పుస్తకం... మారింది బాసూ!

ఒకప్పుడు పుస్తకాన్ని హస్తభూషణం అనేవారు. అంటే- చేతికి ఆభరణంలాంటిదీ, అందాన్నిచ్చేదీ అని. ఇప్పుడా స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌ లాగేసుకుంది. అంతమాత్రాన పుస్తకాన్ని వదిలేసినట్టేనా..! లేదు, ఇప్పుడు పుస్తకం సర్వాంతర్యామి. కనిపించదు కానీ మన వెంటే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... చదవొచ్చు, వినొచ్చు, స్నేహితులతో చర్చించనూ వచ్చు!

Updated : 11 Feb 2024 09:07 IST

ఒకప్పుడు పుస్తకాన్ని హస్తభూషణం అనేవారు. అంటే- చేతికి ఆభరణంలాంటిదీ, అందాన్నిచ్చేదీ అని. ఇప్పుడా స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌ లాగేసుకుంది. అంతమాత్రాన పుస్తకాన్ని వదిలేసినట్టేనా..! లేదు, ఇప్పుడు పుస్తకం సర్వాంతర్యామి. కనిపించదు కానీ మన వెంటే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... చదవొచ్చు, వినొచ్చు, స్నేహితులతో చర్చించనూ వచ్చు! హస్తభూషణంగా మారిన ఆ స్మార్ట్‌ఫోనే ఇప్పుడు మన పర్సనల్‌ లైబ్రరీ కూడా!

‘బుక్‌ఫెయిర్‌కి వెళ్లారా’ పక్క ఫ్లాట్‌లో ఉండే కవితను అడిగింది లక్ష్మి.

‘ఇంకా లేదు, మీరు వెళ్లారా’ ఎదురు ప్రశ్నించింది కవిత.

‘నేను కొన్ని పుస్తకాలు కొనుక్కోవాలి. ఇవాళ సాయంత్రం వెళ్తాను’ చెప్పింది లక్ష్మి.

‘అయితే మీతో నేను కూడా వస్తాను. పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు ఏమైనా కొంటాను. లేకపోతే హోంవర్కు అవ్వగానే ఫోను తీసుకుని వీడియో గేమ్స్‌ ఆడుతున్నారు. అవునూ మీరేమీ అనుకోనంటే ఒక మాట అడగొచ్చా’ సంకోచిస్తూ ప్రశ్నించింది.

‘అడగండి, స్నేహితులం. మనమధ్య అనుకోవడం ఏముంది?’

‘మీరేమో ఏ కాస్త ఖాళీ దొరికినా పుస్తకాలు చదువుతుంటారు, మీ అబ్బాయీ అమ్మాయీ ఇద్దరూ ఆఫీసుకీ కాలేజీకీ వెళ్తూ వస్తూ ఎప్పుడూ చెవిలో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకునే ఉంటారు. ఇంట్లో చూసినా ట్యాబ్‌తోనో, ల్యాప్‌టాప్‌తోనో కన్పిస్తారు. పుస్తకం పట్టుకోగా చూడలేదు వాళ్లని’ అంది కవిత.

‘అదా మీ సందేహం. చదవడం వాళ్లకీ అలవాటే. నేను ప్రింటు పుస్తకాలు చదివితే వాళ్లిద్దరూ డిజిటల్‌ పుస్తకాలు చదువుతారు. ఆడియో బుక్స్‌ వింటారు. అందుకే ఎప్పుడూ చెవిలో ఇయర్‌ఫోన్స్‌తో ఉంటారు. రోజూ రాత్రి భోజనాలు కాగానే మా ఇంట్లో ఓ గంటసేపు పుస్తకాలపైనే చర్చ జరుగుతుంది’ చెప్పింది లక్ష్మి.

అది విని ఆశ్చర్యపోయింది కవిత. ఈ తరం పిల్లలు పుస్తకాలకు దూరమైపోతున్నారన్న తన అభిప్రాయం తప్పన్నమాట... అనుకుంది.

