నేర్చుకో... మర్చిపో... మళ్లీ నేర్చుకో!

మనిషి.. మనుగడ కోసం ఏదో ఒక విద్య నేర్చుకుంటాడు. అలా నేర్చుకున్నదాన్ని మళ్లీ మళ్లీ వల్లెవేసుకుంటాడు. కాలక్రమంలో ఆ సూత్రాలతో, సిద్ధాంతాలతో ప్రేమలో పడతాడు. నిద్రలోనూ కలవరిస్తాడు. పలవరిస్తాడు. సాంకేతికత మారినా, అవసరాలు మారిపోయినా ఆ పాతసామాన్ల పెట్టెను మాత్రం నెత్తినపెట్టుకుని తిరుగుతాడు. అదే అత్యుత్తమమని నమ్ముతాడు. అంతకు మించింది లేనేలేదని వాదిస్తాడు .ఆ భ్రమలోంచి బయటపడకపోతే తనకే నష్టం. అక్కడే ఆగిపోతాడు. అన్నివిధాలా ఓడిపోతాడు. ఆ దుస్థితి రాకూడదంటే ఒకటే మార్గం. ‘లర్న్‌.. అన్‌లర్న్‌.. రీలర్న్‌’ అనే త్రిముఖ వ్యూహాన్ని అనుసరించడం.

Updated : 31 Mar 2024 10:02 IST

మనిషి.. మనుగడ కోసం ఏదో ఒక విద్య నేర్చుకుంటాడు. అలా నేర్చుకున్నదాన్ని మళ్లీ మళ్లీ వల్లెవేసుకుంటాడు. కాలక్రమంలో ఆ సూత్రాలతో, సిద్ధాంతాలతో ప్రేమలో పడతాడు. నిద్రలోనూ కలవరిస్తాడు. పలవరిస్తాడు. సాంకేతికత మారినా, అవసరాలు మారిపోయినా ఆ పాతసామాన్ల పెట్టెను మాత్రం నెత్తినపెట్టుకుని తిరుగుతాడు. అదే అత్యుత్తమమని నమ్ముతాడు. అంతకు మించింది లేనేలేదని వాదిస్తాడు .ఆ భ్రమలోంచి బయటపడకపోతే తనకే నష్టం. అక్కడే ఆగిపోతాడు. అన్నివిధాలా ఓడిపోతాడు. ఆ దుస్థితి రాకూడదంటే ఒకటే మార్గం. ‘లర్న్‌.. అన్‌లర్న్‌.. రీలర్న్‌’ అనే త్రిముఖ వ్యూహాన్ని అనుసరించడం.

‘స్వామీ! నాకు జ్ఞానబోధ చేయండి’ అంటూ జెన్‌ గురువును వేడుకున్నాడు ఓ సాధకుడు.

‘తప్పకుండా నాయనా. ముందు ఈ తేనీరు సేవించు’ అంటూ నిండు టీకప్పు చేతికిచ్చాడు సన్యాసి. అంతేకాదు, అందులోనే ఇంకొంత పోశాడు. దీంతో చాయ్‌ ఒలికిపోయింది.

‘ఇప్పటికే నిండుగా ఉంది. మళ్లీ ఎందుకు పోస్తున్నారు స్వామీజీ?’

సందేహం వ్యక్తం చేశాడు భక్తుడు.  

‘నీ బుర్ర కూడా టీ కప్పు లాంటిదే.

అస్సలు ఖాళీ లేదు. అనేక అభిప్రాయాలూ నమ్మకాలతో పొంగిపొర్లుతోంది.

మొత్తం వదిలించుకుని, ఖాళీ కప్పులా నా దగ్గరికి రావాలి.

అప్పుడే, జ్ఞానం తలకెక్కుతుంది’ సలహా ఇచ్చాడు జెన్‌ గురువు.

‘అన్‌లర్నింగ్‌ లక్ష్యమూ ఇదే.

లర్నింగ్‌ తర్వాతి దశ ఇది.

రీలర్నింగ్‌కు ముందు దశ కూడా ఇదే.

   *           *         *   

నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుంది. నైపుణ్యం సొంతం అవుతుంది.  

