India's Richest Villages: ఈ ఊళ్లు చాలా రిచ్‌ గురూ!

పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశువులూ కోళ్లూ, వాకిట్లో ఎడ్లబండ్లూ మహా అంటే ఓ మోటార్‌ సైకిలూ, ఖాదీ బనీనూ పంచెతో ఏ అరుగుమీదో కూర్చుని కబుర్లు చెప్పుకునే రైతులూ...

Updated : 18 Jun 2023 09:06 IST

పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశువులూ కోళ్లూ, వాకిట్లో ఎడ్లబండ్లూ మహా అంటే ఓ మోటార్‌ సైకిలూ, ఖాదీ బనీనూ పంచెతో ఏ అరుగుమీదో కూర్చుని కబుర్లు చెప్పుకునే రైతులూ... ఇవే కదా ఎవరికైనా గుర్తొచ్చే దృశ్యాలు. అవేవీ కాకుండా అందమైన బంగళాలూ వాటి ముందు లాన్లూ పొలం వెళ్లి రావడానికి లగ్జరీ కార్లూ బ్రాండెడ్‌ దుస్తులు ధరించి చేతుల్లో ఐఫోన్లతో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉన్న కొడుకులతో మాట్లాడుతున్న రైతుల్నీ కాసేపు ఊహించుకోండి...‘ఊహదేముంది కానీ, అలా జరగడం అసాధ్యం’ అంటారా... అయితే మీకీ ఊళ్ల గురించి తెలియదన్నమాటే..! రండి... ఈ సూపర్‌ రిచ్‌ పల్లెల కథేమిటో చూద్దాం.


ఐఫోన్‌ పల్లె!

