భాగ్యవంతుడు...బాలకృష్ణుడు!

నిధినిక్షేపాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి నేలమాళిగే గుర్తుకొస్తుంది. ఆ మాటకొస్తే, కర్ణాటకలోని ఉడుపిలో కొలువైన బాలకృష్ణుడు కూడా సిరిగల దేవుడే.

Updated : 14 Apr 2024 08:07 IST

నిధినిక్షేపాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి నేలమాళిగే గుర్తుకొస్తుంది. ఆ మాటకొస్తే, కర్ణాటకలోని ఉడుపిలో కొలువైన బాలకృష్ణుడు కూడా సిరిగల దేవుడే. తరాల క్రితం.. మఠం ఆవరణలోని నాగేంద్రుడి విగ్రహం కింద టన్నులకొద్దీ బంగారాన్నీ, వజ్ర వైడూర్యాలనూ భద్రపరిచినట్టు తెలుస్తోంది. అవన్నీ ఓ దిల్లీ సుల్తాను కానుకలని చెబుతారు.

ష్టమఠాలతో అలరారే ఉడుపి.. కృష్ణదేవుడి ఇష్టనగరి. ఇక్కడ బ్రహ్మ జనకుడైన స్వామి ముద్దులొలికే బాలకుడై పూజలందుకుంటాడు. ఒంటిచేత్తో క్షీరసాగర మథనం జరిపించిన జగన్మోహనుడు చేతిలో కవ్వంతో, నడుము చుట్టూ మువ్వల మొలతాడుతో దర్శనమిస్తాడు. చిరునవ్వుల కృష్ణచంద్రుడు తేజస్సులో కోటి సూర్యులకు సరిసాటి. వెన్నముద్దలూ పాలబువ్వలూ ఆయనకు నిత్య నైవేద్యాలు. ద్వైత గురువు మధ్వాచార్యులు ఇక్కడి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ద్వాపరయుగంలో.. రుక్మిణీ దేవి కోరిక మేరకు దేవశిల్పి విశ్వకర్మ ఈ ప్రతిమకు ప్రాణంపోశాడని ఐతిహ్యం. ద్వారకలో జల ప్రళయం తర్వాత.. సముద్రం పాలైన విగ్రహం పదమూడో శతాబ్దంలో మధ్వాచార్యులకు దొరికిందని చెబుతారు. స్వామి దర్శనం తర్వాత మఠంలోంచి బయటికి వస్తున్నప్పుడు.. ఆవరణలోని నాగప్రతిష్ఠ మనల్ని ఆకట్టుకుంటుంది. అందులోనూ, ఉపాలయ గోడలపై చెక్కిన ఓ గాథ ఆసక్తికరంగా అనిపిస్తుంది. పదహారో శతాబ్దంలో వాదిరాజ తీర్థులు పీఠాధిపతిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఇది.

సుల్తానుల కానుక..

వాదిరాజ తీర్థులు.. మహాపండితులు. వాదనలో దిట్ట. ఆసేతుహిమాచలం పర్యటించి.. కృష్ణతత్వాన్ని ప్రచారం చేశారు. ఉత్తరభారత యాత్రలో భాగంగా ఓసారి హస్తిన శివార్లకు చేరుకున్నారు. యమునలో స్నానాదికాలు పూర్తిచేసుకుని.. ఉడుపి మఠం పట్టపుదేవుడు భూవరాహ స్వామి పూజకు ఉపక్రమించారు. అది చూసిన రాజభటులు పరుగుపరుగున వచ్చారు.

సోలార్ తో అదనపు ఆదాయం ఎలా పొందాలో తెలుసా?

‘మా సుల్తాను తనయుడి సమాధి ఇది. ఇక్కడ పూజలు నిషిద్ధం. వెంటనే ఖాళీ చేయండి’ అంటూ వాదిరాజుల శిష్యులతో గొడవకు దిగారు. విషయం గురువుల వరకూ వెళ్లింది. ‘ఇక్కడ ఎలాంటి సమాధీ లేదు. పాపం ఎవరో పసిబిడ్డ, మట్టిలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు’ అని భటులతో చెప్పారు. ఆ సమాధానం వారిని ఆశ్చర్యపరిచింది. వెంటనే వెళ్లి సుల్తానుకు విన్నవించారు. పుట్టెడు పుత్రశోకంలో ఉన్న ఆ పాలకుడు పరుగుపరుగున వచ్చాడు. వాదిరాజుల ఆదేశం ప్రకారం.. పూజలు నిర్వహించిన చోట గునపంతో తవ్వించాడు. అప్పుడే, నిద్రలోంచి లేచినట్టు.. కళ్లు నులుపుకుంటూ పైకి వచ్చాడు సమాధిలోని బాలుడు. సుల్తాను ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘మీ మహోపకారం మరువలేనిది. రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి’ అని వాదిరాజులను వేడు కున్నాడు. ‘అయితే, ఒకపని చేయండి. ఉడుపి బాలకృష్ణుడి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించాలని సంకల్పించాం. ఆ దైవ కార్యానికి సహకరించండి’ అని దిల్లీ సుల్తానుకు సూచించి ముందుకు కదిలారు స్వామీజీ.

సకల సంపదలతో..

తిరుగు ప్రయాణంలో వాదిరాజుల పల్లకి వెనకాలే.. అపార సంపదలతో సుల్తాను సైనిక బలగాలూ బయల్దేరాయి. యతీంద్రులకు ఉడుపిలో మేళతాళాలతో స్వాగతం లభించింది. ఆ రాత్రి ఆయనకు బాలకృష్ణుడి స్వప్నసాక్షాత్కారం లభించింది.  గోపురానికి స్వర్ణతాపడం చేయించడం తనకు ఇష్టం లేదని స్పష్టంచేశాడు కృష్ణస్వామి. దీంతో ఆ సంపదనంతా ఏం చేయాలో తోచలేదు వాదిరాజ తీర్థులకు. ఆలయ ఆవరణలోనే ఓ నేలమాళిగ తవ్వించి.. అందులో భద్రపరిచారు. దానిపై నాగేంద్రుడిని ప్రతిష్ఠించారు. ‘కృష్ణమఠంలో నిత్యాన్నదాన సేవకు నిధుల కొరత ఏర్పడినప్పుడు మాత్రమే ఈ సంపదను తవ్వితీయాలి’ అని షరతు విధించారు. ఇప్పటి వరకూ ఉడుపి మఠానికి నిధుల కొరతే రాలేదు. కానుకలు సమర్పించిన సుల్తాను పేరూ, వజ్ర వైడూర్యాల వివరాలూ ఎక్కడా నమోదు చేయకపోయినా.. వాటి విలువ వందల కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా. విజయనగర ప్రభువు అచ్యుత రాయలు సైతం బాలకృష్ణుడికి అపార సంపదలను సమర్పించారని ఓ కథనం. వీటికితోడు నందనందనుడికి నిత్యం అలంకరించే.. శోభన, రత్నముఖి, హంసగంజన, తారావళి తదితర భరణాలూ అమూల్యమైనవే. అలనాటి మైసూరు మహారాజుల చదివింపులు కూడా ఎంతో విలువైనవి. కుచేలుడు తెచ్చిన గుప్పెడు అటుకులను మక్కువతో ఆరగించిన పరమాత్మ.. సంపదల కంటే శరణాగతినే ఇష్టపడతాడు. నిజానికి, ఉడుపిలోని అసలైన నిధి.. ఆ దయానిధే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..