కవితే కాదు, చాలామంది అభిప్రాయమే అది. ‘ఈరోజుల్లో పుస్తకాలు చదివేది ఎవరూ’ అంటూ దీర్ఘం తీస్తారు. ‘అందుకే పుస్తకాల షాపులన్నీ మూతపడిపోతున్నాయి’ అని సమాధానపడతారు... అది నిజమే అయితే బుక్‌ఫెయిర్‌లతో పని ఉండేది కాదు, ప్రచురణ రంగమే అదృశ్యమయ్యేది. కానీ అలా జరగకపోగా, ఊరూరా నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనలకు మంచి స్పందన లభిస్తోంది. ఆన్‌లైన్‌లో పుస్తకాలు కొనడం పెరుగుతోంది. మరోపక్క ప్రచురణ రంగమూ కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్‌ వేదికల మీదికి పాఠకులను మళ్లించేందుకు రకరకాల ఆప్‌లూ అందుబాటులోకి వచ్చాయి.

పుస్తకాలను తెర మీద చదివే రోజు వస్తుందని సాంకేతిక నిపుణులు తొంభయ్యవ దశకంలోనే చెబితే చాలామంది నవ్వారు. పెద్ద కంప్యూటర్‌ ముందు కూర్చుని బ్లింక్‌ అవుతున్న కర్సర్‌ని కళ్లు చికిలించి చూడడాన్నే వాళ్లు ఊహించుకున్నారు కానీ హాయిగా మంచంమీద పడుకుని ఐప్యాడ్‌లోనో స్మార్ట్‌ఫోన్‌లోనో చదువుకోవడమనేది అప్పుడసలు ఊహకైనా అందని విషయం. కానీ ఇప్పుడో..!

2021 నుంచి 2026 వరకూ ఈ బుక్స్‌ మార్కెట్‌ ఏటా నాలుగు శాతం చొప్పున పెరుగుతోందంటోంది క్వార్ట్జ్‌ రీసెర్చ్‌ వారి అధ్యయనం. కొవిడ్‌ పరిణామాలకు తోడు ట్యాబ్లెట్‌, ఐప్యాడ్‌ల వాడకం పెరగడమూ పుస్తకాలకు సంబంధించి పలు ఆప్‌లు అందుబాటులోకి రావడమూ దీనికి కారణమని పేర్కొంటోంది. కిండిల్‌ ద్వారా ‘ఈ-బుక్‌’ల మార్కెట్‌లో మొదటినుంచీ అగ్రస్థానంలో ఉంటున్న అమెజాన్‌ 2021 తొలి త్రైమాసికంలో కేవలం ఈ-బుక్‌ల అమ్మకాల ద్వారా ఏకంగా 8,300 కోట్ల రూపాయలు సంపాదించిందట. ఈ ట్రెండ్‌ని గుర్తించిన ప్రధాన ప్రచురణ సంస్థలన్నీ ఈ-బుక్‌లవైపు దృష్టి సారించాయి.

మంచి వ్యసనం

ప్రపంచదేశాలతో పోలిస్తే- ఆసియావాసులు- అందులోనూ భారతీయులే పఠనాభిలాషులని తెలుస్తోంది. మన దేశంలో పుస్తకప్రియులు వారానికి సగటున 10 గంటల 42 నిమిషాలు పుస్తకాలతో గడుపుతున్నారట. థాయ్‌లాండ్‌ (9.24), చైనా(8) మన తర్వాత ఉండగా అమెరికా లాంటి దేశాలు మాత్రం చాలా వెనకబడి ఉన్నాయి.

అసలు పుస్తకాల్ని ఎందుకు చదువుతారూ అని ప్రశ్నిస్తూ ప్యూ రీసెర్చ్‌ వారు కొన్నేళ్ల క్రితం ఓ అధ్యయనం చేస్తే- వందమంది పాఠకుల్లో 26 మంది కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి చదువుతామన్నారట.