ఇది లర్నింగ్‌. మొదటి దశ.

అలా నేర్చుకున్నదానిలో అనవసర మైనవన్నీ..ఉద్దేశపూర్వకంగా మర్చి పోవడమే అన్‌లెర్నింగ్‌. ఇది రెండో దశ.

కాలంచెల్లిన చదువు, నిరుపయోగమైన అనుభవం, పదును తగ్గిన నైపుణ్యంతో పాటు.. అర్థంలేని నమ్మకాలూ, హేతువుకు అందని అపోహలూ, అకారణ భయాలూ కూడా ఈ జాబితాలోకే వస్తాయి.

దీనివల్ల, బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది.

ఆ జాగాను పనికొచ్చే సమాచారంతో, సమకాలీన విజ్ఞానంతో నింపుకోవాలి.

ఇది రీలర్నింగ్‌. మూడో దశ.

ఇది కూడా శాశ్వతం కాదు.  

ఈ పరుగులో ఎక్కడ ఆగిపోయినా.. వీగిపోయినట్టే.

మనిషికైతే కష్టాలు.. సంస్థకైతే నష్టాలు ఆరంభం.

ఎంత విశ్వసనీయత ఉన్నా, ఎన్ని నాణ్యమైన ఉత్పత్తులు అందించినా.. ఈ ఒక్క పరిమితి కారణంగానే కాలగర్భంలో కలిసిపోయిన కంపెనీలు అనేకం. కొడక్‌ ఫిల్మ్‌, నోకియా ఫోన్‌ ఫెయిల్యూర్‌ స్టోరీలు అలాంటివే. పేర్లెందుకు కానీ, అనామకులుగా మిగిలిపోయిన మేధావులూ ఎంతోమంది. నేర్చుకుంటున్నప్పుడు శ్రద్ధ, వదిలి పెడుతున్నప్పుడు నిర్మోహత్వం, మళ్లీ నేర్చుకుంటున్నప్పుడు జిజ్ఞాస.. చాలా అవసరం.     

మనం నేర్చుకోవడం ఆపేస్తే.. ఉన్న చోటే ఉండిపోతాం. గతం దగ్గరే నిలిచి పోతాం. మనకు తెలిసిందే సర్వస్వమని భ్రమిస్తాం. ఆ పరిధిలోనే బతికేస్తాం. ఎప్పుడో దిద్దుకున్న నాలుగక్షరాల్నే తిరగరాసి, మురగబెట్టి మురిసిపోతాం. చిన్నప్పుడు వల్లెవేసిన ఎక్కాలనే విజ్ఞాన సర్వస్వమని భ్రమిస్తాం. ఆ అజ్ఞానపు గంతలు తొలగిపోయి.. చేసిన తప్పులు తెలిసొచ్చేసరికి.. తుప్పుపట్టిన యంత్రాల్లా మారిపోతాం. ఈ ఉత్పాతానికి కారణం.. గతంలో నేర్చుకున్నది వదిలేయకపోవడం. కొత్తగా ఏమీ నేర్చుకోలేకపోవడం.

లర్నింగ్‌ ఎంత ముఖ్యమో, అన్‌లర్నింగ్‌ కూడా అంతే అవసరం.  

నీకేం తెలుసన్నది ఎవరికి కావాలి?

మార్కెట్‌కు ఏం అవసరం అనేదే కీలకం.

కప్పు ఖాళీగా ఉంటేనే.. తేనీరు నింపుకోగలం.. పాత ఆలోచనల్ని తుడిచేస్తేనే.. కొత్త ఐడియాలను స్వాగతించగలం.

ఎంత వేగంగా నేర్చుకుంటే, అంత వేగంగా మర్చిపోవచ్చు. ఎంత వేగంగా మర్చిపోతే, అంత వేగంగా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఈ ప్రక్రియ కాలచక్రం లాంటిది. గిరగిరా తిరుగుతూనే ఉండాలి. ఆగిపోతే అధోగతే.

ఎందుకు మర్చిపోవాలి?

