ఈ ఊరి ఆదాయం ఏడాదికి రూ.50 కోట్లు

కాయకష్టం చేసే రైతులకు పిల్లనివ్వడానికి ఇప్పుడెవరూ అంత తొందరగా ముందుకు రావట్లేదు. మహారాష్ట్రలోని ధుమల్‌వాడీ వాసులకు ఆ సమస్య లేదు.

Updated : 21 Apr 2024 14:23 IST

కాయకష్టం చేసే రైతులకు పిల్లనివ్వడానికి ఇప్పుడెవరూ అంత తొందరగా ముందుకు రావట్లేదు. మహారాష్ట్రలోని ధుమల్‌వాడీ వాసులకు ఆ సమస్య లేదు. ఊళ్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకునే అక్కడి అబ్బాయిలను అల్లుళ్లుగా చేసుకోవడానికి పోటీ పడుతుంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు. ఒకప్పుడు దుర్భిక్షం రాజ్యమేలిన ఆ గ్రామంలో పండ్ల తోటలు కోట్లు కురిపిస్తుండటమే అందుకు కారణం. ‘పండ్ల గ్రామం’గా ప్రభుత్వ గుర్తింపు పొందిన ధుమల్‌వాడీని లక్షాధికారుల పల్లె అని కూడా పిలుస్తారు. కూలీనాలీ చేసుకుని బతికే పరిస్థితి నుంచి ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన ఆ గ్రామస్థుల కథ- మట్టి మనుషుల పట్టుదలకు ప్రత్యక్ష నిదర్శనం.

చ్చలహారాన్ని మెడకు అలంకరించినంత అందంగా ఉంటుంది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ధుమల్‌వాడీ. జాలువారే జలపాతాలూ, పచ్చని కొండకోనలూ చుట్టూ పరచుకుని ఉండటమే అందుకు కారణం. గ్రామంలోని ఇళ్లకీ, కొండ అంచులకీ నడుమన ఉన్న పొలాల్లో సీజన్‌కో రకం పండ్లు సాగవుతూ... ప్రతి రైతు ఇంటిముందరా రాశులు పోసి ఉంటాయి. భౌగోళిక పరిస్థితులూ, పచ్చదనం వల్ల ఆ ప్రాంతమే ఓ పర్యటక ప్రదేశం. దానికితోడు రైతులు తెచ్చిన పండ్ల విప్లవంతో మరికాస్త ప్రత్యేకతను సంతరించుకుంది ధుమల్‌వాడీ. ఒకప్పుడు పంటలు పండక రైతులే కూలీలుగా మారిపోయిన ఆ గ్రామానికి ఇప్పుడు చుట్టుపక్కల ఇరవై గ్రామాల నుంచి కూలీలు పనులు చేయ డానికి వస్తున్నారంటే ఆశ్చర్యమేస్తుంది కదా.
సుమారు 250 కుటుంబాలున్న ధుమల్‌వాడీలో కొన్నేళ్ల క్రితం మినుములూ, గోధుమలూ, జొన్నలూ సాగు చేసేవారు. నీటివనరులు పుష్కలంగా ఉన్నా భూసారం లేకపోవడం, చీడపీడల కారణంగా పంటలు సరిగా పండేవికావు. మరోవైపు పంటలకు సరైన ధర లేక రైతులు నష్టపోయేవారు. దాంతో కొంతకాలానికి కొందరు అన్నదాతలు వలసబాట పడితే, మరికొందరు సొంతూళ్లోనే కూలీలుగా మారారు. క్రమంగా ఊరంతా ఖాళీ అవుతుందేమోనని భయపడిన గ్రామపెద్దలు ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలని వ్యవసాయ శాస్త్రవేత్తల్ని సంప్రదించారు. భూసారాన్ని పెంచుకునే మార్గాలతోపాటు పండ్లతోటలకి తమ వాతావరణం అనుకూలమైందని తెలుసుకున్నారు. కానీ గ్రామంలోని వారందర్నీ ఒక్కతాటి మీదకు తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పండ్లతోటలు వేస్తే పెట్టుబడి భారీగా పెట్టాల్సి రావడంతోపాటు ఆదాయం అందుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని చాలామంది వెనకడుగు వేశారు. కొందరే పండ్ల తోటలు వేయడానికి ముందుకొచ్చారు. క్రమంగా పండ్ల సాగు చేసే వారు లాభాలు పొందడంతో  ఇతర రైతులూ స్పందించారు. ఒక రకం పంట వేస్తే ఒకే సీజన్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. అలా కాకుండా గ్రామస్థులు తమకున్న వెయ్యి ఎకరాల్లో ఇరవై రకాల పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. మామిడి, దానిమ్మ, సపోటా, సీతాఫలం, అరటి, డ్రాగన్‌ఫ్రూట్‌, అంజీర, నారింజ, కొబ్బరి, బొప్పాయి, నిమ్మ, జామ, ఉసిరి, ద్రాక్ష, పనస, కొబ్బరి తదితర తోటలను పెంచుకుంటూ ప్రతి సీజన్‌లోనూ ఆదాయం కళ్లజూస్తున్నారు. ఏడాది తిరిగే సరికి దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల ఆదాయం అందుతోంది ధుమల్‌వాడీ రైతులకు.

పొలం లేకున్నా సాగు...

పండ్ల తోటల మధ్యలో పశువులకు మేతా, ఇంటి అవసరాలకు కాయగూరలూ పండించుకుంటున్న గ్రామస్థులకు తమ పంటను మార్కెట్‌కు తరలించాల్సిన పని కూడా లేదు. ఆ పళ్ల రుచీ, నాణ్యత కారణంగా ముంబయి, పుణెతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, దిల్లీ, గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ధుమల్‌వాడీ పండ్లను పొలాల్లోనే కొనేసుకుంటున్నారు. గింజల్లేకుండా ఎంతో రుచిగా ఉండే ద్రాక్షని మాత్రం గ్రామస్థులు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. మరి ఆ గ్రామంలో పొలం ఉన్నవారి సంగతి సరే, లేని వారి పరిస్థితి ఏంటనే అనుమానం రావచ్చు. అయితే వారికీ తగినంత ఆదాయం రావాలని ధుమల్‌వాడీ గ్రామస్థులు ఓ పరిష్కార మార్గం కనిపెట్టారు. కాలవలూ, చెరువు గట్లపైన యాపిల్‌, లిచీ, మల్బరీ, స్టార్‌ఫ్రూట్‌, వాటర్‌ ఆపిల్‌ వంటివి నాటించి భూమిలేని వారూ ఆదాయం పొందేలా చూస్తున్నారు. నీటి వనరులు ఉన్నా... ఊరంతా బిందు సేద్యం చేస్తూ భూగర్భ జలాలను నిల్వ చేసుకుంటున్న రైతులు పండ్ల సాగుతోపాటు ఫామ్‌ టూర్లు కూడా ఏర్పాటు చేసి అదనంగా సంపాదించుకుంటున్నారు. లక్షాధికారులున్న ఆ గ్రామంలోని యువకులు ఉద్యోగాలకు దూర ప్రాంతాలకు వలసపోకుండా సొంతూళ్లోనే సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. లాభాల పంటలతో దూసుకుపోతున్న ఆ గ్రామంతో సంబంధం కలుపుకోవడానికి చుట్టుపక్కల వారు పోటీ పడుతున్నారంటే పడరా మరి...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..