పదిహేను మంది సమస్యలన్నీ మర్చిపోయి ఊహల్లో విహరించడానికీ, పన్నెండుమంది వినోదానికీ, మరో పన్నెండుమంది మనశ్శాంతికీ చదువుతుండగా ఆరుగురు కాలక్షేపానికి చదువుతున్నామన్నారట. నలుగురు ఆధ్యాత్మికానందం కోసం, ముగ్గురు అలవాటు పెంచుకోవటానికీ చదివితే, ఇద్దరు మాత్రం కేవలం కొత్త పుస్తకాన్ని చేత్తో తాకి, ఆ వాసన పీల్చేందుకే పుస్తకాల్ని కొంటున్నామని చెప్పారట. మిగిలినవారంతా ‘చదవడం ఇష్టం, అదొక అలవాటు’- అన్నారట. అందుకే పుస్తక పఠనమూ వ్యసనమేనంటారు నిపుణులు. అసలు వ్యసనాలకు లోనయ్యేదే రకరకాల ఒత్తిళ్లను తట్టుకునేందుకు. కాబట్టి వ్యసనాల్లో మంచి వ్యసనం పుస్తకపఠనం... అని తేల్చారు. దీనివల్ల డబ్బు ఎక్కువగా ఖర్చవదు, సమయం వృథా కాదు, ఆరోగ్యానికీ మేలే... అంటున్నారు పరిశోధకులు. చదవడం వల్ల ఊహాశక్తీ పదసంపదా పెరగడం లాంటి వృత్తి ఉద్యోగాలకు పనికొచ్చే లాభాలే కాదు, వ్యక్తిత్వపరంగానూ మంచి మార్పులొస్తాయట. పుస్తకప్రియులు ఇతరుల మనసును తేలిగ్గా గ్రహించగలరట. పలు అధ్యయనాలు చెబుతున్నదాన్నిబట్టి చూస్తే...

  • దానధర్మాలు చేసేవారిలో ఎక్కువమంది పఠనాసక్తి కలవారు.
  • చదివే వారి పక్కింట్లో ఉన్నా లాభమే. 71 శాతం తోటివారికి సాయం చేస్తారు.
  • చదువరుల్లో విడాకుల శాతమూ తక్కువే.
  • పుస్తకప్రియులు ఆరోగ్యంగా ఉంటారు. పఠనాసక్తి ఏకాగ్రతనీ జ్ఞాపకశక్తినీ ఆలోచనల్లో వైవిధ్యాన్నీ పెంచుతుంది.
  • కుటుంబమంతా కలిసి భోజనం చేసినట్లే, కలిసి పుస్తకం చదివే అలవాటు కూడా చేసుకుంటే ఆనందంలో ఆ కుటుంబానికి ఎవరూ సాటిరారట. ఆ ఇంట పెరిగిన పిల్లలకు విలువలు తెలుస్తాయనీ చదువుల్లోనూ రాణిస్తారనీ తేలింది.

ఆసక్తి తగ్గలేదు... వింటున్నారు!

యువత మొబైల్‌కీ నెట్‌ఫ్లిక్స్‌కీ అతుక్కుని పోతున్నారన్నదాంట్లో నిజం లేదంటారు పెంగ్విన్‌ రాండమ్‌హౌస్‌ ఇండియా ప్రచురణకర్త అయిన మిలీ ఐశ్వర్య. ‘పఠనాసక్తిలో ఏ లోపమూ లేదు. చదువుతున్న సబ్జెక్టు(కాల్పనికేతర సాహిత్యం, విజయగాథలు)లోనూ, చదివే విధానం(పేపర్‌ బుక్స్‌, ఈ-బుక్స్‌, ఆడియో బుక్స్‌) లోనూ మార్పు వచ్చింది’ అంటారామె. నేటి మిలెనియల్స్‌ ఎప్పటికన్నా ఎక్కువే చదువుతున్నారనీ కాకపోతే ఒకప్పుడు రొమాంటిక్‌ పుస్తకాలు చదివితే ఇప్పటివారు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారనీ చెబుతారు ఐశ్వర్య. పైగా కాల్పనిక సాహిత్యంలో ఓ నవలో కథల పుస్తకమో అందరికీ నచ్చుతుందని గ్యారంటీ లేదు. కథావస్తువుని బట్టి ఏ కొందరికో మాత్రమే నచ్చుతుంది. నాన్‌ ఫిక్షన్‌కి ఆ ఇబ్బంది లేదు. అవి అందరికీ నచ్చుతాయి. అందుకే ప్రచురణకర్తలు కూడా వాటినే ప్రచురించడానికి ఇష్టపడుతున్నారట. 