ఒక పాఠం నేర్చుకోడానికీ¨, ఒక సత్యం తెలుసుకోడానికీ¨, ఒక సూత్రం ఆవిష్క రించడానికీ¨, ఓ విజయ రహస్యం కనిపెట్టడానికీ¨ ఎంత అంతర్మథనం జరుగుతుంది, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతాం, ఎన్ని సుఖాలు వదులుకుంటాం, ఎంత కాలాన్ని ధారపోస్తాం? తీరా చిటారు కొమ్మకు చేరుకుని.. మిఠాయి స్వప్నాన్ని అందుకున్నాక.. ఆ అనుభవసారాన్ని చేజేతులా చెత్తపాలు చేయాలా, ఇంతకు మించిన విషాదం ఉంటుందా? నిజమే, గుండె దిటవు చేసుకోవాల్సిన సందర్భమే. కానీ, కాలదోషం పట్టిన నమ్మకాలు మనల్ని కాలగర్భంలో కలిపేస్తాయి. మనిషికి చలనమే ప్రాణం. అనునిత్యం ప్రవాహమై పారాల్సిందే. ఓ సందర్భంలో, టెన్నిస్‌ తార సెరీనా విలియమ్స్‌ జీవితాన్ని కూడా జడత్వం ఆవహించింది. ఓ ఘోర ప్రమాదం ఆమెను మంచానికే పరిమితం చేసింది. ఏడాది వరకూ ఇల్లు కదల్లేదు. మైదానం మొహం చూడలేదు. గతంలో సాధించిన నైపుణ్యమే తనను గట్టెక్కిస్తుందని భావించేవారు సెరీనా. కానీ, జరిగింది వేరు. ఆ స్వల్ప వ్యవధిలోనే ఎంతోమంది కొత్త తారలు పుట్టుకొచ్చారు. కొత్తకొత్త టెక్నిక్స్‌ కనిపెట్టారు. సెరీనా మాత్రం పాత చిట్కాలనే నమ్ముకుని బరిలో దిగారు. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో ఎక్కడో నూటపదకొండో స్థానంలో బిక్కు బిక్కుమంటున్న ఓ అనామక క్రీడాకారిణి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ కోచ్‌ను సంప్రదించారు. ‘స్టార్‌గా కాదు. ఒక సాధారణ టెన్నిస్‌ విద్యార్థిగా వస్తానంటేనే చేర్చుకుంటాను’ అని షరతు పెట్టాడాయన. ఆట మీద మమ కారంతో అందుకూ అంగీకరించారామె. లర్నింగ్‌ నుంచి అన్‌లర్నింగ్‌ వైపుగా సాగిన ఆ ప్రయాణం.. రీలర్నింగ్‌ దగ్గర కొత్త మలుపు తీసుకుంది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో సెరీనా పాత శైలిని మార్చుకున్నారు. నిన్నటి ఎత్తుగడల్ని పక్కన పెట్టారు. ఇష్టమైన వ్యూహాల్ని కూడా స్వచ్ఛందంగా వదులుకున్నారు. మరోజన్మ ఎత్తినట్టు.. సరికొత్తగా ఆడారు. ఆ సాధన వృథాగా పోలేదు. వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సొంతం అయ్యాయి. పాతను పట్టుకుని వేలాడినా, కొత్తను ద్వేషించి దూరంపెట్టినా సెరీనా కెరీర్‌లో ఈ మార్పు సాధ్యమయ్యేదే కాదు.

అమెరికన్‌ ఫ్యూచరిస్ట్‌ అల్విన్‌ టోఫ్లర్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘భవిష్యత్తులో నిరక్షరాస్యుడంటే రాయడమో, చదవడమో తెలియనివాడు మాత్రమే కాదు. అవసరాన్ని బట్టి గతంలో నేర్చుకున్నది మర్చిపోనివాడు, మళ్లీ కొత్తగా నేర్చుకోనివాడు’. ఇక్కడ మనం వదిలించుకుంటున్నది పాతబడిన జ్ఞానాన్నే కాదు, మనకే తెలుసనే అజ్ఞానాన్ని. కొత్తగా తెలుసుకోడానికి ఏమీ లేదనే అహంకారాన్ని.

ఎందుకు నేర్చుకోవాలి?