ఒకప్పుడు నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ని ఆదర్శగ్రామం అనేవారు. ఇప్పుడు మాత్రం ఐఫోన్‌ గ్రామం అంటున్నారు. అవును... ఆ ఊరివాసుల్లో సగానికి పైగా వాడేది ఆ ఫోనేనట. అంతేకాదు, ఆ ఊళ్లో అన్నీ రెండు మూడంతస్తుల అందమైన మేడలుంటాయి. ఆ మేడల ముందు ఒకటి రెండు లగ్జరీ కార్లు తప్పనిసరిగా ఉంటాయి. పొలం నుంచి కూరగాయలూ గడ్డీ లాంటివి కోసి తేవడానికి వాళ్లు వాడే కార్లు ఫార్చ్యూనర్‌, రేంజ్‌రోవర్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌... ఏదైనా కావచ్చు. ఎంత కారుంటే మాత్రం... అనకండి. సొంత పొలంలో పండిన పంటని తీసుకురావడం కన్నా మన కష్టార్జితంతో కొనుక్కున్న కారుకి సార్థకత ఏముందీ అని ఎదురు ప్రశ్నిస్తారు. ఒకప్పుడు ఒకే రోజున 110 మారుతి కార్లు కొనుక్కున్న చరిత్ర ఆ ఊరిది. కూలీలను కూడా కారులో తీసుకెళ్లి సాయంత్రం మళ్లీ తీసుకొచ్చి ఊళ్లో దించే పెద్ద మనసులు అక్కడి రైతులవి. అలాగని వాళ్లేమీ యాభయ్యో అరవయ్యో ఎకరాలు సాగు చేసే మోతుబరి రైతులూ కాదు, పండించేది బంగారమూ కాదు. మామూలు కూరగాయలూ పసుపూ మొక్కజొన్నా వరీ లాంటివి పండించే చిన్న రైతులే అందరూ. మరి ఇంత రిచ్‌గా ఉండడం ఎలా సాధ్యమైందీ అంటే- సమష్టి కృషి అన్నదొక్కటే సమాధానం.
అంకాపూర్‌ అభివృద్ధికి పునాది దాదాపు అర్ధ శతాబ్దం క్రితం పడింది. అప్పటివరకూ ఇదీ అన్ని గ్రామాల్లాగే ఉండేది. జాతీయ విత్తన సంస్థ సహకారంతో అప్పటి రైతులు కొందరు ప్రత్యామ్నాయ పంటలతో ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల్లో విజయం సాధించాలంటే ఊరంతా ఒక్కమాట మీద ఉండాలని భావించి గ్రామాభివృద్ధి సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. అన్నివర్గాలవారికీ ప్రాతినిధ్యం ఇచ్చే ఈ సంఘం ప్రధాన బాధ్యతలు- ఊరి సమస్యల్ని పరిష్కరించుకోవడం, ఆదాయమార్గాల్ని పెంచుకోవడం, ఊరి అభివృద్ధికి ఏం చేయాలో ఆలోచించడం. ఏ సమస్య అయినా వాళ్లే చర్చించి పరిష్కరించుకుంటారు. స్వయంకృషినే నమ్ముకున్నారు. ఆధునిక వ్యవసాయపద్ధతుల్ని అందిపుచ్చుకున్నారు. విత్తన ఉత్పత్తి, విత్తనశుద్ధి కేంద్రాల ఏర్పాటు... ఇలా వ్యవసాయంతో పాటు వ్యాపారంలోనూ రాణించారు. బ్యాంకులూ ఏటీయంలూ వచ్చాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కోట్లలోకి చేరాయి. ఇప్పుడు చుట్టుపక్కల ఏ మార్కెట్‌కి వెళ్లినా అంకాపూర్‌ కూరగాయలు కన్పిస్తాయి. అన్ని రాష్ట్రాలకూ ఇక్కడినుంచే టన్నుల కొద్దీ విత్తనాలు వెళ్తాయి. ఏడాది పొడుగునా పని ఉండడంతో వ్యవసాయ కూలీలు ఎక్కడెక్కడినుంచో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఆ ఊళ్లో వాళ్లు సొంత డబ్బుతో కట్టుకున్న గ్రామపంచాయతీ కార్యాలయమే కలెక్టరాఫీసు లెవెల్లో ఉంటుంది. ఇక్రిసాట్‌, అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల చేత ఆదర్శగ్రామం అనిపించుకున్న ‘అంకాపూర్‌’ ఇప్పుడొక బ్రాండ్‌. ఈ ప్రగతిశీల రైతుల పిల్లలందరూ పెద్దచదువులు చదివి ఇప్పుడు వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయా దేశాల నుంచి డాలర్లు ఇక్కడి బ్యాంకుల్లో జమవుతున్నాయి. ఒకప్పటి మిద్దె ఇళ్లు ఇప్పుడు రెండంతస్తుల మేడలయ్యాయి. ఐఫోన్లూ లగ్జరీ కార్లూ వాడుకలోకి వచ్చాయి. అలాగని వాళ్లు పనులేమీ మానుకోలేదు. ఎప్పటిలాగే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. కృషీ పట్టుదలా అనే తమ వారసత్వ సంపదని మరో తరానికి బదిలీ చేస్తున్నారు.

ఫొటోలు: శ్రీనివాస్‌


వేలకోట్లు... బ్యాంకుల్లో! 