విందు ఖరీదు లక్ష రూపాయలు!

ఇక, విధానం దగ్గరికి వస్తే- టెక్నాలజీని వాడుకోవడం తెలియాలే కానీ ఫోనునే పర్సనల్‌ లైబ్రరీగా మార్చుకోవచ్చంటున్నారు ఈతరం పబ్లిషర్స్‌. అందుకు తగినట్లుగా అన్ని భాషల్లోనూ ఆప్స్‌ వచ్చేశాయి. ప్రతి ఆప్‌లోనూ చదవడానికీ వినడానికీ బోలెడన్ని పుస్తకాలు ఉంటున్నాయి. కిండిల్‌, ఆడిబుల్‌, గూగుల్‌ ప్లే బుక్స్‌ లాగే తెలుగులోనూ దాసుభాషితం, చదువు, కుకుఎఫ్‌ఎం, పాకెట్‌ ఎఫ్‌ఎం... లాంటి ఆప్స్‌ ఎన్నో ఉన్నాయి. రామాయణ భారతాల నుంచి నేటి కథల వరకూ అన్నీ వాటిల్లో ఉంటున్నాయి. పాడ్‌కాస్ట్‌లలో కూడా నవలలూ కథలూ చదివి వినిపించేవారున్నారు. సినిమాలను కాణీ ఖర్చులేకుండా వెబ్‌సైట్లనుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని చూస్తున్నట్లే పుస్తకాలకీ బోలెడన్ని వెబ్‌సైట్లున్నాయి. వీటినుంచి ఉచితంగా పీడీఎఫ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోనులోనే చదువుకోవచ్చు. ఆడియో ఫార్మాట్‌లో లేని పీడీఎఫ్‌ పుస్తకాల్ని వినడానికీ ప్రత్యేకంగా ఏఐరీడర్‌, స్పీక్‌4మీ లాంటి ఆప్స్‌ ఉన్నాయి.

సినిమాలకు ఐఎండీబీ లాగా పుస్తకాల సమీక్షల కోసం పేరొందిన ఆప్‌ ‘గుడ్‌రీడ్స్‌’. కొత్త పుస్తకాల గురించి తెలుసుకోవడానికీ, చదివిన పుస్తకాల గురించి చర్చించుకోడానికీ చక్కటి వేదికగా పనికొచ్చే ఇలాంటి ఆప్స్‌ కూడా ఇప్పుడు చాలా వచ్చాయి.

ఏది మంచిదీ...

ప్రింటు పుస్తకమా... ఆడియో పుస్తకమా... ఏది మంచిదీ అన్న సందేహం సహజం.

ఇది ఆయా వ్యక్తుల అభిరుచులను బట్టి ఉంటుంది. కొందరికి పుస్తకాన్ని చేత్తో పట్టుకుని చదవడం ఇష్టం. ఈ-రీడర్‌ ఉంటే పుస్తకాల్ని మోసుకెళ్లాల్సిన పని ఉండదనీ ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోవచ్చనీ అనుకుంటారు ఇంకొందరు. సౌకర్యం సంగతి అలా ఉంచితే అలవాట్లూ, సామర్థ్యమూ కూడా ఏది ఎంచుకుంటే మంచిదో నిర్ధారిస్తాయి. కొందరికి విజువల్‌ మెమరీ ఉంటుంది. అచ్చులో చూసింది చూసినట్లుగా గుర్తుంచుకుంటారు. విన్నది అంతగా, గుర్తుండదు. అలాంటివారికి ప్రింటు పుస్తకాలే మంచిది. అయితే, అవి చదవాలంటే కచ్చితంగా సమయం కేటాయించాలి. పుస్తకాన్ని చేత్తో పట్టుకుని ప్రశాంతంగా కూర్చుని చదవాలి. అదే ఆడియో పుస్తకం అయితే ఏదో ఒక పనిచేస్తూ వింటారు కాబట్టి తక్కువ సమయంలో పుస్తకాన్ని పూర్తిచేయొచ్చు. ఆడియో పుస్తకాల వల్ల కాగితం ఖర్చు ఉండదు. పర్యావరణానికి నష్టం ఉండదు.
ప్రచురణ రంగమూ ఈ మార్పుల్ని అందిపుచ్చుకుంటోంది. క్రమేణా ప్రింటు పుస్తకాల సంఖ్య తగ్గిస్తోంది. ఒకప్పటిలా వెయ్యీ ఐదొందలూ పుస్తకాలు ప్రింట్‌ చేసి అటకెక్కించడం లేదు. ‘ప్రింట్‌ ఆన్‌ డిమాండ్‌’ విధానంలో ఆర్డర్‌ని బట్టి పుస్తకాన్ని ప్రింట్‌చేసి ఇస్తున్నారు. ప్రచురణ సంస్థల మీద ఆధారపడకుండా సొంతంగా ప్రచురించుకుని అమెజాన్‌, వాట్సాప్‌ల ద్వారా అమ్ముకోవడమూ పెరిగింది.