నేర్చుకోడానికైనా, నేర్చుకున్నది మర్చిపోడానికైనా, మళ్లీ కొత్తగా నేర్చుకోడానికైనా మూడు కారణాలు చెబుతారు మానసిక నిపుణులు.

ఒకటి.. భయం. ఉద్యోగం పోతుందనే అభద్రత, ఉపాధిని కోల్పోతామనే ముందుచూపు.  

రెండు.. అవసరం. కెరీర్‌లో ఎదుగుదల కోసం, వ్యాపారంలో లాభాల కోసం.

మూడు.. ప్రేమ. సహజ కుతూహలం, అంతులేని జిజ్ఞాస.

కారణం ఏదైతేనేం.. పాత బరువు దించుకోవడం ఏమంత సులభం కాదు. మొదట్లో మెదడు మొరాయిస్తుంది. స్టాటస్‌కో కోరుకుంటుంది. ఆ దశను మనం సవాలు చేయాలి. తిరుగు బాటును తిప్పి కొట్టాలి. లోలోపల తిష్టవేసిన పాత నమ్మకాలూ, అలవాట్లూ డిలీట్‌ చేసుకుంటూ ముందు కెళ్లాలి. అలా ఖాళీ అయిన జాగాను అంతకంటే విలువైన, అంతకంటే సమ కాలీనమైన సమాచారంతో భర్తీ చేయాలి. ఒకానొక సమయంలో నిన్ను గెలిపించిన సూత్రమే, మరొక సందర్భంలో నీ పతనానికి కారణం కావచ్చు. అమృతం లాంటి ఔషధం కూడా గడువు తీరిపోగానే కాలకూట విషంగా మారుతుంది. కాబట్టి, నీకేం తెలుసనేది పక్కన పెట్టి, నీకేం అవసరమో గుర్తించు. బుద్ధిగా నేర్చుకో. ‘లేదు. పాతనే ప్రేమిస్తాను. పాత వాసనల్నే ఆస్వాదిస్తాను’ అంటే మాత్రం, అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంకులా షట్టరు దించుకోవాల్సిందే. అదో దశాబ్దాల నాటి ఆర్థిక సంస్థ. తొలి రోజుల్లో ఓ వెలుగు వెలిగింది. ఫలితంగా, విజయ గర్వం తలకెక్కింది. బూజుపట్టిన నిబంధనల్ని పట్టుకుని వేలాడేది. అదే తన ప్రత్యేకత అని చెప్పుకునేది. కస్టమర్ల అవసరాలనూ, బ్యాంకింగ్‌ పరిణామాలనూ పూర్తిగా విస్మరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పందొమ్మిదో శతాబ్దపు మైండ్‌సెట్‌తో ఇరవై ఒకటో శతాబ్దపు సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నించింది. దీంతో జనాదరణ కోల్పోయింది. దివాలా స్థితికి చేరింది. గత ఏడాదే మూతబడింది.  

మళ్లీ ఏం నేర్చుకోవాలి?

