పిల్లల కోసం మేము సైతం..!

ఏ ఇంట్లోనైనా పిల్లలే ప్రపంచం. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు పెద్దలు. అందుకే పిల్లల ఆటపాటల నుంచి అవసరాలూ, భద్రత కోసం వినూత్నమైన ఉత్పత్తులు తెచ్చారు వీళ్లు.

Updated : 14 May 2023 11:58 IST

ఏ ఇంట్లోనైనా పిల్లలే ప్రపంచం. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు పెద్దలు. అందుకే పిల్లల ఆటపాటల నుంచి అవసరాలూ, భద్రత కోసం వినూత్నమైన ఉత్పత్తులు తెచ్చారు వీళ్లు.


పాదాలతోపాటే పెరిగే షూ...

ఎదిగే పిల్లల కోసం షూ ఎంపికచేయడం పెద్ద సవాలు. మోడల్‌ నచ్చిందంటే, సైజు నప్పదు... సైజు కుదిరిందంటే... మోడల్‌ విషయంలో రాజీ తప్పదు. పిల్లలు పెరుగుతారు కదా అని... ఎప్పుడూ పెద్ద సైజువే తీసుకుంటారు. కానీ సరిగ్గా సరిపడని షూతో పాదాల ఆకారంలో సమస్యలు వస్తాయని గమనించాడు పుణెకు చెందిన సత్యజిత్‌ మిత్తల్‌. ‘పదేళ్లు వచ్చేంతవరకూ పిల్లలు వారికి సరిగ్గా సరిపోయే పాదరక్షలు వేసుకోవడం అరుదు. మూడేళ్లలోపు వరకూ పిల్లల్లో ప్రతి మూడు నెలలకూ పాదాల సైజులో మార్పు వస్తుంది. ఆ తర్వాత ఎదుగుదల కొద్దికొద్దిగా ఉంటుంది. వారికి 13 ఏళ్లు వచ్చేంతవరకూ ఈ సమస్య ఉంటుంది. ఆపైన పాదాల సైజులో మార్పు చాలా స్వల్పంగా ఉంటుంది’ అని చెబుతారు వ్యాపారిగా మారిన ఈ డిజైనర్‌. 2020లో పిల్లల పాదాల ఎదుగుదలపైన పరిశోధన చేస్తూ చాలామంది వైద్య నిపుణులతో మాట్లాడాడు. పాదాల అంచుల్లో సున్నితమైన నరాల నిర్మాణం ఉంటుంది... వాటికి అడ్డంకి ఉంటే సమస్యలు వస్తాయని గుర్తించాడు. రెండేళ్ల పరిశోధన తర్వాత పిల్లల పాదాల సైజుతోపాటు పెరిగే షూస్‌ని అభివృద్ధి చేసి... తన స్నేహితురాలు కృతికాలాల్‌తో కలిసి షూ తయారీ కంపెనీ ‘అరెట్టో’ను ప్రారంభించాడు. త్రీడీ నిట్టింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ షూస్‌ రూపొందిస్తున్నాడు. వీటికి 360 డిగ్రీల ఫ్లెక్సిబిలిటీ ఉండటంతోపాటు 18 మి.మీల వరకూ పెరుగుదల ఉంటుంది. అంటే కనీసం ఏడాదిపాటు ఉపయోగించ వచ్చన్నమాట. ధర రూ.1800- 2600 మధ్యఉంటుంది. ప్రారంభించిన తొమ్మిది నెలలకే ఆరువేల జతలు అమ్ముడయ్యాయి.


చిన్నారుల భద్రతకో వాచీ...

