తోడు

నాకు రైలు ప్రయాణంలో ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది. దాన్ని పైకి తీశాను. అందులో కొద్దిపాటి చిల్లర నోట్లూ ఒక కృష్ణుడి ఫొటో తప్ప ఏమీ లేవు.

Published : 21 Jan 2023 23:29 IST

తోడు

నాకు రైలు ప్రయాణంలో ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది. దాన్ని పైకి తీశాను. అందులో కొద్దిపాటి చిల్లర నోట్లూ ఒక కృష్ణుడి ఫొటో తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు. ఎలా తిరిగి ఇవ్వడం?

‘‘ఈ పర్సు ఎవరిదండీ?’’ అంటూ అడిగా.

అందరూ పర్సుకేసి చూశారు, తమ జేబులూ తడుముకున్నారు. ఇంతలో పక్క బెర్తులో కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి ‘‘అది నా పర్సు’’ అని చెప్పాడు.

‘‘మీ పర్సు అని నమ్మకం ఏమిటీ? ఏదైనా ఆనవాలు చెప్పండి?’’ అన్నా.

‘‘అందులో కృష్ణుడి ఫొటో ఉంటుందండీ’’ అన్నాడాయన.

‘‘ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ? ఇంకా ఏదైనా చెప్పండి. అయినా, మీ ఫొటో పెట్టుకోవచ్చు కదా’’ అడిగా.

అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే.

‘‘బాబూ, అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు. అప్పుడు నాకు మా అమ్మా నాన్నా అంటే చాలా ఇష్టం. అందుకని నేను వాళ్ళ ఫొటో అందులో పెట్టుకున్నాను. కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అన్న అభిప్రాయం కలిగింది నాకు. అందుకని అప్పుడు పర్సులో నా ఫొటో పెట్టుకున్నాను. నాకో ఉద్యోగం వచ్చి పెళ్ళి అయింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అపుడు ఆమె ఫొటో పర్సులో పెట్టుకునేవాడిని. ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడికోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని. వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని. వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫొటో పెట్టుకునేవాడిని.

నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది. నా కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. నన్ను మరచిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇప్పుడు నాకు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఆయనే ఇప్పుడు నాకు తోడు. నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు, నా విచారానికి ఓదారుస్తాడు. నాతో నిరంతరం ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను సమయమంతా ఆయనతోనే గడుపుతున్నాను.’’

నేను మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా. పక్క స్టేషనులో రైలు ఆగింది. రైలు దిగి బుక్‌స్టాల్‌కి వెళ్ళాను. ‘దేవుడి ఫొటోలు ఉన్నాయా... పర్సులో పెట్టుకోడానికి’ అని అడిగా.

(ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ కడదాకా అండా దండా భగవంతుడే. మనకు ఎన్ని పనులు ఉన్నా నిత్యం ఆ స్వామికి కాస్త సమయం కేటాయిస్తే ఆయన మనకు జీవితకాలం తోడుగా ఉంటాడు.)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..