పల్లెటూరే కానీ ఆ ఊళ్లో ఏ వీధిలో చూసినా ఓ జాతీయ బ్యాంకు శాఖ ఉంటుంది. సాధారణ రైతులుండే గ్రామాల్లో ఆ బ్యాంకుల్లో ఉద్యోగులకు పనేం ఉంటుందీ అనుకుంటే పొరపడినట్లే. ఇక్కడ నిత్యం  లక్షలూ కోట్లలోనే లావాదేవీలు జరుగుతాయి. ఇక, డిపాజిట్లు అయితే ఒక్కో బ్యాంకులోనూ వందల కోట్ల రూపాయలుంటాయి. అందుకే ప్రపంచంలోని సంపన్న గ్రామాల్లో అదీ ఒకటి అయింది. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో దాదాపు డజనుకు పైగా సంపన్న గ్రామాలున్నాయి. వాటన్నిటిలోనూ పలు జాతీయ బ్యాంకుల శాఖలున్నాయి. వాటిల్లో దాదాపు ఎనిమిది వేల కుటుంబాలున్న మాధాపూర్‌ ఆసియాలోనే సంపన్న గ్రామంగా పేరొందింది. బ్యాంకుల్లో ఉన్న
ఈ గ్రామస్తుల సొమ్ము ఐదువేల కోట్ల రూపాయలట. దాని పక్కనే ఉన్న కేరా గ్రామంలో 1900 కుటుంబాలకు రెండువేల కోట్లు ఉంటే, మరో పక్కన ఉన్న బలాడియా అనే చిన్న పల్లెలో 1300 ఇళ్లకు మరో రెండువేల కోట్లు ఉన్నాయట. ఈ మొత్తం నిధుల్లో సగానికి పైగా ప్రవాసుల నుంచి వచ్చినవేనట. అదెలా జరిగిందీ అంటే...సోలంకి రాజవంశానికి చెందిన మాధా కంజి సోలంకి పేరుమీదుగా ఏర్పాటైన గ్రామమిది. ఆ రాజవంశీయులే వందల ఏళ్ల క్రితం ఇక్కడ గుడులూ బడులూ చెరువులూ లాంటి మౌలిక వసతుల్ని ఏర్పాటుచేశారు. మంచి సారవంతమైన నేల కావడంతో మామిడి, ఖర్జూరం లాంటి పంటలు బాగా పండుతాయి. 1960వ దశకం నుంచి ఇక్కడి రైతులంతా సహకార సంఘంగా ఏర్పడి చేస్తున్న వ్యవసాయం సత్ఫలితాలనిచ్చింది. పంట దిగుబడిని ముంబయి తరలించి అమ్ముతున్నారు. హస్తకళాకారులూ ఎక్కువగానే ఉన్నారు. వారిలో చాలామంది సొంతంగా చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని పెద్ద ఫ్యాషన్‌ బ్రాండ్లకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. దాంతో ఈ గ్రామం అటు వ్యవసాయం, ఇటు వ్యాపారంతో నిత్యం సందడిగా ఉంటుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు పెద్దవాళ్లై అమెరికా, ఇంగ్లండ్‌, ఆఫ్రికా, గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నారు. అలా ఇక్కడినుంచి వెళ్లినవారు 1968లోనే లండన్‌లో ‘మాధాపూర్‌ విలేజ్‌ అసోసియేషన్‌’ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మాధాపూర్‌ వాసులందరినీ సంఘటితపరచడం ఈ సంఘం ఉద్దేశం. తాము ఎక్కడ ఉన్నా తమ సంపాదనని సొంతూళ్లోనే దాచుకోవాలన్న నియమం పెట్టుకుని ఏటా పెద్ద మొత్తంలో డబ్బుని తల్లిదండ్రులకు పంపుతుంటారట. కొన్నేళ్ల తర్వాత తిరిగి సొంతూరికి వచ్చి ఆ డబ్బుతో ఇక్కడ వ్యాపారాలు
ప్రారంభించినవారూ ఉన్నారు. ఈ పనులు సాఫీగా సాగడానికి సంఘం కార్యాలయం ఒకదాన్ని మాధాపూర్‌లో కూడా ఏర్పాటుచేశారు. దాంతో గ్రామస్థులందరూ ఇక్కడ తరచూ కలుసుకుంటూ ఉంటారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలున్న ఆస్పత్రి ఈ ఊళ్లో ఉంది. కొత్తగా తవ్విన చెరువులూ కట్టిన చెక్‌డ్యామ్‌లూ లాంటివాటి వల్ల ఏడాది పొడవునా మంచినీరు పుష్కలంగా లభిస్తుంది. పేరుకే గ్రామం కానీ ఎక్కడా గ్రామీణ వాతావరణం కన్పించదు. కాంక్రీటు భవనాలూ వాటి ముందు పెద్ద పెద్ద కార్లూ ఉంటాయి. ఊరి పెద్దలంతా బ్రాండెడ్‌, డిజైనర్‌ వాచీలు పెట్టుకుని, కస్టమైజ్‌డ్‌ స్మార్ట్‌ ఫోన్లు పట్టుకుని కూల్‌గా కాలక్షేపం చేస్తుంటారు.


ఇంటికొకరు... విదేశాల్లో!