దిల్లీకి చెందిన స్మృతీ గోయల్‌ ఓరోజు తన అయిదేళ్ల చిన్నారిని తీసుకొని ఓ కార్నివాల్‌కు వెళ్లింది. రద్దీగా ఉందక్కడ. భయపడుతున్నట్టే కాసేపటి తర్వాత చేయిపట్టు తప్పి చిన్నారి కనిపించలేదు. అది రెండు నిమిషాలే... అంతలోనే ప్రపంచం తలకిందులైనట్టయిందామెకు. ‘చిన్నారి కనిపించింది సరే ఒకవేళ కనిపించకపోతే పరిస్థితి ఏంట’న్న ఆలోచన ఆమెను ఆందోళనకు గురిచేసేది. దేశంలో సగటున ఎనిమిది నిమిషాలకో చిన్నారి తప్పిపోతున్నట్టు నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. ‘మాకు ఇద్దరు అమ్మాయిలు. తర్వాత నుంచి వారిని చూసినప్పుడల్లా పిల్లల ఆచూకీ, భద్రత కోసం సాంకేతికతని ఉపయోగించి ఏదైనా చేయాలనుకున్నాం’ అంటారు స్మృతి. తర్వాత తన భర్త అమిత్‌తో కలిసి ‘సెక్యో’ అనే స్మార్ట్‌వాచ్‌ని తీసుకొచ్చారు. జీపీఎస్‌, లొకేషన్‌ ట్రాకింగ్‌ సదుపాయం దీన్లో ఉంది. దీనిద్వారా పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. అంతేకాదు వారితో సంభాషించవచ్చు కూడా. దీన్లో ప్రత్యేక సిమ్‌ ఉంటుంది. తల్లిదండ్రుల ఫోన్లో ఆప్‌ద్వారా సిమ్‌ పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫోన్‌లానూ పనిచేస్తుంది. లొకేషన్‌ ట్రాకింగ్‌, వాయిస్‌ కాల్‌(ముగ్గురికి మాత్రమే), స్కూల్‌ మోడ్‌, అత్యవసర(ఎస్‌ఓఎస్‌) బటన్‌ ఉంటాయి. ధర పెరిగే కొద్ది వీడియోకాల్‌ లాంటి మరికొన్ని ఫీచర్లూ తోడవుతాయి. ఇది వాటర్‌ప్రూఫ్‌ కూడా.


ఈ రంగులు హానిచేయవు...

పిల్లలకు కాస్త ఊహ వస్తే పెన్సిళ్లు, క్రేయాన్లు, పెయింట్లతో ఆటలు మొదలు పెడతారు. వాటిలో చాలా వరకూ రసాయనాలతో చేసినవే. అవెక్కడ నోట్లో పెట్టుకుంటారోనని అనుక్షణం భయమే. ఈతరం తల్లిదండ్రులకు ఆ ఆందోళన అవసరం లేకుండా సహజమైన రంగులూ, నూనెలతో ఉత్పత్తుల్ని తెస్తోంది బెంగళూరుకు చెందిన ‘డేబుల్‌’. నేహా బజాజ్‌, కరేన్‌ సల్దాన్హా దీని వ్యవస్థాపకులు. కరేన్‌ కార్పొరేట్‌ ఉద్యోగం చేయగా, నేహా యాడ్‌ ఫొటోగ్రాఫర్‌. ఇద్దరూ ఓ పెయింటింగ్‌ శిక్షణ కార్యక్రమంలో పరిచయమయ్యారు. పిల్లల కోసం పర్యావరణ హితమైన ఉత్పత్తుల్ని విదేశాల నుంచి తెప్పించుకునేవారు. ఆ విషయంపైన చర్చించుకుంటున్నప్పుడే అలాంటివాటిని ఇండియాలోనే తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. 2017 నుంచి ఫుడ్‌ టెక్నాలజిస్టులు, కెమిస్టుల సాయంతో వివిధ ఉత్పత్తులు అభివృద్ధి చేశారు. 2019 నుంచి మార్కెటింగ్‌ మొదలుపెట్టారు. ముడిపదార్థాల వివరాల్ని ప్యాక్‌ మీద అందిస్తూ తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తున్నారు. వీరి ఉత్పత్తుల్లో సహజ మైనం, నూనెలూ, రంగులతో చేసిన ఫింగర్‌ పెయింట్స్‌, క్రేయాన్స్‌, బ్రష్‌లు, మౌల్డ్‌లు, ఆర్ట్‌ కిట్స్‌... మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ ఆరేళ్లలోపు పిల్లలకోసం ఉద్దేశించినవి.‘ప్లే ఆర్ట్‌’ విభాగంలో వచ్చే క్రేయాన్లు జంతువులూ, కార్ల ఆకారాల్లో వస్తాయి. ఐఐఎమ్‌ బెంగళూరులో ఇంక్యుబేషన్‌కూ ఎంపికైంది డేబుల్‌. కర్ణాటక ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల గ్రాంటునీ పొందారు వీళ్లు. ఆకర్షణీయమైన ఉత్పత్తులు తెస్తూ పిల్లల స్క్రీన్‌ టైమ్‌ తగ్గించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు నేహా, కరేన్‌లు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..