కొంటున్నారు..!

గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌, విజయవాడ లాంటి నగరాల్లోనే కాక పలు జిల్లా కేంద్రాల్లోనూ పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వాటికి మంచి ఆదరణ లభిస్తోందంటున్నారు బుక్‌ఫెయిర్‌ నిర్వాహకులు. దుకాణానికి వచ్చి కొనుక్కుంటారని వేచి చూడకుండా ప్రజల వద్దకు పుస్తకాలను తీసుకెళ్లే మార్గాలను ఆలోచించాలంటారు స్వయంగా ప్రచురణకర్తా బుక్‌ఫెయిర్‌ ఉపాధ్యక్షుడిగానూ ఉన్న చంద్రమోహన్‌. ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ బస్సులో ఊరూరా తిరుగుతూ ఇప్పటికీ విజయవంతంగా పుస్తకాలను విక్రయిస్తోందనీ, షాపుల్లో కన్నా ఆన్‌లైన్‌లోనూ  పుస్తకప్రదర్శనల్లోనూ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయనీ అంటారాయన. తెలుగు పుస్తకాలను ఆంగ్లంలోకి అనువదించడం కూడా ఎక్కువగా జరుగుతోందనీ ఆంగ్లమాధ్యమంలో చదువుతున్న పిల్లల్ని చేరడానికి ఇది మంచి అవకాశమనీ చెబుతున్నారు.

ఇవన్నీ చూస్తుంటే పుస్తకానికి డిమాండ్‌ పెరుగుతోందే కానీ తగ్గడం లేదన్నది వాస్తవం. కాబట్టి మీరూ ఓ పుస్తకాల పురుగుల గ్రూపులో చేరిపోయి చదువరులకు ఉండే ప్రయోజనాలను అందుకోవడమే ఆలస్యం మరి!

సామాజిక మాధ్యమాలూ... పుస్తకాలూ..!

పఠనాసక్తి కలవారికి సామాజిక మాధ్యమాలూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నది కాదనలేని సత్యం. కొత్త పుస్తకాల గురించి తెలుసుకోవడానికీ ఎప్పటినుంచో వెతుకుతున్న పాత పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని తెప్పించుకోవడానికీ, ఉచితంగా పీడీఎఫ్‌ రూపంలో ఉన్న పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసి చదువుకోవడానికీ, మంచి పుస్తకం గురించి చర్చించుకోడానికీ... ఈ వేదికలు తోడ్పడుతున్నాయి.

స్టార్‌ హోటలే మన హాస్టల్‌ అయితే?!

బుక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌: ఒకప్పుడు రచయిత్రి మాలతీ చందూర్‌ ప్రసిద్ధ ఆంగ్ల నవలల్ని చదివి వాటి సారాంశాన్నీ నేపథ్యాన్నీ వివరిస్తూ తెలుగు పత్రికల్లో పరిచయం చేసేవారు. ఆ శీర్షిక చదివిన చాలామంది ఆ తర్వాత ఆంగ్ల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్నీ అందుకు ఉపయోగించుకుంటున్నారు రచయితలూ పుస్తకాభిమానులూ. పుస్తకాల గురించి ఇలా రాయడం, చర్చించడం చేసేవారిని బుక్‌ఫ్లుయెన్సర్స్‌ అంటున్నారు.

