాలను తీర్చడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆపన్నహస్తాలను అందించి ఇప్పుడు ఎందరో అభాగ్యులకు సాయపడుతున్నారు.


కూలీల పిల్లలకోసం..

కేరళలోని వెంగోళ అనే గ్రామం చుట్టుపక్కల టింబర్‌ డిపోలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ పని చేయడానికి వేలాది మంది వలస కూలీలు బిహార్‌ నుంచి వస్తుంటారు. పెద్దపెద్ద యంత్రాలతో కూడిన ఆ పని ప్రదేశం పిల్లలకు అంత క్షేమంకాకపోవడంతో యజమానులు చిన్నారుల్ని అక్కడకి అనుమతించరు. దాంతో చిన్నపిల్లలు ఉన్నవారు ఉపాధిని కోల్పోతున్నారు. కొందరేమో పిల్లల్ని ఇతరులకు అప్పగించి పనులకు వెళుతున్నారు. గతేడాది తల్లిదండ్రులు అలా ఇంటి వద్ద వదిలేసి వచ్చిన ఓ ఐదేళ్ల పాపని కొందరు స్థానికులు అత్యాచారం చేసి చంపేశారు. ఇదంతా గమనించిన వెంగోళ సర్పంచి సుభాష్‌ పల్లికల్‌కు - వలస కూలీల పిల్లల్ని భద్రంగా చూసుకోవడానికి  ఓ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించాడు.

ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ చిన్నారులను చూసుకోవడానికి సంరక్షకులను ఏర్పాటు చేయడంతోపాటు పిల్లలకు ఆహారం అందిస్తూ, చదువూ చెప్పిస్తున్నాడు. ఏడాది క్రితం ప్రారంభించిన ఆ క్రెచ్‌ సేవలు చుట్టుపక్కల పది గ్రామాల్లోని వలస కూలీలకు ఉపయోగపడుతున్నాయి. మరి ఆ పిల్లల్ని తీసుకొచ్చి.. సాయంత్రం దింపడానికి వ్యానులను కూడా అందుబాటులో ఉంచాడు. ఇప్పుడు అక్కడ దాదాపు 60 మంది పిల్లలు ఉన్నారు. ఆ చిన్నారుల కోసం, గ్రామస్థులకోసం ఓ అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేశాడు సుభాష్‌.


ఆకలి తీర్చుతూ...

కోల్‌కతాకు చెందిన సంతోష్‌ కొన్నేళ్ల క్రితం ఆసుపత్రిలో ఉన్న స్నేహితుణ్ని పరామర్శించడానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా బాగా ఏడుస్తున్న చిన్నారుల్నీ వారిని ఓదార్చుతున్న తల్లినీ చూశాడు. ఒక్క క్షణం ఆగి ఆ పిల్లలతో మాట్లాడితే- వాళ్లు ఆకలితో బాధపడుతున్నారని తెలిసింది సంతోష్‌కి. వెంటనే వారి కడుపు నింపి ఇంటికెళ్లిపోయాడు. కానీ ఆ రోజంతా ఆ పిల్లల ఏడుపే అతని మనసులో ఉండిపోయింది. అలాంటి వాళ్లకోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించింది. వేడివేడిగా రోటీ, ఓ కూర, స్వీటు... అందించేలా మొబైల్‌ వ్యానును సిద్ధం చేశాడు. కోల్‌కతాలోని రద్దీ ప్రాంతాలకు ఆ వ్యానును పంపి అభాగ్యుల ఆకలి తీర్చుతున్నాడు. మొదట్లో శని, ఆదివారాల్లోనే చేసేవాడు. క్రమంగా ఆ సేవల్ని విస్తరించడంతోపాటు వ్యానుల సంఖ్యను పెంచి- ప్రతిరోజూ రెండు వేల మందికి కడుపు నింపుతున్నాడు.

అంతే కాదు, కొన్ని వ్యానుల్లో కిచెన్లు ఏర్పాటు చేసిన సంతోష్‌- పుట్టిన రోజులూ, పెళ్లిరోజులూ, ఇతర సందర్భాలప్పుడు సంస్థలు గానీ, వ్యక్తులుగానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు తమ చేతులు మీదుగా చేయాలనుకున్నప్పుడు వారి వద్దకు ఆ వ్యానులనూ, సిబ్బందినీ పంపుతుంటాడు. సేవ చేసేవారికి పరోక్షంగా సాయపడటం కూడా మాధవ సేవే అంటాడు సంతోష్‌. ప్రస్తుతం ఈ తరహా సేవల్ని కోల్‌కతాతోపాటు ముంబయి, పుణెల్లోనూ అందిస్తున్నాడు.


మొబైల్‌ చలివేంద్రం!

వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతోమంది దాహం తీర్చుతుంటారు దాతలు. అదే పనిని ఏడాదంతా చేస్తున్నాడు రాజస్థాన్‌ వాసి మహమ్మద్‌ ఆబాద్‌. ఆ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో  నీటికొరత ఉంది. వర్షాకాలంలోనూ నీటి ఎద్దడి ఎంతో ఇబ్బంది పెడుతుంటుంది. సుజన్‌గఢ్‌కు చెందిన ఆబాద్‌కు ఆ బాధలన్నీ తెలుసు. పేదరికం వల్ల చదువుకు దూరమైన అతను కష్టపడి తమ్ముణ్ని పెంచి పెద్ద చేశాడు. ఆ కుర్రాడు నీటి కష్టాలను తొలగించి పేదల దాహం తీర్చాలని ఆలోచించేవాడు. కానీ ఓ ప్రమాదంలో ఆ అబ్బాయి మరణించడంతో- ఆబాద్‌ ఎలాగైనా తమ్ముడి కోరికను తీర్చాలనుకున్నాడు. అందుకోసం ఓ ఆటో కొనుక్కున్నాడు. దాని మీద వాటర్‌ ట్యాంకర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఊరూరూ తిరుగుతూ ప్రతి ఇంట్లోనూ తాగునీళ్లు అందివ్వడం మొదలుపెట్టాడు. ఎండ కారణంగా ట్యాంకర్‌లో నీళ్లు వేడెక్కడంతో జనాలు తాగలేకపోయేవారు. అది గమనించిన ఆబాద్‌ వాటర్‌ కూలర్‌ను కొనుగోలు చేసి ఆటోపైన అమర్చిన సోలార్‌ ప్యానెళ్లతో దాన్ని నడిపిస్తూ- దాదాపు యాభై గ్రామాల్లోని ప్రజల దాహం తీరుస్తున్నాడు. ఉదయం ఐదింటి నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ మొబైల్‌ చలివేంద్రం నడుపుతున్న ఆబాద్‌  రోజుకు ఐదువేల మంది దాహం తీర్చుతున్నాడు. ఇందుకోసం నెలకు దాదాపు లక్షరూపాయలు ఖర్చుపెడుతున్న ఆబాద్‌కు ఆస్తిపాస్తులేమీ లేవు. తాను ఒకప్పుడు రాళ్లు కొడుతూ దాచుకున్న డబ్బుతోనే ఈ చలివేంద్రాన్ని నడిపిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..