ఊళ్ల నుంచి జిల్లా కేంద్రానికి బస్సులు నడపడం సాధారణం. కాస్త పెద్ద ఊరైతే అక్కడినుంచి విజయవాడకో, హైదరాబాద్‌కో కూడా బస్సులు నడుస్తుంటాయి. కానీ మామూలు పల్లెల నుంచి రోజూ పదికిపైగా బస్సులు బయల్దేరి నేరుగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి వస్తున్నాయంటే- అది కోనసీమలోని రెండు మండలాల వల్లే. సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లోని చాలా గ్రామాల్లో దాదాపుగా ప్రతి ఇంటినుంచీ ఒకరు విదేశాల్లో ఉన్నారు. దాంతో ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండడంవల్ల ఈ బస్సు సేవలు నిరవధికంగా నడుస్తున్నాయి. ఇంతమంది విదేశాలకు ఎలా వెళ్లారూ ఎందుకు వెళ్లారూ అంటే-  కొబ్బరితోటలూ పచ్చని ప్రకృతీ కోనసీమ ప్రత్యేకతలు. అయితే ఎంత గోదావరి పక్కనే ఉన్నా అక్కడా కొన్ని కొన్ని గ్రామాల్లో అధికశాతం కుటుంబాలు పేదరికం కోరల్లోనే ఉండేవి. రోజు కూలీలుగా చాలీచాలని సంపాదనతో బతుకులు వెళ్లదీసేవి. అలాంటిది వారిలో కొందరు ధైర్యం చేసి ఉపాధి వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్లడం మొదలెట్టారు. ఒకరిని చూసి ఒకరు వెళ్తూండడంతో దాదాపు గ్రామాలన్నిటికీ ఈ పద్ధతి పాకిపోయింది. ఒక తరం అంతా అలా కష్టపడి అక్కడ సంపాదించుకుంటూ ఇక్కడ పిల్లల్ని  చదివించుకున్నారు. కొందరు రెండో తరం కూడా అదే పని కొనసాగిస్తున్నారు. వీరంతా ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ఇప్పుడిప్పుడు ఇజ్రాయెల్‌ తదితర దేశాలకూ వెళ్తున్నారు. మరోపక్క ఉన్నత వర్గాల వారి పిల్లలేమో చదువులూ ఉద్యోగాల నిమిత్తం అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాలకు వెళ్తున్నారు. అలా ఈ ప్రాంతం ఇతర దేశాల్లోనూ బాగా పేరు తెచ్చుకుంది. ఇటునుంచి అటు వెళ్లిన వీరంతా అటునుంచి డబ్బు మాత్రమే కాదు విలాసవంతమైన సౌకర్యాలను కూడా వెంటతెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సఖినేటిపల్లి లంక గ్రామానికి వెళ్తే- అన్ని వీధుల్లోనూ పెద్ద పెద్ద ఇళ్లు కన్పిస్తాయి. విశాలమైన ప్రాంగణంలో ముందువైపు పచ్చని మొక్కలూ, మధ్య ఆధునికంగా కట్టిన ఇళ్ల లోపలికి వెళ్తే
ఏ కోటీశ్వరుడి భవనంలోనో ప్రవేశించామనిపించే కళాత్మక అలంకరణలు కన్పిస్తాయి. వాటిల్లో చాలావరకూ విదేశాలనుంచి తెచ్చినవే అయివుంటాయి. చాలా ఇళ్లలో అయితే పెద్దవాళ్లూ లేకపోతే పిల్లలూ ఉంటున్నారు. కొన్ని ఇళ్లయితే ఏడాదిలో ఎప్పుడో ఓసారి కుటుంబమంతా కలిసి ఉండడానికి మాత్రమే ఉపయోగిస్తారు. మిగతాసమయాల్లో ఖాళీగానే ఉంటాయి. మార్కెట్లోకి కొత్త బైక్‌ వస్తే అది తమ ఊళ్లో ఉండాల్సిందేనంటారు ఇక్కడివాళ్లు. అందుకే ఈ పల్లెల్లో సూపర్‌ మార్కెట్లతో పాటూ బైక్‌లూ కార్ల షోరూములు కూడా ఎక్కువే.

