ఆ సమయం మాకోసమే!

దీపికా పదుకొణె... పరిచయం అక్కర్లేని ఈ బాలీవుడ్‌ భామ... త్వరలో తెలుగు తెరమీదా సందడి చేయబోతోందనేది తెలిసిందే. ప్రభాస్‌ సరసన కల్కి 2898ఏడీ…లో నటిస్తున్న ఈ సొగసరి తనకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంటోందిలా...

Updated : 14 Apr 2024 09:11 IST

దీపికా పదుకొణె... పరిచయం అక్కర్లేని ఈ బాలీవుడ్‌ భామ... త్వరలో తెలుగు తెరమీదా సందడి చేయబోతోందనేది తెలిసిందే. ప్రభాస్‌ సరసన కల్కి 2898ఏడీ…లో నటిస్తున్న ఈ సొగసరి తనకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంటోందిలా...

ధ్యానం చేస్తా

ప్రతిరోజూ గోరువెచ్చని నీళ్లు తాగడంతో నా దినచర్య ప్రారంభమవుతుంది. ఆ తరువాత కాసేపు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ధ్యానం చేస్తా. అప్పుడే నాకు ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునే శక్తి వస్తుందని నమ్ముతా. 

ఆ రోజులు ఇంకా గుర్తే

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజులు నాకు ఇంకా జ్ఞాపకమే. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బోలెడు సవాళ్లుండేవి. నా రోజువారీ పనులు, వంట, ప్రయాణ ఏర్పాట్లు, దుస్తులు... ఇలా అన్నీ చూసుకుంటూ షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. ఒక్కోసారి ఏ రాత్రికో షూటింగ్‌ పూర్తయితే క్యాబ్‌లో ఇంటికి ఒంటరిగానే వచ్చేదాన్ని. ఆ అలసటతో క్యాబ్‌లోనే నిద్రపోయిన సందర్భాలూ ఉన్నాయి. అమ్మేమో నేను ఇంటికి క్షేమంగా చేరేవరకూ కంగారుపడేది. అయినా కూడా ఏ ఒక్క రోజూ నా పనుల్ని నేను భారమనుకోకుండా ఇష్టంగానే చేసుకునేదాన్ని. ఆ రోజుల్ని
తలచుకున్నప్పుడల్లా నాపైన నాకు ఇంకాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పిల్లల్ని మాలానే పెంచాలని...

అమ్మానాన్నలు నన్నూ, చెల్లినీ మొదటినుంచీ నిరాడంబరంగానే పెంచారు. నేను కూడా ఎన్ని సినిమాలు చేసినా నటనను కేవలం నా వృత్తిగానే భావిస్తా. ఇంట్లో సాధారణ దీపికలానే ఉండేంద]ుకు ప్రయత్నిస్తా. ఇప్పటికీ మా బంధువులు నేనస్సలు మారలేదనీ, సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నానో... ఇప్పుడూ అలానే ఉన్నాననీ అంటుంటారు. వాళ్లు కూడా నన్ను సెలబ్రిటీగా చూడరు. రణ్‌వీర్‌ కూడా అంతే - సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడతాడు. మాకు పుట్టబోయే పిల్లల్ని కూడా మాలానే పెంచాలనేది మా ఇద్దరి ఆలోచన.

సరదాగా డాన్స్‌...

షూటింగ్‌లూ, ఇతర పనుల కారణంగా నాకూ, రణ్‌వీర్‌కూ అస్సలు తీరిక దొరకదు. అందుకే ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే మాకు నచ్చిన పాటలు పెట్టుకుని డాన్స్‌ చేస్తాం. అలా డాన్స్‌ చేస్తూ తెల్లవారుజామున నాలుగుగంటల వరకూ గడిపిన రోజులు కూడా ఉన్నాయి.


తనపైన క్రష్‌...

నాకూ, మా చెల్లెలికీ చిన్నతనం నుంచీ లియోనార్డో డికాప్రియో పైన క్రష్‌ ఉండేది. ఆ ఇష్టంతోనే అతడి పోస్టర్లను వీలైనంత పెద్ద సైజులో గోడకి అతికించుకునేవాళ్లం. 


ఖాళీ దొరికితే...

హాయిగా విశ్రాంతి తీసుకుంటా. ఆ తరువాత ఇంటిపనులు చేస్తూ గడిపేస్తా. కుటుంబసభ్యులతోనూ, మరీ ముఖ్యమైనవారితోనూ తప్ప ఇతరులతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడను.


ఇష్టమైన టాలీవుడ్‌ హీరో మహేశ్‌బాబు


ఇప్పటికీ నవ్వుకుంటా

చిన్నప్పుడు నేనూ, నా ఫ్రెండ్సూ కలిసి గుడ్డుతో ఏదయినా వండాలనుకున్నాం. నాలుగు ఇటుకల్ని పేర్చి కర్రపుల్లల్ని తెచ్చి  మంటను వెలిగించాం. వంటకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. అయితే నేను మా ఇంటినుంచి తెచ్చిన గుడ్లు ఎక్కడ పెట్టానో కనిపించలేదు. అంతా వెతికి మళ్లీ తెస్తానని లేచానంతే. నా ఫ్రెండ్సంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఎందుకంటే నేను వాటిమీదే కూర్చున్నా మరి! అది తలచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. 


ఇష్టమైన పండుగ

హోలీ. చిన్నప్పుడు హోలీ వస్తోందంటే వారం ముందునుంచీ హడావుడి చేసే వాళ్లం. ఆ రోజున మా బిల్డింగ్‌లోనిఫ్రెండ్స్‌తో కలిసి రంగులు పూసుకోవడం, సరదాగా ఆడుకోవడం నాకు ఇంకా గుర్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..