బుక్‌స్టాగ్రామ్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న పుస్తక ప్రేమికుల కమ్యూనిటీ ఇది. ఇందులో మనం చదువుతున్న పుస్తకం ఫోటో తీసి పెడితే చాలు, అది చదివినవాళ్లూ, చదవాలనుకుంటున్న వాళ్లూ కనెక్ట్‌ అవుతారు. ఇద్దరు ముగ్గురు కలిసి ఒకేసారి బుక్‌ చదివి దాని గురించి చర్చించుకుంటారు. ప్రచురణకర్తలు కూడా ప్రచారం కోసం తమ కొత్త పుస్తకాలను ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు ఉచితంగా పంపిస్తుంటారు.

బుక్‌ట్యూబ్‌: యూట్యూబ్‌లో పుస్తకాల పురుగుల విభాగం ఇది. దృశ్య ప్రాధాన్యం ఉన్న మాధ్యమం కాబట్టి ఇక్కడ అభిమానులు కొత్త పుస్తకం పార్శెల్‌ విప్పి దాని గురించి పరిచయం చేసే వీడియోలూ, పుస్తకాన్ని చదివి సమీక్షంచే వీడియోలూ ఉంటాయి. కొందరు యూట్యూబర్లు తాము చదివిన పుస్తకాల సారాంశాన్నీ మంచి చెడులనూ క్లుప్తంగా వివరిస్తారు. రెండు మూడు వందల పేజీల పుస్తకం గురించి కొద్ది నిమిషాల్లోనే చెబుతారు కాబట్టి అది విని పుస్తకం ఆసక్తికరంగా ఉంటుందనుకుంటే కొనో లైబ్రరీ నుంచి తెచ్చుకునో మొత్తం పుస్తకం చదువుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాల గురించి తెలుసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ గ్రూపులు: ఫేస్‌బుక్‌లోనూ పుస్తకాభిమానుల గ్రూపులు ఎన్నో ఉన్నాయి. రచయితలూ, ప్రచురణ సంస్థలూ కూడా పుస్తకప్రియులతో నేరుగా మాట్లాడుకునే అవకాశం ఇక్కడ ఉంది.

పీడీఎఫ్‌ల నిధి: టెలిగ్రామ్‌ ఆప్‌లోకి వెళ్లి పుస్తకాల గ్రూపుల్లో వెతికితే దొరకని పుస్తకం ఉండదు. పాత, అరుదైన, ప్రింట్‌లో లేని పుస్తకాల పీడీఎఫ్‌లను కూడా ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇలాగే టిక్‌టాక్‌లో బుక్‌టాక్‌ ఉంటుంది. పుస్తకాల బ్లాగుల సంగతి తెలిసిందే. నేటి రచయితల్లో కొందరు బ్లాగులు రాస్తూ కథలూ నవలలూ రాసే స్థాయికి ఎదిగినవారే. చదివిన పుస్తకాలను ఇతరులతో ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు... మంచి గొంతు ఉంటే పుస్తకాలు చదివి వినిపించే అవకాశమూ ఉందిక్కడ. సినిమాల్లో డబ్బింగ్‌ లాగా ఆడియో బుక్స్‌కి గొంతు అరువిచ్చే కెరీర్‌ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.

మీకు తెలుసా?

  • పుస్తకాలు చదివితే జ్ఞానంతో పాటు అదనంగా మరెన్నో లాభాలున్నాయంటున్నాయి అధ్యయనాలు.
  • మనకి ఇష్టమైన రంగానికి సంబంధించిన పుస్తకాలను రోజుకు గంటపాటు చదివితే ఐదేళ్లలో ఆ రంగంలో అంతర్జాతీయస్థాయి నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవచ్చట.
  • సగటు పాఠకుడు ఏడాదికి 33 పుస్తకాలు చదవగలడనీ, కాస్త వేగంగా చదివేవారు 55 చదువుతారనీ గణాంకాలు చెబుతున్నాయి.
  • చరిత్ర, మిస్టరీ, జీవితచర్రితలు ఎక్కువగా చదువుతున్నారు. పాపులర్‌ సైన్స్‌, సైన్స్‌ ఫిక్షన్‌ చ దివేవాళ్లు తక్కువే.
  • పురుషులకన్నా మహిళలే ఎక్కువ చదువుతున్నారు.
  • సంపన్నులు రోజూ అరగంటైనా వ్యక్తిగత అభివృద్దికి సంబంధించిన పుస్తకాలు చదువుతారట.
  • చిన్న పిల్లలచేత కథల పుస్తకాల్లాంటివి రోజూ కనీసం ఆరు నిమిషాలు చదివిస్తే చాలట- అది వాళ్ల జీవితంమీద గొప్ప ప్రభావం చూపుతుందట.
  • ఒత్తిడిని జయించడంలో పుస్తక పఠనం... సంగీతంకన్నా 70శాతం ఎక్కువగా, టీకన్నా రెండింతలు, వీడియో గేమ్స్‌ కన్నా ఆరు రెట్లు బాగా పనిచేస్తుందట. ఆరునిమిషాల పాటు ఒక మంచి పుస్తకం చదివితే ఒత్తిడి అరవై శాతం తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
  • వృద్ధాప్యంలో డిమెన్షియా ఆల్జీమర్స్‌లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