ఫొటోలు: రాజారమేశ్‌


ఆపిల్‌ తెచ్చిన అదృష్టం!

హిమాలయ సానువుల్లో ఉన్న ఆ కొండ ప్రాంతంలో కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా తెల్లటి పరదాల మాటున దాక్కుని ఉంటుంది ఒక ఊరు. దాని పేరు మడావగ్‌. ఇదీ పల్లెటూరే. చేసేదీ వ్యవసాయమే. కానీ
ఒక్కో కుటుంబం సాలీనా 75 లక్షల రూపాయల ఆదాయం పొందుతూ ‘సరిరారు మాకెవ్వరూ...’ అంటూ సంతోషంతో పొంగిపోతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని శిమ్లాకి 92 కి.మీ.దూరంలో కొండల్లో ఉంటుందీ ఊరు. సముద్రమట్టానికి ఎంత లేదన్నా 7700 అడుగుల ఎత్తు. అంతా కలిసి రెండువేల జనాభా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వరకూ శిమ్లా ఆపిల్స్‌కి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉండేది. దాంతో మొదట శిమ్లా, ఆ తర్వాత క్యారీ అనే మరో గ్రామమూ ఆపిల్‌ ఎగుమతులతో దేశంలో సంపన్నమైన గ్రామాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇది నలభై ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు ఎగుడుదిగుళ్లతో ఉండే మడావగ్‌లో ఆపిల్స్‌ ఎవరూ పండించేవారు కాదు. 1990ల్లో హీర్‌సింగ్‌ డోగ్రా అనే రైతు కోట్‌ఖాయ్‌ ప్రాంతంనుంచి కొన్ని ఆపిల్స్‌ తెచ్చాడు. ఆ గింజల్ని తన పొలంలో నాటితే చెట్లు ఏపుగా పెరిగాయి. మంచి పంట కూడా వచ్చింది. పండ్లను మార్కెట్‌లో అమ్మితే చాలా డబ్బొచ్చింది. కాయలు బాగున్నాయన్న పేరూ వచ్చింది. మొట్టమొదటిసారి ఆపిల్స్‌ కారణంగా ఆ రైతు కొన్ని వేల రూపాయలను ప్రతిఫలంగా పొంది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అది మొదలు... ఆ ఊరి వాళ్లందరి దృష్టీ ఆపిల్‌ మీద పడింది. ఒకరికొకరు అండగా నిలిచి ఏటికేడాది ఆపిల్‌ సాగును విస్తరిస్తూ పోయారు. సాగులోని కష్టసుఖాలను పంచుకుంటూ మంచి దిగుబడి సాధించేందుకు కృషిచేశారు. చలికాలంలో రేయింబగళ్లు కాపలా కాస్తూ చెట్లమీద పడిన మంచును ఎప్పటికప్పుడు తొలగించేవారు. ఎండాకాలంలో ఒక్కసారి వడగళ్లు పడితేచాలు పంట మొత్తం నాశనం అయిపోతుంది. అందుకని ఆపిల్‌ తోటల మీద పరదాలు కట్టి కంటిపాపల్లా కాపాడుకుంటున్నారు. ఫలితంగా ఇప్పుడు ఇక్కడ పండే పండ్లు సైజులో పెద్దగానూ రుచిగానూ ఉంటున్నాయి. దేశంలోనే అత్యంత నాణ్యమైన ఆపిల్‌ వెరైటీలు ఇక్కడ పండుతున్నాయి. విదేశాల్లో వీటికి మంచి డిమాండ్‌ లభిస్తుండడంతో మొత్తంగా పంటని ఎగుమతి చేస్తున్నారు. దాంతో పెద్దమొత్తంలో విదేశీ మారకాన్ని ఆర్జించి పెడుతూ ఆపిల్‌ పండ్లు ఈ ఊరిని దేశంలోని సంపన్నగ్రామాల్లో ఒకటిగా చేశాయి.


స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఒక పల్లె!