నువ్వు గజ ఈతగాడివైతే కావచ్చు. సప్త సముద్రాలను చిటికెలో ఈదేసిన ఘన చరిత్ర ఉండవచ్చు. అయినా సరే, ఏ ఎవరెస్ట్‌ శిఖరాన్నో అధిరోహించాల్సి వచ్చినప్పుడు.. అక్షరమాలతో మొదలుపెట్టి పర్వతారోహణ పాఠాలు నేర్చుకోవాల్సిందే. నీకు తెలిసిన పాత విద్య పనిచేయదిప్పుడు. కొత్త నైపుణ్యం అవసరం అవుతుంది. ‘అన్‌లర్నింగ్‌ నా జీవితాన్నే మలుపుతిప్పిన మాట. మనుగడ కోసం పోరాటంలో నన్ను కవచంలా కాపాడింది’ అంటారు జైపూర్‌ రగ్స్‌ అధినేత నందకిశోర్‌. ఆయన చదివిన చదువులకూ, ప్రారంభించిన వ్యాపారానికీ సంబంధమే లేదు. రాజస్థానీ గ్రామీణ మహిళలు రూపొందించే రగ్గులూ, బొంతలను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లాలనేది ఆ ఆంత్రప్రెన్యూర్‌ ఆలోచన. కానీ, ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలా అన్నది ఏ మేనేజ్‌మెంట్‌ గ్రంథమూ చెప్పలేదు.ఏ  బిజినెస్‌ స్కూల్‌ సిలబస్‌ బోధించలేదు. దీంతో తాను చదివిన చదువుల్ని బుర్రలోంచి శుభ్రంగా తుడిచేశారు. మేనేజ్‌మెంట్‌ డిగ్రీలను చెత్తబుట్టలో పడేసినంత పనిచేశారు. గ్రామీణ మహిళల ముందు చేతులు కట్టుకుని కూర్చుని కొత్త పాఠాలు నేర్చుకున్నారు నందకిశోర్‌. వ్యాపారంలో ఓ స్థాయికి వెళ్లాక లర్న్‌.. అన్‌లర్న్‌.. రీలర్న్‌ సూత్రాలను ‘జైపూర్‌ రగ్స్‌‘ డీఎన్‌ఏలో భాగం చేశారాయన. తమ కార్పొరేట్‌ ఆఫీసులో ‘హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ అన్‌లర్నింగ్‌’ ప్రారంభించారు. సాధారణ ఉద్యోగుల నుంచి డైరెక్టర్‌ వరకూ ఇక్కడ మూడు సూత్రాలనూ నేర్చుకోవాల్సిందే.

లర్న్‌.. అన్‌లర్న్‌.. రీలర్న్‌ ప్రక్రియలో పరోక్షంగా అయినా సరే, మన వైఫల్యాలను అంగీకరిస్తాం. నిన్నటి సాధన సంపత్తిని అటకెక్కిస్తాం. అయినా, బలంగా ఓ అడుగు ముందుకు వేయాలనుకున్నప్పుడు.. రెండడుగులు వెనక్కి వెళ్తే మాత్రం తప్పేమిటి? ఓ దశలో ఇంటెల్‌ సంస్థ ఉత్పత్తి చేసే మెమరీ చిప్స్‌కు మార్కెట్‌ తగ్గిపోయింది. అంతిమంగా సీఈవో యాండీ గ్రూవ్‌ ఓ నిర్ణయం తీసుకున్నారు. ‘ఖేల్‌ ఖతం. మెమరీ చిప్స్‌ ఉత్పత్తిని ఆపేద్దాం. మైక్రోప్రాసెసర్ల మీద దృష్టి పెడదాం’ అంటూ ఒక్క మాటలో తేల్చేశారు. అప్పటి వరకూ సాధించిన నైపుణ్యాన్ని నిర్మొహమాటంగా చెత్తబుట్టపాలు చేసింది ఇంటెల్‌. అదీ అన్‌లర్నింగ్‌ను ఆమోదించే విధానం. ఆ కఠిన నిర్ణయం కనుక తీసుకోకపోతే మొత్తంగా ఇంటెల్‌ మూత పడేదే. ఇలాంటిదే మరో ఉదాహరణ.. ఓ మొబైల్‌ తయారీ సంస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. అమ్మకాలు పడిపోయాయి. దీంతో సమస్య మూలాల్ని గుర్తించడానికి నిపుణుల బృందాన్ని నియమించారు. అయినా ఫలితం కనిపించలేదు. నేరుగా యజమానే రంగంలో దిగాడు. ఏసీ క్యాబిన్‌లోంచి బయటికొచ్చాడు. కస్టమర్‌ కేర్‌ విభాగంలో సాధారణ ఉద్యోగుల మధ్యన కూర్చున్నాడు. ప్రతి ఫోన్‌కాల్‌కూ స్పందించాడు. ‘మీ కంపెనీ ఫోన్లు అరచేతిలో ఇమడటం లేదు. ఇట్టే జారిపోతున్నాయి‘ అంటూ కస్టమర్లు గగ్గోలు పెట్టేవారు. వెంటనే ఆయన ఓ నిర్ణయాని కొచ్చాడు. డిజైన్‌ మార్పించాడు. దీంతో ఫిర్యాదులూ తగ్గిపోయాయి. సాక్షాత్తు అధినేతే క్యాబిన్‌ నుంచి కాల్‌ సెంటర్‌ వరకూ రావడం.. రీలర్నింగ్‌కు తిరుగులేని ఉదాహరణ.   

