పెళ్లి ఆటంకాలు తొలగుతాయి!

ఆదిదంపతులుగా పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తాం. ఆ శివపార్వతులే భక్తులకు ఎదురయ్యే పెళ్లి ఆటంకాలను తొలగించి త్వరగా వివాహాన్ని కుదిర్చేందుకు కొలువుదీరిన ప్రాంతమే ‘తిరుమనంజేరి’ ఆలయం. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారూ, పెళ్లి కుదరడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారూ, వైవాహిక జీవితంలో సమస్యలున్నవారూ, సంతానం లేనివారూ ఎక్కువగా దర్శించుకునే ఈ ఆలయాన్ని ఓ రాణి నిర్మించడం విశేషం.

Published : 30 Mar 2024 23:26 IST

ఆదిదంపతులుగా పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తాం. ఆ శివపార్వతులే భక్తులకు ఎదురయ్యే పెళ్లి ఆటంకాలను తొలగించి త్వరగా వివాహాన్ని కుదిర్చేందుకు కొలువుదీరిన ప్రాంతమే ‘తిరుమనంజేరి’ ఆలయం. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారూ, పెళ్లి కుదరడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారూ, వైవాహిక జీవితంలో సమస్యలున్నవారూ, సంతానం లేనివారూ ఎక్కువగా దర్శించుకునే ఈ ఆలయాన్ని ఓ రాణి నిర్మించడం విశేషం.

తిరుమనమ్‌ అంటే పెళ్లి అనీ... చేరి అంటే ఊరు అనీ అర్థం. తమిళనాడు, కుంభకోణంలోని మైలాడుతురైలో కావేరీ నది ఒడ్డున ఉండే తిరుమనంజేరి అనే ఊళ్లో శివపార్వతులు కల్యాణ సుందరేశ్వరర్‌, కోకిలాంబాళ్‌గా కొలువుదీరి పూజలందుకుంటున్నారు. ఆకట్టుకునే నిర్మాణంతో కనిపించే ఈ గుడిలో ఆదిదంపతుల పాణిగ్రహణ భంగిమను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అవివాహితులు ఎక్కువగా వచ్చే ఈ ఆలయానికి వెయ్యికి పైగా సంవత్సరాల చరిత్ర ఉంది.

స్థలపురాణం

ఈ ఆలయంలో పార్వతీపరమేశ్వరులు కొలువుతీరడం వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. ఓసారి ఆదిదంపతులు సరదాగా పాచికలు ఆడుతున్నారట. తాను ఓడిపోకూడదనే ఉద్దేశంతో స్వామి ఆట మధ్యలో అమ్మవారిని గోవుగా మార్చేసి భూలోకానికి పంపించేశాడట. అయితే తాను చేసిన పొరపాటును గ్రహించి మహావిష్ణువుతో విషయం చెప్పి.. పార్వతీదేవికి శాపవిమోచనాన్ని కలిగించమంటూ అభ్యర్థించాడట. దాంతో విష్ణుమూర్తి గోవుల కాపరిగా మారిపోయి పార్వతీదేవిని కాపాడటం మొదలుపెట్టి చివరకు శాప విమోచనాన్ని కలిగించాడట. ఆ తరువాత అమ్మవారు ఈ ప్రాంతంలోనే భరతమునికి కూతురిగా జన్మించింది. ఆ ముని ఇక్కడే అమ్మవారికి స్వామితో కల్యాణాన్ని జరిపించాడనీ అలా ఈ ఊరు తిరుమనంజేరిగా ప్రసిద్ధి పొందిందనీ కథనం. అదే విధంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరుగుతున్నప్పుడు కైలాసం దేవతలతో కిక్కిరిసిపోయిందట. దాంతో స్వామి అగస్త్యమునితో... దక్షిణభారత దేశంలో భక్తుల కోసం ఓ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. అలా అగస్త్యుడు ఇక్కడకు వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే కథనమూ ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సందర్భంలో... పార్వతీదేవి పరమేశ్వరుడితో తనకు భూలోకంలోనూ కల్యాణం చేసుకోవాలని ఉందని చెప్పడం, స్వామి అంగీకరించడంతో... దేవి భరతముని కూతురిగా జన్మించిందనీ.. ఆ మునే శివపార్వతుల వివాహం చేశాడనీ అంటారు. అలా కొలువుదీరిన స్వామికి చోళ రాణి అయిన సెంబియన్‌మాదేవి ఆలయాన్ని కట్టించిందని ప్రతీతి.

ఎవరు ఎక్కువగా వస్తారంటే...

ఆలయంలోకి ప్రవేశించే భక్తులు మొదట.. సెల్వగణపతిని దర్శించుకుంటారు. అదయ్యాక కల్యాణసుందరేశ్వరర్‌గా, ఉధ్వగనాథర్‌గా పిలిచే పరమేశ్వరుడిని పూజించాక.. కోకిలాంబాళ్‌గా కొలువుదీరిన జగన్మాత మందిరానికి వెళ్తారు.

ఆ తరువాత పాణిగ్రహణ భంగిమలో ఉండే ఆదిదంపతుల్ని దర్శించుకుంటారు. అప్పుడప్పుడే తమ పిల్లలకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టినవాళ్లకూ, రకరకాల కారణాల వల్ల పెళ్లి ఆలస్యం అవుతున్నవాళ్లకూ ఈ మందిరంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా దేవతలకు వేసిన దండలను తీసి భక్తులకు ఇస్తారు. ఆ హారాల్ని ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచి పెళ్లయ్యాక నవదంపతులుగా మళ్లీ ఆ దండలతో తిరిగొచ్చి.. పూజలు చేయించుకోవాలని చెబుతారు అర్చకులు. అలాగే సంతానం లేనివాళ్లు కూడా పౌర్ణమి తిథుల్లో ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఇక, వైవాహిక బంధంలో సమస్యలున్నవారూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవి తొలగిపోతాయనీ.. అలా వచ్చే జంటలూ ఎక్కువేనని అంటారు ఆలయ నిర్వాహకులు. చైత్రమాసంలో ప్రత్యేక ఉత్సవాలనూ; నవరాత్రులు, శివరాత్రి, కార్తికంలో విశేష పూజాదికాలనూ నిర్వహించడాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఎలా చేరుకోవచ్చు

ఈ క్షేత్రానికి విమానంలో వెళ్లాలనుకునేవారు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. అక్కడినుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైల్లో అయితే... మైలాడుతురై లేదా కుంభకోణం రైల్వేస్టేషన్లలో దిగితే బస్సులూ, ఆటోలూ ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..