పల్లె అంటే పాడీ పంటా అనుకుంటాం కానీ ఫ్యాక్టరీలూ ఫైవ్‌స్టార్‌ హోటళ్లూ హెలికాప్టర్‌ ట్యాక్సీల గురించి ఊహించను కూడా లేము కదా. కానీ గ్రామమే ఒక కంపెనీగా గ్రామస్థులంతా అందులో షేర్‌హోల్డర్లుగా కోట్లు సంపాదిస్తున్న ఊరూ ఒకటుంది. అదే చైనాలోని హ్వాషీ. ప్రపంచంలోనే సంపన్న గ్రామం. పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలూ రెండున్నర వేల కోట్లతో కట్టిన ఆకాశాన్నంటే టవర్లతో హ్వాషీ గ్రామం ఓ పెద్ద నగరంలా కన్పిస్తుంది కానీ నిజానికి ఈ గ్రామవాసులు రెండువేలమందే. 20వేల మంది వలసకార్మికులు, మరో 30వేల మంది చుట్టుపక్కల గ్రామస్థులూ ఈ ఊళ్లో ఉన్న ఫ్యాక్టరీల్లో పనిచేస్తారు. వాళ్లంతా కూడా అక్కడి సౌకర్యాలను ఉచితంగా వాడుకోవచ్చు. అరవైఏళ్ల క్రితం వరకూ ఒక సాధారణ వ్యవసాయ గ్రామంగా ఉన్న హ్వాషీకి గ్రామాధికారిగా వచ్చిన వు రెన్‌బావో గ్రామస్థుల్నీ వాళ్ల ఆస్తుల్నీ సంఘటితపరిచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే వారిచేత నట్లు తయారుచేసే పరిశ్రమ పెట్టించాడు. అది బాగా లాభాలార్జించింది. ఆ డబ్బుతో టెక్స్‌టైల్‌, స్టీల్‌ లాంటి మరిన్ని పరిశ్రమలు పదుల సంఖ్యలో పెట్టి అందరూ కష్టపడి పనిచేసేలా చూశాడు. అక్కడ ఎవరూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోవడానికి వీల్లేదు. తమ ఆదాయాన్ని మళ్లీ అక్కడే పెట్టుబడిగా పెట్టాలి. ఎవరికైనా ఆ పద్ధతి నచ్చకపోతే అన్నీ వదిలేసి వెళ్లిపోవచ్చు. పట్టిందల్లా బంగారమైనట్లు సమష్టికృషి వేల కోట్లు సంపాదించిపెడుతోంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. గ్రామంలోని పరిశ్రమలన్నిటినీ కలిపి మల్టీ సెక్టార్‌ ఇండస్ట్రీ కంపెనీగా స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదుచేశారు. ఏటా వచ్చే ఆదాయంలో ఐదో వంతుని గ్రామస్థులంతా సమానంగా పంచుకుంటారు. అటు డబ్బుతో విలాసవంతమైన సౌకర్యాలను అనుభవిస్తూనే ఇటు కృషినీ కొనసాగిస్తూ వచ్చారు ఆ గ్రామప్రజలు. అక్కడ అందరికీ పెద్ద పెద్ద ఇళ్లూ లగ్జరీ కార్లూ ఉంటాయి. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్లాలంటే హెలికాప్టర్‌ ట్యాక్సీలుంటాయి. ప్రపంచంలో ఉన్న గొప్ప కళాఖండాలన్నిటికీ ప్రతిరూపాలను ఈ ఊళ్లో నిర్మించారు. అక్కడి ఫైవ్‌ స్టార్‌ హోటల్లో ఏకంగా ఒక బంగారపు ఎద్దునే ప్రతిష్ఠించుకున్నారు. అటు సేంద్రియ వ్యవసాయంతో ఇటు నిరంతరం పనిచేసే ఫ్యాక్టరీలతో సిరిసంపదలకు కేరాఫ్‌ అడ్రసుగా కనిపిస్తూ మహానగరాల్నే తలదన్నే ఈ సోషలిస్టు గ్రామాన్ని చూడడానికి ఏటా లక్షలాది సందర్శకులు వస్తుంటారట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..