*           *          *

టెక్నాలజీ, నాయకత్వం.

ఈ రెండు విషయాల్లోనూ అన్‌లర్నింగ్‌, రీలర్నింగ్‌ మరింత అవసరం. సాంకేతికత, నాయకత్వ సూత్రాలు మహావేగంగా మారిపోతూ ఉంటాయి. గతంలో నాలెడ్జ్‌ అనేది నాయకుడి చేతిలో ఆయుధంలా ఉండేది. ఆ నైపుణ్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పేవాడు. ఇంటర్నెట్‌ యుగంలో సమాచారం ఓ సమస్యే కాదు. ఇప్పుడు కావలసింది కొత్త ఆలోచనలు. సరికొత్త  టెక్నాలజీని అన్వయించుకునే తెలివితేటలు. జనం నాడి పట్టుకోగల చురుకైన బుర్ర. మార్పును గుర్తించే గుణం. మార్పును అన్వయించుకునే తెలివితేటలు. ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ సంస్థ అయిన డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ‘ప్రతి ఇంటికి ఓ కంప్యూటర్‌’ అనే బిల్‌గేట్స్‌ నినాదాన్ని గేలి చేసింది. ‘అయినా, ఇంట్లో కంప్యూటర్‌ ఎందుకు?’ అని ఎదురుప్రశ్న వేసింది. ఆ కంపెనీ అధినేత కెన్‌ ఆల్సెన్‌ నేర్చుకోవడం ఆపేసిన ఫలితం ఇది. దీంతో, డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మరుగుజ్జులా మిగిలిపోయింది. లర్న్‌ .. అన్‌లర్న్‌.. రీలర్న్‌ తెలియని నాయకుడు.. అసమర్థుడి కంటే హానికరం, అవినీతిపరుడి కంటే ప్రమాదకరం.

క్షణక్షణముల్‌...

కొన్ని నైపుణ్యాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. సాంకేతికతను బట్టి సరికొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ మీద పట్టు సాధించామని మురిసిపోయేలోపే.. ఇంకేదో లాంగ్వేజ్‌ మార్కెట్‌లోకి వస్తుంది. మళ్లీ మనం అన్‌లర్న్‌ దిశగా అడుగులు వేయాలి. రీలర్న్‌కు సిద్ధపడాలి. అలాగే, డిజిటల్‌ స్కిల్స్‌ కూడా. కృతిమ మేధలోనూ వేగంగా మార్పులు వస్తున్నాయి. పాత నైపుణ్యాలను కొత్త నైపుణ్యాలు మింగేస్తున్నాయి. ప్రాథమిక విషయాలు మారకపోవచ్చు కానీ వైద్య రంగంలో కొత్త చికిత్సా విధానాలు వస్తు న్నాయి. రోబోటిక్‌ టెక్నాలజీ రోజుకో సంచలనాన్ని ఆవిష్కరిస్తోంది. నిరంతర అధ్యయనంతోనే ఇలాంటి మార్పులన్నీ ఒడిసిపట్టుకోగలం.

మెదడుకూ మంచిదే

రోజూ మనం తెలిసిన విషయాల గురించే ఆలోచిస్తాం. తెలిసిన పనులే చేస్తాం. తెలియని సమస్య ఎదురైనప్పుడు కూడా తెలిసిన పరిష్కారాలే ఎంచుకుంటాం. దీన్నే ‘ఆటోపైలట్‌ మోడ్‌’ అంటారు మానసిక నిపుణులు. ఆ మూస నుంచి బయటపడి లర్న్‌.. అన్‌లర్న్‌.. రీలర్న్‌ ప్రక్రియను అనుసరిస్తే.. సరికొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టే. ఏదో నేర్చుకునే ఉంటాం. పరిస్థితుల్ని బట్టి ఆ నేర్చుకున్నదేదో మర్చిపోతాం. ఇంకేదో కొత్తగా నేర్చుకుంటాం. దీనివల్ల మెదడు కొత్త సవాళ్లకు సిద్ధపడుతుంది. లక్ష్యాలకు తగినట్టు తన పనితీరును మార్చుకుంటుంది. ‘న్యూరోప్లాస్టిసిటీ‘ గొప్పతనమే ఇదంతా.