తరం మారింది... తల్లిదండ్రులూ మారాలి!

కథల పుస్తకాలు కొనమని పిల్లలు అడిగితే ఎలాంటి పుస్తకాలు కొంటారు? బీర్బల్‌ కథలు, తెనాలి రామలింగడి కథలు, పంచతంత్ర... చిన్నప్పుడు మీరు చదివినవాటి మీదికే వెళ్లిపోతుంది కదా చెయ్యి. దేశంలోనూ ఆ మాటకొస్తే ప్రపంచంలోనూ కూడా తల్లిదండ్రుల్లో మూడింట రెండొంతుల మంది అదే చేస్తున్నారట. తాము బాల్యంలో చదివిన పుస్తకాల్నే పిల్లలకీ కొనేస్తున్నారట కానీ కాలం మారిందనీ పరిస్థితులు మారుతున్నాయనీ గుర్తించడం లేదంటోంది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ చేపట్టిన అధ్యయనం. వాటిని చదివించడంలో తప్పులేదు కానీ మారుతున్న సమాజానికి తగ్గట్టు పిల్లలకు కొత్త కథల్నీ పరిచయం చేయాలంటున్నారు నిపుణులు. ఇప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించే కథలైతే సున్నితమైన విషయాల్లో పిల్లలకు చెప్పాలనుకునే మాటల్ని పరోక్షంగా చెప్పడానికి వీలవుతుంది. పెద్దలూ పిల్లలూ కలిసి ఇలా భిన్న అంశాలకు సంబంధించిన కథలు చదువుకునేటప్పుడు కొన్ని కథలు అందరికీ నచ్చుతాయి. వాటి గురించి తరచూ గుర్తుచేసుకుంటారు. ఇవి పిల్లలు పెద్దయ్యాక కూడా మంచి జ్ఞాపకాలుగా మిగులుతాయి. కుటుంబసభ్యుల మధ్య బంధం బలపడుతుంది... అంటున్నారు నిపుణులు. నిజమే కానీ, అసలు పిల్లలకు చదివే అలవాటు చేయడమెలా అన్నది ఈతరం తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ప్రశ్న. అందుకు నిపుణులు ఏం చెబుతున్నారంటే- పిల్లలు చూసి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు చదువుతూ కన్పించాలి. వారికి కనపడేలా
పుస్తకాలను ఉంచాలి. కథల్ని చదివి వినిపించాలి. మెల్లగా చిన్న చిన్న కథలు చదవడం నేర్పించాలి. ఎనిమిది, తొమ్మిదేళ్లు వచ్చేసరికి చదవడం అలవాటైపోయి ఏదైనా చదివేందుకు సిద్ధంగా ఉంటారు. వాళ్ల వయసుకు తగిన పుస్తకాలు కొని అందుబాటులో ఉంచాలి.
ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు పొరపాటు చేస్తుంటారు. కథల పుస్తకాల మీద పెట్టే సమయం స్కూలు పుస్తకాల మీదే పెడితే ఇంకా మంచి మార్కులు వస్తాయంటారు. పిల్లల ఊహాశక్తికి సంకెళ్లు వేసే ఆ పొరపాటు చేయవద్దంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..