నెగెటివ్‌ ఎమోషన్స్‌నూ...

నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా సుదీర్ఘ జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో తనను తాను కొత్తగా తీర్చిదిద్దుకోడానికి ‘లర్న్‌.. అన్‌లర్న్‌.. రీలర్న్‌’ సూత్రాన్ని అనుసరించారు. ఆయన ముక్కోపి. అదే ఆయనకు రాజకీయ శత్రువులను తెచ్చిపెట్టింది. ఆత్మీయులను దూరం చేసింది. ఉద్యమ జీవితంలో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఊచల వెనుక నిలబడి ఆత్మశోధన మొదలు పెట్టారు. ఫీనిక్స్‌ పక్షిలా తనను తాను శిథిలం చేసుకుని.. ఆ బూడిదలోంచి సరికొత్తగా అవతరించాలని నిర్ణయించు కున్నారు. తక్షణమే కోపాన్ని వదులు కున్నారు. అన్‌లర్న్‌లో పాతబడిన జ్ఞానాన్నే కాదు.. మునుపటి అజ్ఞానాన్నీ, నెగెటివ్‌ ఎమోషన్స్‌నూ, నీడలా వెంటాడే భయాలనూ వదిలించుకుంటాం.

డ్రైవింగ్‌ లాంటిదే

అన్‌లర్నింగ్‌లో.. నేర్చుకున్నవన్నీ మర్చిపోం. ఏది, ఏ మేరకు అనవసరమో దాన్నే బుర్రలోంచి శాశ్వతంగా డిలీట్‌ చేస్తాం. మాన్యువల్‌ గేర్‌ నుంచి ఆటో గేర్‌కు మారడం లాంటిదే ఇదీ. అప్పటికే తెలిసిన డ్రైవింగ్‌. అంతకు ముందే పట్టుకున్న స్టీరింగ్‌. గేరు మాత్రం.. మాన్యువల్‌ పద్ధతిలో ఉండదు. ఆ స్థానాన్ని ఆటోమేటిక్‌ టెక్నాలజీ ఆక్రమిస్తుంది. దీనివల్ల డ్రైవింగ్‌ సులబం అవుతుంది. కాకపోతే, కొంత అసౌకర్యానికి గురవుతాం. అదంతా తాత్కాలికమే. సెల్‌ఫోన్‌లో కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి గందరగోళాన్నే అనుభవిస్తాం. క్రమంగా అలవాటు పడిపోతాం. ఎంత వేగంగా మార్పును ఆమోదిస్తే.. అంత మేలు!

రాజకీయాల్లోనూ...

రెప్పపాటు కాలంలో రాజకీయ పరిస్థితులు మారిపోతాయి. ఓటరు నాడిని అసలు పట్టుకోలేం. ఒక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థి.. ఐదేళ్లు తిరిగేసరికి అదే ప్రత్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోవచ్చు. కారణం లర్న్‌.. అన్‌లర్న్‌.. రీలర్న్‌ సూత్రాన్ని విస్మరించడమే. ఓ ఎన్నికల్లో ఉద్వేగాలు పనిచేస్తాయి. ఓ ఎన్నికల్లో అభివృద్ధి నినాదం పేలుతుంది. ఓ ఎన్నికల్లో ఇంకేవో సమీకరణలు జయాపజయాల్ని నిర్ణయిస్తాయి. కానీ కొందరు నేతలు మొదటిసారి తమను గట్టెక్కించిన వ్యూహాలనే మళ్లీ మళ్లీ ప్రయోగిస్తారు. పాతనే పట్టుకుని వేలాడటం ఒక తప్పు. కొత్తను అర్థంచేసుకునే ప్రయత్నమే లేకపోవడం మరో తప్పు. అందుకు మూల్యం ఐదేళ్ల అజ్ఞాతవాసం. అప్పటికీ రీలర్న్‌ విలువ తెలుసుకోకపోతే అంతే గతి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..